వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
టోకు వినియోగదారులు15 రోజుల అవసరాలకు సరిపడే చక్కెరను మాత్రమే నిల్వ చేయాలన్న పరిమితిని 30 రోజులకు సడలించిన ప్రభుత్వం
అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ (ఏఏఎప్), టారిఫ్ రేట్ కోటా (టీఆర్‌క్యూ) ద్వారా దిగుమతి చేసుకున్న చక్కెర నుంచి మాత్రమే అదనపు స్టాకును సేకరించాలి
సుమారు 10 శాతం తగ్గిన రీటైల్ చక్కెర ధరలు: తగ్గిన మిల్లు ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని వ్యాపారులు, హోల్‌సేలర్లను కోరిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
18 SEP 2026 2:47PM by PIB Hyderabad
టోకు వినియోగదారులు15 రోజులకు సరిపడే చక్కెర మాత్రమే నిల్వ చేసుకోవాలన్న నిబంధనను ప్రభుత్వం సడలించింది. ఈ పరిమితిని 30 రోజులకు పెంచింది. అయితే 15 రోజులకు మించిన అదనపు నిల్వలను కేవలం అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ (ఏఏఎస్), టారిఫ్ రేట్ కోటా (టీఆర్‌క్యూ) ద్వారా దిగుమతి చేసుకున్న చక్కెర నుంచి మాత్రమే సేకరించాలనే షరతును విధించింది. బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేసే వారికి నిల్వ పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. అది 15 రోజుల వినియోగానికి మాత్రమే పరిమితమవుతుంది. బల్క్ వినియోగదారులు తమ దగ్గర ఉన్న చక్కెర నిల్వలను ప్రతి శుక్రవారం ప్రకటించే వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ వివరాలను ఆహారం, ప్రజా పంపిణీ విభాగం ఆన్‌లైన్ పోర్టల్ https://foodstock.dfpd.gov.in/ నమోదు చేయాలని ఆదేశించింది.
స్థిరమైన, క్రమబద్ధమైన చక్కెర మార్కెట్‌ను నిర్వహించడంలో భాగంగా చక్కెర టోకు వినియోగదారులతో ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహించింది. వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంది.
ప్రస్తుతం నెలకు 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ చక్కెరను ఉత్పత్తి లేదా వినియోగం కోసం ముడిసరకుగా ఉపయోగించే టోకు వినియోగదారులు తమ 15 రోజుల అవసరాలకు మించి నిల్వ చేయడానికి అనుమతి లేదు. రానున్న పండగ సీజన్ నేపథ్యంలో ఈ పరిమితిని సడలించాలని టోకు వినియోగదారులు ప్రభుత్వాన్ని కోరారు. అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ స్కీమ్, టారిఫ్ రేట్ కోటా కింద చక్కెరను దిగుమతి చేసుకున్నవారి దగ్గర నుంచి నేరుగా కొనుగోళ్లు చేసేందుకు అనుమతివ్వాలని విజ్క్షప్తి చేశారు. దేశీయ సరఫరాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా, పారిశ్రామిక అవసరాలకు నిరంతరాయంగా చక్కెర అందుబాటులో ఉండేలా వారు ఈ సూచన చేశారు.
టోకు వినియోగదారుల ప్రయోజనాలకు, దేశీయ చక్కెర మార్కెట్లో స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరానికి మధ్య సమతౌల్యాన్ని సాధించడమే ఈ చర్య లక్ష్యం. ఇది రాబోయే పండగ సీజన్ సందర్భంగా నిజమైన పారిశ్రామిక వినియోగదారులకు విస్తృతమైన పరిపాలనా సౌలభ్యాన్ని అందిస్తుంది. అదే సమయంలో దేశీయ నిల్వలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా దిగుమతి చేసుకున్న చక్కెర నుంచి అదనపు నిల్వలను సమకూర్చుకొనే వీలు కల్పిస్తుంది.
రీటైల్ చక్కెర ధరల్లో 10 శాతం తగ్గుదల
చక్కెర రీటైల్ ధరలు గరిష్ఠ స్థాయి నుంచి సుమారు 10 శాతం (ఆగస్టులో రూ.65 నుంచి రూ.58.50కు) తగ్గాయి. మిల్లు ధరల్లోనూ సుమారుగా 25 శాతం తగ్గుదల ఉంది. మిల్లు ధరల తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనం సరఫరా వ్యవస్థ ద్వారా వినియోగదారులకు పూర్తిగా చేరడం లేదన్న విషయాన్ని రీటైల్ ధరల తగ్గుదలలో మందగమనం సూచిస్తోందని ప్రభుత్వం గమనించింది.
ఐఎస్ఎంఏ, చక్కెర కర్మాగారాల జాతీయ సహకార సంఘం, చక్కెర వాణిజ్య రంగం ప్రతినిధులతో నిర్వహించిన సంయుక్త సమావేశంలో మిల్లు ధరల్లో తగ్గుదల రీటైల్ ధరల్లో ప్రతిబింబించడం లేదని ఆహారం, ప్రజా పంపిణీ విభాగ కార్యదర్శి అన్నారు.
చక్కెర మిల్లు ధరలు గణనీయంగా తగ్గడం వల్ల కలిగే ప్రయోజనాన్ని వెంటనే వినియోగదారులకు అందించాలని చక్కెర వ్యాపారులు, టోకు వ్యాపారులు, చిల్లర వ్యాపారులకు ప్రభుత్వం ఈ రోజు స్పష్టంగా చెప్పింది. మిల్లు స్థాయుల్లో ఇప్పటికే తగ్గిన ధరలకు అనుగుణంగానే రీటైల్ మార్కెట్లలోనూ ధరల తగ్గింపు ఉండాలని స్పష్టం చేసింది. రాబోయే పండగ సీజన్లో చక్కెర, చక్కెర ఆధారిత ఉత్పత్తులు సామాన్య వినియోగదారులకు అందుబాటు ధరల్లో లభించేలా చక్కెర సరఫరా వ్యవస్థ మొత్తం సమష్టి కృషి చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
భారతదేశ చక్కెర విధానానికి రైతు, వినియోగదారుడే ప్రధాన ఆధారాలని కార్యదర్శి చెప్పారు. చెరకు రైతుల ప్రయోజనాలను వినియోగదారులకు అందించే స్థిరమైన, సహేతుకమైన ధరలతో సమతౌల్యం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కొత్త చక్కెర సీజన్ ప్రారంభమయ్యే 2026 అక్టోబర్ 1 నుంచి చెరకు రైతులకు పెంచిన న్యాయబద్ధమైన, గిట్టుబాటు ధర (ఎఫ్‌ఆర్‌పీ) క్వింటాల్‌కు ₹365 చొప్పున అందుతుంది. చక్కెర రంగం సమతౌల్యాన్ని కాపాడుతూనే, చెరకు రైతులకు లాభదాయకమైన రాబడిని అందించడానికి ప్రభుత్వం ప్రతి ఏటా ఎఫ్‌ఆర్‌పీని పెంచుతూ వస్తోంది.
దేశీయ మార్కెట్లో చక్కెర లభ్యతను, ధరలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. వినియోగదారులకు, ఆహార శుద్ధి పరిశ్రమలకు, కర్మాగారాల అవసరాలకు తగినం చక్కెర అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలను తీసుకుంటుంది.
***
(రిలీజ్ ఐడి: 2312141)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4