ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సెప్టెంబరు 19న ‘పర్యావరణం, వాతావరణ పరిణామాల భవిత’ అంశంపై అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని


కీలక పర్యావరణ, వాతావరణ సవాళ్లపై చర్చలు, పర్యావరణ నిర్వహణ యంత్రాంగాన్ని బలోపేతం చేసే మార్గాల అన్వేషణపై సదస్సులో చర్చ

సదస్సుకు హాజరు కానున్న 17 దేశాల నిపుణులైన న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ ప్రతినిధులు.. భారత్ నుంచి విశిష్ట అతిథులు

నాడు పోస్టు చేయడమైనది: 18 SEP 2026 3:08PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 2026 సెప్టెంబర్ 19న ఉదయం 10 గంటల సమయంలో ‘పర్యావరణం, వాతావరణ పరిణామాల భవిత’ అంశంపై ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.

జాతీయ హరిత ట్రిబ్యునల్ 2026 సెప్టెంబర్ 19, 20 తేదీల్లో ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పర్యావరణ నిపుణులు, భారత సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టుల న్యాయమూర్తులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర న్యాయ అకాడమీలు, రాష్ట్ర న్యాయసేవల ప్రాధికార సంస్థలు, రాష్ట్రాల నిపుణుల అంచనా కమిటీలు (ఎస్ఈఏసీ), రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా ప్రాధికార సంస్థలు (ఎస్ఈఐఏఏ), రాష్ట్ర చిత్తడి నేలల ప్రాధికార సంస్థల ప్రతినిధులు, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు పాల్గొంటారు. అలాగే 17 దేశాలకు చెందిన నిపుణులైన న్యాయమూర్తులు, న్యాయశాఖ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో భాగస్వాములు కానున్నారు.

వివిధ అధికార పరిధుల్లో న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుంది. విధానాల రూపకల్పన, అమలులో అంతరాలతోపాటు.. పలు కీలకమైన పర్యావరణ, వాతావరణ సవాళ్లపై ఈ సదస్సులో చర్చిస్తారు. పర్యావరణ పాలనను, సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేసుకునే మార్గాలను ఈ సదస్సు అన్వేషిస్తుంది.  

 

***


(రిలీజ్ ఐడి: 2312076) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Kannada , Malayalam