ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఐహెచ్ఎఫ్‌డబ్ల్యూలో ‘2026 ప్రపంచ రోగి భద్రతా దినోత్సవా’న్ని నిర్వహించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. అసాంక్రామిక వ్యాధిగ్రస్తులను సురక్షిత పద్ధతుల్లో సంరక్షించడంపై ప్రత్యేక శ్రద్ధ

రోగిని కాపాడడానికి సువ్యవస్థిత, కాల బద్ధ నాణ్యతాపరమైన హామీ విధానాన్ని అనుసరించడం కీలకమన్న అదనపు కార్యదర్శి, ఎన్‌హెచ్ఎమ్ మిషన్ డైరెక్టరు శ్రీమతి ఆరాధన పట్నాయక్

అసాంక్రామిక వ్యాధుల బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న సమస్య పరిష్కారానికి
రోగి సురక్షతను బలోపేతం చేయడం ముఖ్యం: శ్రీమతి పట్నాయక్

సురక్షిత, నాణ్యత పూర్వక ఆరోగ్య సేవల పట్ల సామూహిక నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ‘జాతీయ రోగి సురక్షా ప్రతిజ్ఞ’ స్వీకారం

అసాంక్రామిక వ్యాధిగ్రస్తుల సంరక్షణతో పాటు
రోగి భద్రతకు రాష్ట్రాలు ప్రారంభించిన నూతన కార్యక్రమాలను ప్రస్తావించిన సాంకేతిక కార్యక్రమం

నాడు పోస్టు చేయడమైనది: 18 SEP 2026 8:07AM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘2026 ప్రపంచ రోగి భద్రతా దినోత్సవా’న్ని న్యూఢిల్లీ లోని ఎన్ఐహెచ్ఎఫ్‌డబ్ల్యూ సభాభవనంలో నిర్వహించింది. ఈ సంవత్సరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ‘‘అసాంక్రామిక వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్.. ఎన్‌సీడీస్) విషయంలో సురక్షిత సంరక్షణ’’ను ఇతివృత్తంగా స్వీకరించారు. ఎన్‌సీడీ విషయం రోగుల భద్రత, సంరక్షణకు సంబంధించిన నాణ్యత ప్రమాణాలను మరింత బలపరచడం జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశంగా ఉంది. ఈ కార్యక్రమంలో విధాన రూపకర్తలు, ఆరోగ్యసంరక్షణ రంగ ప్రముఖులు, ప్రజారోగ్య నిపుణులు, చికిత్సకులు, నాణ్యత మేనేజర్లు, అభివృద్ధి భాగస్వాములు, రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు.  

 


ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శి, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎమ్) మిషన్ డైరెక్టరు శ్రీమతి ఆరాధన పట్నాయక్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ,  రోగుల భద్రతను పటిష్టపరచడానికి, సంరక్షణ సంబంధిత నాణ్యతను మెరుగుపరచడానికి, దేశమంతటా సురక్షిత ఆరోగ్య వ్యవస్థలను తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రోగి భద్రత ఏ ఒక్క కార్యక్రమం గాని, లేదా విభాగం బాధ్యతో కాబోదని, దీనిని సంపూర్ణ ఆరోగ్య వ్యవస్థలో.. మరీ ముఖ్యంగా, ఒకరి నుంచి మరొకరికి సోకని దీర్ఘకాలిక అనారోగ్యాల (ఎన్‌సీడీస్)ను అరికట్టడం, రోగనిర్ధారణ చేయడం, చికిత్సను అందించడం, వ్యాధిగ్రస్తులను దీర్ఘకాల ప్రాతిపదికన సంరక్షించడం వంటి రంగాల్లోకి సేవలను విస్తరించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
అంటువ్యాధులు కాని రకానికి చెందిన వ్యాధులు, ఉదాహరణకు.. గుండెపోటు, పక్షవాతం, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు వంటి వాటి వల్ల బాధితులవుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోందని శ్రీమతి పట్నాయక్ ప్రస్తావించారు. భారత్‌లో దాదాపు 63 శాతం మరణాలకు ఇవే కారణమవుతున్నాయని, దీంతో ఆరోగ్య సేవలను అందించడంలో రోగులను రక్షించడం ఒక ముఖ్య భాగంగా మారిందని ఆమె తెలిపారు. ప్రజారోగ్య సంరక్షణ రంగంలో ఇటీవలి విజయాల గురించి ఆమె మాట్లాడుతూ.. 96 శాతం టీకాకరణ, 90.6 శాతం సంస్థాగత ప్రసవాలు ప్రజారోగ్య కేంద్రాల్లోనే పూర్తి అయ్యాయన్న సమాచారం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్)లో వెల్లడి అయిందన్నారు. ఆరోగ్య సంరక్షణ సంస్థలలో నాణ్యమైన, భద్రమైన పద్ధతులను అనుసరించడం.. మరీ ముఖ్యంగా రోగికి రెఫరల్ సేవలను, సంరక్షణ సేవలను నిరంతరాయంగా అందించడాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. అదే జరిగితే, సకాలంలో చక్కని సేవలు అందించడం వల్ల మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించవచ్చన్నారు.
నాణ్యతను మెరుగు పరిచే దిశగా వేగవంతమైన ప్రయత్నాలు చేపట్టాల్సిందిగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు శ్రీమతి పట్నాయక్ పిలుపునిచ్చారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్-సబ్ హెల్త్ సెంటర్ల (ఏఏఎమ్-ఎస్‌హెచ్‌సీస్)లో నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్‌స్ (ఎన్‌క్యూఏఎస్) ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో 100 శాతం ఫలితాలను సాధించడానికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పాటు ఆ ప్రణాళికను అమలుపరచడానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాల్సి ఉందని ఆమె సూచించారు. అన్ని స్థాయుల్లో రోగి భద్రతకు పూచీపడే సంస్కృతికి సంస్థాగత రూపురేఖలను ఇవ్వడానికి గాను నాణ్యత హామీ పట్ల సువ్యవస్థిత, కాల బద్ధ దృష్టికోణాన్ని అవలంబించాల్సి ఉంటుందని శ్రీమతి పట్నాయక్ స్పష్టం చేశారు.  

 


ప్రారంభ కార్యక్రమం ముగింపులో.. జాతీయ స్థాయిలో రోగి భద్రత సంబంధిత ప్రతిజ్ఞ‌ పాఠాన్ని అందరి చేత చదివింప చేశారు. ఈ ప్రతినను పూని, దేశం నలుమూలలా ఆరోగ్య సంరక్షణ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో నాణ్యత బలోపేతానికి ఆరోగ్య సేవల రంగంలోని ఆసక్తిగల వర్గాలన్నీ సామూహిక నిబద్ధతతో పనిచేస్తాయని పునరుద్ఘాటించినట్లయింది.
తదనంతరం చేపట్టిన సాంకేతిక కార్యక్రమంలో, ‘‘అసాంక్రామిక వ్యాధుల (ఎన్‌సీడీస్) విషయంలో సురక్షిత రీతులలో సంరక్షణ’’ అంశంపై ప్రత్యేక చర్చాసభను నిర్వహించారు. దీనిలో ఎన్‌సీడీ సంరక్షణ తాలూకు వివిధ దశలలో  రోగి భద్రతతో ముడిపడిన ప్రధాన సవాళ్లు, తీసుకోవలసిన చర్యలపై నిపుణులు మేధోమధనం చేశారు. చర్చలలో.. ఎన్‌సీడీ సంరక్షణ ప్రక్రియలో ఎదురయ్యే నష్ట భారం, రోగి భద్రతే లక్ష్యంగా డిజిటల్ స్వాస్థ్య ప్రణాళికను పక్కాగా అమలుచేయడం, సహ-వ్యాధిగ్రస్తతలపై ప్రత్యేక దృష్టి పెడుతూ రోగనిర్ధారణ ప్రక్రియలలో సురక్షిత రీతిన ఎన్‌సీడీ సంరక్షణను అందించడం, ఎన్‌సీడీల ప్రభావితులను కాపాడడంలో ఔషధాల ఉపయోగంలో తగిన జాగ్రత్త చర్యలను తీసుకోవడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
కార్యక్రమంలో ఆ తరువాత, వివిధ రాష్ట్రాలలో రోగి రక్షణను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణకు దిగడానికి, నాణ్యతను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలపై చర్చిస్తూ, విధానాన్ని అమలులోకి తీసుకురావడంపై కూడా దృష్టి సారించారు. కార్యక్రమంలో పాలుపంచుకున్న రాష్ట్రాల స్థాయిలో నూతన ఆవిష్కరణలను, అత్యుత్తమ విధానాలను పరస్పరం తెలియజెప్పుకొన్నారు. ఈ సందర్భంగా :
     • జార్ఖండ్‌లో వృద్ధాప్యంలో మధుమేహం, అధిక రక్తపోటును పరీక్షించేందుకు ఉపయోగిస్తున్న నమూనా,
     • కేరళలో అసాంక్రామిక వ్యాధుల నివారణ, నియంత్రణకు ప్రారంభించిన ‘హృదయరాగం’ కార్యక్రమం,
     • రాజస్థాన్‌లో ఉన్నత స్థాయి వైద్య సేవలు లేదా విశిష్ట వైద్య సేవలకు సిఫారసు చేసేందుకు ఉద్దేశించిన ఎస్ఈటీయూ (SETU) ఆన్‌లైన్ రెఫరల్ సేవల వంటివి..
ప్రస్తావనకు వచ్చాయి.ఈ అనుభవాలు ఆరోగ్య సేవల అందజేతలో వివిధ స్థాయులలో రోగి సంరక్షణను బలోపేతం చేయడానికి గాను సందర్భం వారీ విధానాలు, జ్ఞానాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడం, చక్కని ఫలితాలనిచ్చే పద్ధతులను అవలంబించడం ముఖ్యమని చాటాయి.
నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్‌స్ (ఎన్‌క్యూఏఎస్), జాతీయ రోగి భద్రత అమలు సంబంధిత ప్రాథమిక ప్రణాళిక (ఎన్‌పీఎస్ఐఎఫ్) వంటి కార్యక్రమాల ద్వారా నాణ్యత, రోగి సంరక్షణల కోసం ఉద్దేశించిన సంస్థాగత ప్రణాళికను భారత్ పటిష్ఠపరుస్తోంది. ఈ నేపథ్యంలో, ‘2026 ప్రపంచ రోగి భద్రత దినోత్సవ’ నిర్వహణ.. ఆసక్తిదారులను ఒక చోటుకు తీసుకురావడానికి, అలాగే అనుభవాలను, అత్యుత్తమ పద్ధతులను పరస్పరం వెల్లడించుకోవడానికి, ఆరోగ్య సేవల అందజేత ప్రక్రియలోని అన్ని స్థాయుల్లో రోగి భద్రతకు పూచీపడే సంస్కృతిని బలోపేతం చేయడానికి కీలక వేదికను సమకూర్చింది.


‘అందరికీ ఆరోగ్య పరిరక్షణ సేవల లభ్యత’ (యూనివర్సల్ హెల్త్ కవరేజ్.. యూహెచ్‌సీ)లక్ష్యంగా నాణ్యతపూర్వక సంరక్షణను మెరుగుపరచడానికి, రోగి భద్రతను పెంపొందింపచేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగా కట్టుబడి ఉందో జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరే నిరూపించింది. ఈ కార్యక్రమం.. చర్చ, జ్ఞానాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడం, ఉమ్మడి కార్యాచరణల ద్వారా ఆరోగ్యసేవల వ్యవస్థల్ని బలోపేతం చేయడంతో పాటు, ‘‘ప్రాణాలను నిలబెట్టడానికి సురక్షిత రీతిన సంరక్షణ’’ అన్న దార్శనికతను ముందుకు తీసుకుపోవడానికి కూడా తోడ్పడింది.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (ఎమ్ఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ)తో పాటు భాగస్వామ్య సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. వారిలో.. ఎమ్ఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ సంయుక్త కార్యదర్శి శ్రీ సిబిన్ సి. , నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ప్రొఫెసర్ (డాక్టర్) ప్రజ్ఞ‌ శర్మ, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎమ్) డైరెక్టరు శ్రీ దీపక్ సోని, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఎన్ఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) డైరెక్టరు డాక్టర్ బినోద్ కుమార్ పాత్రో, నాణ్యత,రోగుల భద్రత విషయాల్లో ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీ సలహాదారు డాక్టర్ రాజీవ్ పత్ని ఉన్నారు. విధాన రూపకర్తలు, ఆరోగ్యసంరక్షణ రంగ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, అభివృద్ధి భాగస్వాములు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
‘ప్రపంచ రోగి భద్రత దినోత్సవం’ గురించి..
వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఆమోదముద్ర వేయడంతో, ఏటా సెప్టెంబర్ 17న ‘ప్రపంచ రోగి భద్రత దినోత్సవా’న్ని పాటిస్తున్నారు. సురక్షిత ఆరోగ్య సేవల పట్ల చైతన్యాన్ని పెంపొందింప చేయడం, కార్యాచరణను ప్రోత్సహించడం కోసం ఓ అంతర్జాతీయ వేదికగా ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ‘‘అసాంక్రామిక వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్.. ఎన్‌సీడీస్) విషయంలో సురక్షిత రీతిన సంరక్షణను అందించడా’’న్ని ఈ సంవత్సరంలో ఇతివృత్తంగా తీసుకున్నారు. వ్యక్తుల నుంచి వ్యక్తులకు వ్యాపించని రోగాల సంరక్షణ ప్రక్రియలో ఎదురుకాగల నష్టాలను అడ్డుకోవడానికి ప్రాధాన్యాన్నివ్వాలని ఇది సూచించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2312068) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Tamil