వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో భారత్-నేపాల్ మధ్య వాణిజ్యం, రవాణా, అక్రమ వాణిజ్య నియంత్రణపై సహకారానికి ఏర్పాటైన అంతర-ప్రభుత్వ ఉప-కమిటీ సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 18 SEP 2026 9:48AM by PIB Hyderabad

భారత్-నేపాల్ మధ్య వాణిజ్యం, రవాణా, అక్రమ వాణిజ్య నియంత్రణపై ఏర్పాటైన అంతర-ప్రభుత్వ ఉప-కమిటీ (ఐజీఎస్‌సీ) సమావేశం సెప్టెంబర్ 16 నుంచి 17, 2026 వరకు న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో జరిగింది.

భారత ప్రతినిధి బృందానికి భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ ఉజ్వల్ కుమార్ ఘోష్ నాయకత్వం వహించగా... నేపాల్ ప్రతినిధి బృందానికి నేపాల్ ప్రభుత్వ పరిశ్రమ, వాణిజ్య, సరఫరా మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ బుద్ధ బహదుర్ గురుంగ్ నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

వాణిజ్యం, వాణిజ్య సంబంధిత అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు, ద్వైపాక్షిక వాణిజ్యం, రవాణాను సులభతరం చేసేందుకు ఐజీఎస్‌సీ కీలక ద్వైపాక్షిక సంస్థాగత వేదిక.

మార్కెట్ ప్రవేశం, కస్టమ్స్, సులభతర వాణిజ్యం, ప్రమాణాలు, ఆహార భద్రత, మొక్కల పరిరక్షణ చర్యలు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఆయుష్ ఉత్పత్తులు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు, రహదారి అనుసంధానత, ఇతర వాణిజ్య సంబంధిత అంశాలకు సంబంధించిన ఎన్నో సమస్యలను ఇరుదేశాలు ఈ సమావేశంలో సమీక్షించాయి.

భారత్, నేపాల్ ఉత్పత్తులకు మరింత మెరుగైన మార్కెట్ ప్రవేశాన్ని కల్పించే చర్యలపై ఇరువర్గాలు చర్చించాయి. వ్యవసాయ ఉత్పత్తులు, పాడి పరిశ్రమ, ఆహార పదార్థాలు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఆయుష్ ఉత్పత్తులతో పాటు ప్రమాణాలు, మొక్కల సంరక్షణ ఆవశ్యకత గురించి చర్చించారు.

కస్టమ్స్ సహకారాన్ని, వాణిజ్య సులభతరాన్ని బలోపేతం చేయటంపై రెండు దేశాలు చర్చించాయి. ఇందులో భాగంగా ముందస్తుగా సమాచారాన్ని పంచుకోవటం, అసలైన ధ్రువీకరణ పత్రాల ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ, కస్టమ్స్ ఆటోమేషన్, డిజిటలైజేషన్‌ వంటి అంశాలున్నాయి. చట్టబద్ధమైన వాణిజ్యాన్ని సులభతరం చేయటంతో పాటు వర్తించే నిబంధనలను పాటించేలా, ప్రాధాన్యతా వాణిజ్య ఏర్పాట్ల దుర్వినియోగాన్ని అరికట్టేలా చర్యలను బలోపేతం చేయటంపై ఈ చర్చలు దృష్టి సారించాయి.

ఈ చర్చల్లో రవాణా, అనుసంధానం కీలక భాగంగా నిలిచాయి. ఇరుదేశాలు రైలు, రోడ్డు అనుసంధానం, సరకు రవాణా, ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు, ల్యాండ్-పోర్ట్ మౌలిక వసతులను సమీక్షించాయి. ద్వైపాక్షిక, రవాణా వాణిజ్యానికి సంబంధించి ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాల వినియోగాన్ని మెరుగుపరచటం, ఎదురవుతున్న ఆపరేషనల్ అడ్డంకులను తొలగించటంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి.

ప్రమాణాలు, ఆహార భద్రత, మొక్కల నియంత్రణ, నాణ్యతా ప్రమాణాల అంచనా, సంస్థాగత సహకారం, సామర్థ్య పెంపుదల కార్యక్రమాలతో సహా కొనసాగుతున్న పరస్పర సహకారాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.

చట్టబద్ధమైన సరిహద్దు వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు అక్రమ వాణిజ్యం, వాణిజ్య మోసాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత ఏజెన్సీల మధ్య నిరంతర సహకారం ఎంతైనా ముఖ్యమని ఇరుదేశాలు స్పష్టం చేశాయి.

ఈ సమావేశం అత్యంత స్నేహపూర్వకంగా, సానుకూల వాతావరణంలో జరిగింది. మరింత సాంకేతిక పరిశీలన అవసరమైన అంశాలపై నిర్ణీత కాలపరిమితిలో తదుపరి చర్యలు తీసుకునేందుకు, ఇప్పటికే ఉన్న సంస్థాగత విధానాల ద్వారా నిరంతరం సంప్రదింపులు కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

భారత్, నేపాల్ మధ్య బలమైన చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలున్నాయి. నేపాల్‌కు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, ముఖ్యమైన పెట్టుబడిదారుగా కొనసాగుతోంది. ఐజీఎస్‌సీలో జరిగిన చర్చలు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, రవాణా అనుసంధానం, ఆర్థిక సహకారాన్ని మరింత బలపరుస్తాయని భావిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2311943) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil