వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ అమలుకు వీలుగా న్యూజిలాండ్ చట్టం ఆమోదం పొందడాన్ని స్వాగతించిన భారతదేశం
భారత ఎగుమతులలో నూటికి నూరు శాతం సుంకం లేని ప్రవేశాన్ని కల్పించనున్న భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 6:01PM by PIB Hyderabad
భారత్, న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ టీఏ) అమలుకు వీలుగా న్యూజిలాండ్ పార్లమెంట్ 2026 సెప్టెంబర్ 16న నూతన చట్టాన్ని ఆమోదించడాన్ని భారతదేశం స్వాగతించింది. ఈ ఒప్పందంపై 2026 ఏప్రిల్ 27న ఢిల్లీలో ఇరు దేశాలు సంతకం చేశాయి. ఈ ఒప్పందాన్ని అమలు చేయటంలో ఈ చట్టం ఆమోదం పొందడం ఒక కీలకమైన ఘట్టం. ఇది తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా దృఢంగా, విస్తృతంగా చేయడానికి భారత్, న్యూజిలాండ్‌ల ఉమ్మడి నిబద్ధతను తెలియజేస్తుంది.
నాలుగు దశాబ్దాల కాలంలో ఏ భారతీయ ప్రధాని చేయని విధంగా 2026 జూలైలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూజిలాండ్‌లో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊపునిచ్చింది. ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు ప్రధానమంత్రులు ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. భారత్- న్యూజిలాండ్ ఎఫ్‌టీఏను త్వరగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధానంగా పేర్కొన్నారు.
బలమైన ప్రజా సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, విద్య, క్రీడలు, సాంకేతికత, ఇతర రంగాల్లో విస్తరిస్తున్న సహకారంతో కూడిన సుదీర్ఘమైన, సన్నిహిత సంబంధాలను భారత్, న్యూజిలాండ్‌లు కలిగి ఉన్నాయి. ఈ బంధాలను మరింత బలోపేతం చేయడంలో.. రెండు దేశాలలోని వ్యాపారాలు, ప్రజలకు కొత్త అవకాశాలను సృష్టించడంలో ఎఫ్‌టీఏ ఒక కీలకమైన ఘట్టంగా ఉంది.
ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి భారత్ న్యూజిలాండ్‌కు చేసే ఎగుమతుల్లో 100 శాతం ఉత్పత్తులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. ఇది వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులతో సహా భారతీయ ఎగుమతులకు కొత్త అవకాశాల ద్వారాలను తెరుస్తుంది. అదేవిధంగా కలప, ఉన్ని, గొర్రె మాంసం, తోలు ముడి చర్మాలతో సహా న్యూజిలాండ్ ఎగుమతులకు భారతీయ మార్కెట్‌లో మెరుగైన, ప్రాధాన్యతతో కూడిన ప్రవేశాన్ని ఇది కల్పిస్తుంది.
ఈ ఒప్పందం సేవలు, పెట్టుబడులు.. నిపుణులు, విద్యార్థులు, యువత రాకపోకలకు సంబంధించి నూతన అవకాశాలను సృష్టిస్తుంది. ఇందులో భారతీయ నిపుణులు, విద్యార్థులకు మెరుగైన మార్గాలు కూడా ఉన్నాయి. ఇది భారతదేశంలోకి 20 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను సులభతరం చేస్తుంది. దీనితో పాటు వ్యవసాయోత్పత్తి, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, సంప్రదాయ వైద్యం, ఆయుష్, సాంకేతికత, వాణిజ్య సులభతర అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేస్తుంది.
ఈ ఒప్పందం త్వరగా అమల్లోకి వచ్చే విధంగా దేశీయ ప్రక్రియలను పూర్తి చేయడానికి భారత్, న్యూజిలాండ్‌లు కలిసి పనిచేస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2311778)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18