మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రాథమిక ఉపాధ్యాయ విద్యలో 6 నెలల సర్టిఫికెట్ కోర్సును (బ్రిడ్జ్) ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి


నాణ్యమైన విద్యను ప్రోత్సహించేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు సమగ్ర శిక్షణ అందించనున్న కోర్సు

నాడు పోస్టు చేయడమైనది: 17 SEP 2026 1:47PM by PIB Hyderabad

  న్యూఢిల్లీలో 2026 సెప్టెంబర్ 16న  ప్రాథమిక ఉపాధ్యాయ విద్యలో (పీటీఈ) ఆరు నెలల సర్టిఫికేట్ (బ్రిడ్జ్) కోర్సును కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. బీఎడ్ అర్హత కలిగి, ప్రస్తుతం విధుల్లో ఉన్న ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం ఈ కోర్సును ప్రత్యేకంగా రూపొందించారు. ప్రాథమిక స్థాయిలో బోధన ధ్రువీకరణ పత్రాన్ని పొందడానికి, ఈ కోర్సు ఉపాధ్యాయులకు కీలక మార్గంగా ఉపయోగపడుతుంది. ఈ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రాథమిక స్థాయి (1 నుంచి 5 తరగతులు) విద్యార్థులకు సమర్థవంతంగా బోధించేలా, ఉపాధ్యాయుల్లో అవసరమైన నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంపొందించడానికి సమగ్ర శిక్షణను అందిస్తుంది.

ఈ బ్రిడ్జ్ కోర్సును జాతీయ సార్వత్రిక పాఠశాల విద్యా సంస్థ (ఎన్ఐఓఎస్) అమలు చేస్తుంది. ఇది శిశు కేంద్రీకృత సమ్మిళిత, వయోవికాసానికి అనుగుణమైన బోధన పద్ధతుల్లో ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తూ, పునాది, ప్రాథమిక దశల్లో విద్యా నాణ్యతను మరింత పటిష్టం చేస్తుంది.

జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ ) మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన ఈ కోర్సు..  విద్యాపరమైన అభ్యాసంతోపాటు కనీసం 10 రోజుల ఆన్‌లైన్ ప్రత్యక్ష తరగతులు, కనీసం 20 రోజుల పాఠశాల ఆధారిత అనుభవం ద్వారా ప్రాథమిక దశ బోధనా సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది.

చిన్న పిల్లల వైవిధ్యభరితమైన అభ్యాస అవసరాలను తీర్చడంలో ఈ కోర్సు ఉపాధ్యాయులకు తోడ్పడుతుంది. ఆరు సిద్ధాంత కోర్సులు, పాఠశాల ఆధారిత ప్రాక్టికల్‌తో కూడిన ఈ కార్యక్రమం.. విద్యా రంగానికి సంబంధించిన సిద్ధాంతాలను తరగతి గది బోధన పద్ధతులతో అనుసంధానించడానికి ఒక బలమైన వ్యవస్థను అందిస్తుంది. ప్రాథమిక తరగతుల్లోని పిల్లలందరికీ నాణ్యమైన విద్య, నిరంతర అభ్యాసాన్ని అందించడానికి అవసరమైన నైపుణ్యాలు, సానుకూల దృక్పథం, విశ్లేషణాత్మక సామర్థ్యాలతో ప్రాథమిక ఉపాధ్యాయులను సాధికారత వైపు నడిపించడమే ఈ బ్రిడ్జ్ కోర్సు ముఖ్య లక్ష్యం. బోధనా వృత్తిని నిరంతర చైతన్యవంతమైనదిగా, సందర్భానుసారమైన, పరిశోధనాత్మకమైనదిగా తీర్చిదిద్దే దృక్పథాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.

దేవేష్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇతరులు కేసులో సివిల్ అప్పీల్ నంబర్ 5068/2023లో భారత సుప్రీంకోర్టు 2024 ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పు ద్వారా డీ.ఎల్.ఎడ్ అర్హత లేకుండా ప్రాథమిక ఉపాధ్యాయులుగా నియమితులైన వారి కోసం ప్రత్యేక బ్రిడ్జ్ కోర్సును రూపొందించే అధికారాన్ని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి (ఎన్‌సీటీఈ) కల్పించింది. దీని ప్రకారం 2018 జూన్ 28 నుంచి 2023 ఆగస్టు 11 మధ్య బీఎడ్ అర్హతతో ప్రాథమిక స్థాయిలో (1-5 తరగతులు) బోధించడానికి నియామకమైన ఉపాధ్యాయుల కోసం ఈ బ్రిడ్జ్ కోర్సు రూపొందించారు. 2018 జూన్ 28 నాటి ఎన్‌సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ (ఎఫ్. నెంబర్ ఎన్‌సీటీఈ రిజిస్ట్రేషన్. 012/2018) కింద నియామక రక్షణ పొందిన ఉపాధ్యాయులకు ఈ కోర్సు ప్రత్యేకంగా వర్తిస్తుంది.

ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రాథమిక విద్యా సూత్రాల లక్ష్యంగా సిద్ధాంతపరమైన, ఆచరణాత్మక అంశాలు రెండూ ఉంటాయి. బోధన మాధ్యమం హిందీ, ఆంగ్ల భాషల్లో ఉంటుంది. అయితే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న 22 అధికారిక భాషల్లో దేనిలోనైనా పబ్లిక్ పరీక్ష రాయడానికి ఉపాధ్యాయులకు అనుమతి ఉంటుంది. ఈ కోర్సును బహిరంగ మాధ్యమ (ఓడీఎల్) విధానంలో అందిస్తారు. ఇందులో ప్రత్యక్ష కార్యక్రమాలు, పాఠశాల ఆధారిత ప్రాక్టికల్స్ (బోధనా అభ్యాసం, రిఫ్లెక్టివ్ జర్నల్స్, పోర్ట్‌ఫోలియోలు), వీడియో ట్యూటోరియల్స్, ఈ-లెర్నింగ్ మెటీరియల్స్, డిజిటల్ వేదికలు కూడా ఉంటాయి. ఈ విధానం వల్ల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు తమ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వహిస్తూనే, పాఠ్యాంశాలను చురుగ్గా నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది.

ఈ కోర్సు ప్రవేశాలు ఎన్‌ఐఓఎస్ అధికారిక బ్రిడ్జ్ కోర్సు వేదిక (https://bridge.nios.ac.in) ద్వారా ఆన్‌లైన్‌లో జరుగుతాయి. అర్హులైన ఉపాధ్యాయులు దీనికోసం కేటాయించిన డాష్‌బోర్డ్ ద్వారా నమోదు చేసుకోవడం, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయడం, ప్రవేశ స్థితిని పరిశీలించుకోవడం చేయవచ్చు. స్వయం అభ్యాస సామగ్రితో సహా పాఠ్యాంశాలన్నీ డిజిటల్ రూపంలోనే అందిస్తారు. ఉపాధ్యాయుల అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆడియోలు, వీడియోలు, ఇంటరాక్టివ్ కంటెంట్ వంటి అదనపు వనరులను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు.

 
***

(రిలీజ్ ఐడి: 2311381) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Kannada