ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ సీఈఓలతో నిర్వహించిన సెమీకండక్టర్ రౌండ్‌టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి


భారతదేశ సెమీకండక్టర్ తదుపరి వృద్ధి దశలో చురుగ్గా పాల్గొనాలని సీఈఓలను కోరిన ప్రధాని

వర్ధమాన సాంకేతికతలలో తొలి దశ నాయకులలో భారత్ ఒకటిగా ఎదగాలన్న ప్రధాని

స్థిరమైన, స్పందించే విధాన వాతావరణం పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధాని

విధానపరమైన, పరిపాలనాపరమైన అంశాలపై సలహాలను పంచుకోవాల్సిందిగా పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించిన ప్రధాని

ప్రధాని నాయకత్వాన్ని, భారతదేశ సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించిన సీఈఓలు

నాడు పోస్టు చేయడమైనది: 16 SEP 2026 7:17PM by PIB Hyderabad

ఈ రోజు సేవాతీర్థ్‌లో ప్రముఖ సీఈఓలతో నిర్వహించిన సెమీకండక్టర్ రౌండ్‌టేబుల్ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వానికి, సెమీకండక్టర్ పరిశ్రమకు మధ్య సన్నిహిత సహకారానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. భారత నైపుణ్యాలు, సాంకేతిక స్వీకరణ, మౌలిక సదుపాయాల బలమైన పునాదిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్తగా వస్తోన్న సాంకేతికతలలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐ రంగంలో కోటి మందికి శిక్షణనిచ్చే లక్ష్యం గురించి మాట్లాడుతూ.. భారత్‌లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి పారిశ్రామిక దిగ్గజాల అనుభవం, సామర్థ్యాలతో కలిసి గొప్ప అవకాశాలను సృష్టించగలవని ఆయన పేర్కొన్నారు.

వర్ధమాన సాంకేతికతలకు సంబంధించిన తొలి దశ నాయకులలో భారత్ ఒకటిగా ఎదగాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. సెమీకండక్టర్ రంగంలో సాధించిన గణనీయమైన పురోగతిని ప్రస్తావించిన ఆయన.. ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి, అవకాశాల దశకు మారుతోందని తెలిపారు.

సాంకేతిక పురోగతి, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విధానాలు మారాలన్న ప్రధాని.. స్థిరమైన, స్పందించే విధాన వాతావరణం పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. విధానపరమైన, పరిపాలనాపరమైన చర్యలపై తమ సలహాలను పంచుకోవాల్సిందిగా ఆయన పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో వారి సూచనలకు తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. భారతదేశ సెమీకండక్టర్ తదుపరి వృద్ధి దశలో చురుగ్గా పాల్గొనాలని పరిశ్రమల సారథులను ఆయన కోరారు.

భారతదేశ సెమీకండక్టర్ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలను సీఈఓలు అభినందించారు. తయారీ, డిజైన్, మౌలిక సదుపాయాలు, నైపుణ్య మానవ వనరుల అభివృద్ధిలో సాధించిన పురోగతిని వారు ప్రస్తావించారు. ఐఎస్ఎం 2.0 కింద వస్తున్న అవకాశాలపై.. తయారీ, ఆర్-డీ, అధునాతన సాంకేతికతలు, అనుబంధ పరిశ్రమలతో సహా సెమీకండక్టర్ విలువ గొలుసు అంతటా సామర్థ్యాలను పెంపొందించడంలో భారత్‌కు ఉన్న సామర్థ్యంపై వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి నాయకత్వాన్ని, మద్దతును అభినందించిన సీఈఓలు..

ఇటీవలి సంవత్సరాలలో సాధించిన పురోగతి పరిశ్రమల భాగస్వామ్యానికి బలమైన పునాదిని ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీపడే సెమీకండక్టర్, సాంకేతికత కేంద్రంగా భారత్ ఎదిగేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని వారు అన్నారు.

ఈ సమావేశానికి సెమీ, మైక్రాన్, ఇన్ఫినియన్, అప్లైడ్ మెటీరియల్స్, ఏఎస్ఎంఎల్, మెర్క్, టోక్యో ఎలక్ట్రాన్ లిమిటెడ్, ఫుజిఫిల్మ్, ఏఎండీ, ఇంటెల్, టాటా ఎలక్ట్రానిక్స్, లామ్ రీసెర్చ్, రాపిడస్, ఎన్ఎక్స్‌‍పీ, ఫాక్స్‌కాన్, సెమీ కండక్టర్ డివైసెస్, అడ్వాంటెస్ట్, సెలెస్టా క్యాపిటల్, సీజీ పవర్, ఐబీఎం రీసెర్చ్ తదితర వివిధ సంస్థల సీఈఓలు, సారథులు, ప్రతినిధులు హాజరయ్యారు.

 

***


(రిలీజ్ ఐడి: 2311146) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , Malayalam , English , Marathi , हिन्दी , Assamese , Gujarati , Odia