రక్షణ మంత్రిత్వ శాఖ
అత్యంత ఎత్తయిన ప్రాంతంలో సుదీర్ఘ ట్రెక్కింగ్ ‘అపరాజిత - పరంగ్ లా-2026’ను విజయవంతంగా పూర్తిచేసిన 20 మంది ఎన్‌సీసీ మహిళా క్యాడెట్లు
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 11:42AM by PIB Hyderabad
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) ప్రతిష్టాత్మక సాహసయాత్ర అఖిల భారత బాలికల ఉన్నత పర్వత ప్రాంత సుదీర్ఘ ట్రెక్కింగ్ అపరాజిత - పరంగ్ లా-2026 ముగింపు కార్యక్రమం సెప్టెంబర్ 16, 2026న లడఖ్‌లోని కార్జోక్ వద్ద ఘనంగా జరిగింది. ఎన్‌సీసీ డీజీ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్, రక్షణ మంత్రిత్వశాఖ అడిషనల్ సెక్రటరీ శ్రీమతి దీప్తి మోహిల్ చావ్లా ఈ యాత్రను ముగించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 మంది ఎన్‌సీసీ బాలికల క్యాడెట్లతో ఉన్న ఈ బృందం… హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితి లోయను లడఖ్‌లోని చాంగ్‌థాంగ్ ప్రాంతంతో కలిపే పరాంగ్ లా పాస్ (5,578 మీటర్లు)ను ఈ యాత్ర విజయవంతంగా అధిగమించింది.
సుమారు 250 కిలోమీటర్ల దూరాన్ని 30 రోజుల్లో అధిగమించారు. ఈ మార్గం హిమానీనదాలు, మంచు మైదానాలు, నదీ లోయలతో కూడిన అత్యున్నత పర్వత ప్రాంతాల గుండా సాగింది. అధికారులు, శిక్షకులు, వైద్య సిబ్బంది, సహాయక బృందాల పర్యవేక్షణలో హిమాచల్‌ప్రదేశ్‌లోని కిబ్బర్ నుంచి లడాఖ్‌లోని కార్జోక్ వరకు సాగిన ట్రెక్కింగ్‌ను ఈ బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఆగస్టు 18, 2026న రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీలో ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు.

ఎన్‌సీసీ డీజీ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స మాట్లాడుతూ... ఈ యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన క్యాడెట్లు, సిబ్బందిని అభినందించారు. ఇలాంటి కార్యకలాపాలు యువతలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, సమష్టి కృషితో పాటు పట్టుదలను పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

యువతులు సాహస క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు, సవాలుతో కూడిన ఎత్తైన ప్రాంతాల వాతావరణంపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్రను నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్యాడెట్లను ఒకచోట చేర్చటం ద్వారా జాతీయ సమైక్యతను బలోపేతం చేయటం దీని ముఖ్య ఉద్దేశం.
***
(రిలీజ్ ఐడి: 2311021)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7