విద్యుత్తు మంత్రిత్వ శాఖ
జీ 20 ఇంధన సమృద్ధి మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న శ్రీ మనోహర్‌లాల్... సదస్సుల్లో ప్రసంగం, అమెరికా, కెనడాలతో ద్వైపాక్షిక చర్చలు
పర్యావరణ హిత ఇంధనం, నియంత్రణా సామర్థ్యం, అత్యాధునిక సాంకేతికతల్లో భారత్ పురోగతిని వివరించిన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 12:27PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ 2026 సెప్టెంబర్ 15న హోస్టన్లో నిర్వహించిన జీ20 ఇంధన సమృద్ధి కార్యవర్గ బృంద (ఎనర్జీ అబండెన్స్ వర్కింగ్ గ్రూప్) సమావేశాల్లో పాల్గొన్నారు. పిల్లర్ 1, పిల్లర్ 2 పరిధిలోని అంశాల కింద ప్రసంగించిన ఆయన.. ఇంధన సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై అమెరికా, కెనడా ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.
పిల్లర్- 1: ఇంధన భద్రత, అందుబాటు ధరల్లో బేస్‌లోడ్
సురక్షితమైన, పటిష్టమైన ఇంధన వ్యవస్థను నిర్మించడంలో భారత్ సాధిస్తున్న వేగవంతమైన పురోగతిని కేంద్ర మంత్రి వివరించారు. ప్రస్తుతం దేశంలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 552 గిగావాట్లుగా ఉందని, అందులో శిలాజేతర ఇంధనం వాటా 50 శాతానికి పైగా ఉందన్నారు. సౌర శక్తి, స్టోరేజి, అణు విద్యుత్, శుద్ధమైన వంట గ్యాస్ విస్తరణలో సాధించిన పురోగతిని గుర్తుచేశారు. పర్యావరణ అనుకూల సాంకేతికతలను ప్రోత్సహించే విధానంతోపాటు.. అంతర్జాతీయ సౌర కూటమి, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్, అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి ద్వారా అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
పిల్లర్ 2: అనుమతులు, నియంత్రణా సామర్థ్యం
అనుమతుల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు, నిబంధనల్లో పారదర్శకతను పెంచేందుకు భారత్ ప్రవేశపెట్టిన డిజిటల్ సంస్కరణలను శ్రీ మనోహర్ లాల్ వివరించారు. జాతీయ స్థాయిలో ఏక గవాక్ష విధానం, పరివేష్, పీఎం గతిశక్తి వంటి డిజిటల్ వేదికల ప్రాధాన్యాన్ని ఆయన గుర్తుచేశారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సకాలంలో పూర్తవ్వాలంటే వేగవంతమైన అనుమతులు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సామర్థ్యాభివృద్ధి, నిబంధనల ఆధునికీకరణలో జి20 దేశాల మధ్య సహకారం మరింత పెరగాలని పిలుపునిచ్చారు.
అమెరికాతో ద్వైపాక్షిక సమావేశం
అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ క్రిస్‌రైట్‌తో కేంద్ర మంత్రి శ్రీ మనోహర్‌లాల్ సమావేశమయ్యారు. కృత్రిమ మేధ, అత్యున్నత స్థాయి కంప్యూటింగ్, డేటా సెంటర్ల కోసం భారత్ సిద్ధం చేస్తున్న విద్యుత్ మౌలిక సదుపాయాల ప్రణాళికలు, అలాగే దేశంలో అణు విద్యుత్ విస్తరణ ప్రణాళికపై ఈ సందర్భంగా చర్చించారు. శుద్ధ ఇంధనం, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి సారిస్తూ... యూఎస్ - భారత్ ఇంధన భద్రత భాగస్వామ్యం కింద పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరుపక్షాలూ పునరుద్ఘాటించాయి.
కెనడాతో ద్వైపాక్షిక సమావేశం
కెనడా ఇంధన, సహజ వనరుల శాఖ మంత్రి పార్లమెంటరీ కార్యదర్శి శ్రీ కోరీ హోగన్‌తో కూడా శ్రీ మనోహర్ లాల్ సమావేశమయ్యారు. ఇంధన సామర్థ్యం, స్వల్ప ఉద్గార సాంకేతికతలు, సముద్ర మంథన్ పథకం కింద తీరప్రాంతాల్లో పరిశోధన రంగాల్లో సహకారంపై చర్చించారు. క్రమంగా విస్తరిస్తున్న భారత అన్వేషణ, ఉత్పత్తి రంగంలో భాగస్వామ్యం వహించాలని, వర్ధమాన ఇంధన సాంకేతికతల్లో భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని కెనడా కంపెనీలకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
ఇంధన వనరుల వైవిధ్యీకరణ, విశ్వసనీయ, పర్యావరణ హిత బేస్‌లోడ్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, అత్యాధునిక సాంకేతికతలను వేగంగా అందిపుచ్చుకోవడం ద్వారా.. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. దేశ పౌరులకు అందుబాటు ధరల్లో సురక్షిత, సుస్థిర విద్యుత్‌ను అందించడంతోపాటు.. అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తరిస్తూ భవిష్యత్తుకు అనుగుణమైన సమతౌల్యంతో కూడిన ఇంధన వ్యూహాన్ని భారత్ కొనసాగిస్తుందని, అంతర్జాతీయ ఇంధన స్థిరత్వానికి అర్థవంతమైన సహకారాన్ని అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2311017)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5