నీతి ఆయోగ్
వికసిత్ భారత్ కోసం ఎలక్ట్రిక్ మొబిలిటీని వ్యూహాత్మక అత్యవసరంగా అభివర్ణించిన శ్రీ రాజీవ్ గౌబా… నీతి ఆయోగ్ ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ రెండో ఎడిషన్ ప్రారంభం
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 2:50PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రాల ఈవీ పాలసీల కార్యశాలలో శ్రీ రాజీవ్ గౌబా మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ రవాణా దిశగా మళ్లే ప్రక్రియ వేగంగా సాగుతోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ (ఐఈఎంఐ) నివేదిక రెండో ఎడిషన్‌ను ఆవిష్కరించారు.
2025లో అమెరికాలో కొత్త కార్ల విక్రయాల్లో దాదాపు పదో వంతు, ఈయూలో పావు వంతుకు పైగా, చైనాలో సగానికి పైగా ఎలక్ట్రిక్ కార్లే అమ్ముడైనట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఈ వాటాలు మరింత గణనీయంగా పెరుగుతాయని అంచనా వేశారు. 1970ల నాటి చమురు సంక్షోభాలు ఇంధన సామర్థ్యాన్ని పెంచే దిశగా ప్రపంచాన్ని నడిపించినట్లుగా, ఇటీవల జరిగిన పశ్చిమాసియా సంక్షోభం కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీకి కీలక మలుపు అవుతుందని అభిప్రాయపడ్డారు.
వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనకు ఈ మార్పు 'ఒక ఆర్థిక, పర్యావరణ, వ్యూహాత్మక అవసరమని' అభివర్ణిస్తూ... భారత్ ముడిచమురు అవసరాల్లో దాదాపు 89 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగకపోతే భవిష్యత్తులో కార్ల వాడకం పెరిగే కొద్దీ దిగుమతులపై ఆధారపడటం మరింత పెరుగుతుందన్నారు. ఆటోమొబైల్ రంగం జీడీపీలో దాదాపు 7.1 శాతం మేర దోహదపడుతోందని, సుమారు 1.9 కోట్ల ఉద్యోగాలకు మద్దతునిస్తోందని వెల్లడించారు. ఈ రంగాన్ని ఎలక్ట్రిక్ వాహనాల దిశగా జరుగుతున్న ప్రపంచ మార్పునకు అనుగుణంగా ఉంచాల్సిన ప్రాముఖ్యతను ఇది స్పష్టం చేస్తోంది. ఢిల్లీ వంటి నగరాల్లో వాహనాల ఉద్గారాల వల్ల కలుగుతున్న తీవ్రమైన ప్రజారోగ్య వ్యత్యాసాలను ఆయన ప్రస్తావిస్తూ... పరిశుభ్రమైన రవాణా వ్యవస్థ వైపు మారటం అత్యవసరమని పేర్కొన్నారు.
ఫేమ్, పీఎం ఈ-డ్రైవ్, పీఎం ఈ-బస్ సేవా వంటి పథకాలతో పాటు ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు, అధునాతన కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ నిల్వ కోసం ఉద్దేశించిన రెండు ఉత్పాదకత ప్రోత్సాహక పథకాల ద్వారా రూ. 92,000 కోట్లకుపైగా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఇప్పటికే అందించినట్లు వివరించారు.
చమురు మార్కెటింగ్ కంపెనీలు, ప్రైవేట్ సంస్థల సహకారంతో ఈవీ ఛార్జింగ్ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని ఆయన తెలిపారు. కొత్తగా ప్రారంభించిన యునిఫైడ్ భారత్ ఈ-ఛార్జ్ యాప్, ఛార్జింగ్ వసతులను వినియోగదారులకు మరింత సులువుగా, సౌకర్యవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
రాష్ట్రాల గురించి ప్రస్తావిస్తూ... భారతదేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, 29 ప్రాంతాలు ఇప్పటివరకు ఈవీ విధానాలను ప్రకటించాయని ఆయన తెలిపారు. ఐఈఎంఐ స్కోర్లు అన్నిచోట్లా మెరుగవుతున్నట్లు చూపించాయి. గతేడాదిలో అత్యధిక రాష్ట్ర స్కోరు 77 నుంచి 84కి, మీడియన్ స్కోరు 36 నుంచి 40కి పెరిగింది.
రాష్ట్రాల పురోగతిని పర్యవేక్షించేందుకు, సాక్ష్యాధారిత విధానాలను రూపొందించేందుకు ఈ ఇండెక్స్ డేటా ఆధారిత వ్యవస్థను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. సొంత పారిశ్రామిక ఆధారం, ఆర్థిక సామర్థ్యం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఈ-మొబిలిటీలో రాష్ట్రాల అనుభవాలు భిన్నంగా ఉండటం సమస్య కాదని, రాష్ట్రాలు పరస్పరం నేర్చుకుంటే బలంగా మారుతుందని స్పష్టం చేశారు. ఎంపిక చేసిన నగరాల్లో ప్రజా రవాణాను విద్యుద్దీకరించటానికి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు తగినంతగా, విశ్వసనీయంగా ఉండేలా చూడటానికి, పరిశోధన, ఆవిష్కరణల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు.
పూర్తి నివేదికను ఇక్కడి చూడండి: https://www.niti.gov.in/sites/default/files/2026-09/India-Electric-Mobility-Index-IEMI-2025.pdf
****
(రిలీజ్ ఐడి: 2311009)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7