జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) కోసం స్వచ్ఛ్ సేవా ఆకలన్’ను ప్రారంభించిన తాగునీరు, పారిశుధ్య విభాగం

గ్రామీణ పారిశుధ్య సేవలను అంచనా వేయడానికి గ్రామ పంచాయతీ స్థాయిలో వార్షిక డిజిటల్ సెల్ఫ్-అసెస్‌మెంట్ ఫ్రేంవర్క్

సాముదాయిక భాగస్వామ్యాన్ని, పారదర్శకతను, జవాబుదారుతనాన్ని బలపరచడానికి గ్రామ సభ ద్వారా ప్రామాణికీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 16 SEP 2026 1:41PM by PIB Hyderabad

‘స్వచ్ఛ్ సేవా ఆకలన్’ (ఎస్ఎస్ఏ)ను కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్ నిన్న, అంటే 2026 సెప్టెంబర్ 15న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన ఒక సమావేశంలో ప్రారంభించారు. ఈ సమావేశంలో జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న పాల్గొన్నారు. గ్రామీణ పారిశుధ్య బాధ్యతలను నిర్వహిస్తున్న మంత్రులు, సంబంధిత అధికారులు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్)కు చెందిన మిషన్ డైరెక్టర్లు కూడా దృశ్య మాధ్యమం ద్వారా ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు.

‘స్వచ్ఛ్ సేవా ఆకలన్’ (ఎస్ఎస్ఏ) ఏటా నిర్వహించే ప్రక్రియ. దీనిని తాగునీరు, పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛ్ భారత్ మిషన్ (గ్రామీణ్) 2.0లో భాగంగా రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య సేవల లభ్యతను అంచనా వేయడం, పర్యవేక్షించడం ఎస్ఎస్ఏ ఉద్దేశాలు. బహుళ అంచెలతో కూడిన మూల్యాంకన సంబంధిత ప్రాథమిక ప్రణాళిక (ఫ్రేంవర్క్)లో క్షేత్ర స్థాయి పారిశుధ్య సేవల లభ్యతను బలోపేతం చేయడానికి గ్రామ పంచాయతీలు, గ్రామ సభలు, గ్రామ జల పారిశుధ్య సంఘాలు (వీడబ్ల్యూఎస్‌సీ), జిల్లా, రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంత స్థాయి అధికారులు ఇందులో భాగం పంచుకోవాలని సూచించారు.

‘స్వచ్ఛ్ సేవా ఆకలన్‌’లో భాగంగా, ఓడీఎఫ్ ప్లస్ (మాడల్)గా ప్రకటించిన గ్రామ పంచాయతులు తమ గ్రామ జల పారిశుధ్య సంఘాలు (వీడబ్ల్యూఎస్‌సీ), స్థానిక సముదాయాలతో కలిసి గ్రామ పంచాయతీలో ఓడీఎఫ్ సుస్థిరత, కంటికి కనిపించే పరిశుభ్రత తీరుతెన్నులు, ఘన రూప, ద్రవ రూప వ్యర్థ పదార్థాల నిర్వహణ (ఎస్ఎల్‌డబ్ల్యూఎమ్) స్థితిగతులను అంచనా వేస్తాయి. పారిశుధ్య కార్యకలాపాలు, నిర్వహణ (ఓ&ఎమ్) తీరుతెన్నులు, సముదాయ సంబంధిత ఎస్ఎల్‌డబ్ల్యూఎమ్ వనరుల పనితీరుపై స్వీయ అంచనా పద్ధతిలో ఎస్ఎస్ఏను పూర్తి చేస్తారు. ఇందులో వెల్లడి అయిన అంశాలను తత్సంబంధిత గ్రామ సభలో చర్చించి, సరిచూస్తారు. నివేదికను జిల్లా, రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంత అధికారులకు డీడబ్ల్యూఎస్ఎమ్/ఎస్‌డబ్ల్యూఎస్ఎమ్ సమావేశాల్లో సమీక్ష కోసం అందుబాటులో ఉంచుతారు. దీంతో ఈ అధికారులు సేవల అందజేతలో లోటుపాట్లను గుర్తించగలుగుతారు. క్షేత్ర స్థాయిలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి అవసరమైన మెరుగుదల ప్రణాళికలను సిద్ధం చేస్తారు.

73వ రాజ్యాంగ సవరణ చట్ట స్ఫూర్తికి అనుగుణంగా.. గ్రామ పంచాయతులకు, గ్రామ సభలకు వాటి విజయాలతో పాటు ప్రగతిని కూడా సమీక్షించుకొని ఏవైనా మెరుగుదల చర్యలను తీసుకోవలసి ఉంటే ఆ దిశగా తదేక శ్రద్ధతో కూడిన ప్రయత్నాలు చేపట్టడానికి సాధికారతను ఈ ప్రక్రియ కల్పిస్తుంది.

***


(రిలీజ్ ఐడి: 2310948) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada