ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో సెప్టెంబర్ 17న సెమికాన్ ఇండియా–2026ను ప్రారంభించనున్న పీఎం


సెమికాన్ ఇండియా–2026 ఇతివృత్తం: ‘సిలికాన్ నుంచి సిస్టమ్స్ వరకు: వ్యవస్థ నిర్మాణం’

కార్యక్రమంలో పాల్గొంటున్న 52 దేశాలకు చెందిన 600కు పైగా సంస్థలు, ప్రతినిధులు

సెమికాన్ ఇండియా–2026లో జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్‌‌కు ప్రాతినిధ్యం వహించే ఆరు కంట్రీ పెవిలియన్ల ఏర్పాటు

నాడు పోస్టు చేయడమైనది: 16 SEP 2026 11:47AM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా–2026ను సెప్టెంబర్ 17 ఉదయం సుమారు 10 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

2026 సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. ‘సిలికాన్ నుంచి సిస్టమ్స్ వరకు: వ్యవస్థ నిర్మాణం’ అనే ఇతివృత్తం ఆధారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ విలువ ఆధారిత వ్యవస్థకు చెందిన ప్రపంచ, భారతీయ సంస్థలను, విధాన రూపకర్తలను, పెట్టుబడిదారులను, పరిశోధకులను, అంకురసంస్థలను, విద్యాసంస్థలను, విద్యార్థులను ఒకే వేదిక పైకి ఈ కార్యక్రమం తీసుకువస్తుంది. భారతదేశంలో సహకారాన్ని, పెట్టుబడులను, ఆవిష్కరణలను, ప్రతిభాభివృద్ధిని ప్రోత్సహించడంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. ఈ సదస్సుకు సమాంతరంగా నిర్వహించే కార్యక్రమాల్లో డిస్‌ప్లే రంగంలో సాధిస్తున్న పురోగతులు, సహకారాన్ని, ఉమ్మడి వెంచర్లను రూపొందించేందుకు ఆరు కంట్రీ రౌండ్ టేబుల్ సమావేశాలు, మహిళా నాయకత్వంపై చర్చ, తదితర సెషన్లు ఉంటాయి.

సమగ్ర విలువ ఆధారిత వ్యవస్థ విధానాన్ని సెమికాన్ ఇండియా–2026 అవలంబిస్తుంది. సెమికండక్టర్ ముడి పదార్థాలు, పరికరాలు, చిప్ డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్, అధునాతన ప్యాకేజింగ్, ఎలక్ట్రానిక్స్, సిస్టమ్స్ వరకు సాగే సమగ్ర ప్రయాణాన్ని ఈ సదస్సు ప్రదర్శిస్తుంది. సెమీకండక్టర్ రంగంలో సాగుతున్న ఈ ప్రయాణాన్ని సరికొత్త ‘సాండ్ టు సిలికాన్ టు సిస్టమ్స్’ విలువ ఆధారిత వ్యవస్థ అనుభవం ప్రదర్శిస్తుంది.

సెమికాన్ ఇండియా–2026లో 600కు పైగా సంస్థలు పాల్గొంటున్నాయి. 52 దేశాలకు చెందిన ప్రతినిధులు, 400 మందికి పైగా ఎగ్జిక్యూటివ్‌లు, 150 మందికి పైగా వక్తలు హాజరవుతున్నారు. ఈ సదస్సు దాదాపు 50,000 మంది సందర్శకులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఆరు కంట్రీ పెవిలియన్లతో పాటు 12 స్టేట్ బూత్‌లు, ఒక స్టార్టప్ పెవిలియన్, ఇన్నోవేషన్ షోకేష్, స్టూడెంట్ హ్యాకథాన్, వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్ పెవిలియన్ ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2310765) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , Malayalam , English , हिन्दी , Bengali , Assamese , Gujarati , Kannada