రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
నూతన సాంకేతికతతో జాతీయ రహదారి హెల్ప్‌లైన్ 1033లో మార్పులు చేపట్టనున్న ఎన్‌హెచ్ఏఐ
అత్యవసర పరిస్థితులు, వాహనాలు పాడవడం, ఇతర రహదారి సంబంధిత సమస్యల సమయంలో జాతీయ రహదారి వినియోగదారులకు వేగంగా సహాయం అందించనున్న నూతన వ్యవస్థ
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2026 5:29PM by PIB Hyderabad
జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రజలకు వేగంగా, మెరుగైన సహాయం అందించడమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) తన ప్రస్తుత జాతీయ రహదారి హెల్ప్‌లైన్ 1033 వ్యవస్థను అధునాతన సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. అప్‌గ్రేడ్ చేసిన ఈ 1033 హెల్ప్‌లైన్... కృత్రిమ మేధ, రియల్-టైమ్ లొకేషన్ ట్రాకింగ్, స్మార్ట్ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థల వంటి సాంకేతికతలను ఉపయోగించుకుంటుంది. ఈ మెరుగుదలతో 1033 జాతీయ రహదారి హెల్ప్‌లైన్‌కు కాల్ చేసే వారి లొకేషన్‌ను గుర్తించడానికి, వివిధ భారతీయ భాషల్లో వచ్చే కాల్స్‌ను అర్థం చేసుకోవడానికి, సరైన సహాయాన్ని ఆ ప్రదేశానికి మరింత త్వరగా పంపడానికి వీలుంటుంది. ముఖ్యంగా మానవ విచక్షణ, నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి అయిన అత్యవసర పరిస్థితుల్లో, మానవ ఆపరేటర్లు కీలక పాత్ర కొనసాగుతూనే ఉంటుంది.
1033 హెల్ప్‌లైన్ ఇరవై నాలుగు గంటలూ సహాయాన్ని అందిస్తుంది.
1033 హెల్ప్‌లైన్‌ను 2018లో ప్రవేశపెట్టారు. ఇది వారంలోని ఏడు రోజులూ, రోజులో 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఇది జాతీయ రహదారి వినియోగదారులకు కింది విషయాల్లో సహాయపడుతుంది:
-
వైద్యపరమైన అత్యవసరాలు.
-
వాహనం పాడవడం.
-
అంబులెన్సులు, క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాల సహాయం.
-
టోల్ ప్లాజా, ఫాస్టాగ్ సంబంధిత సమస్యలు.
-
జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే ఇతర సమస్యలు.
ఈ హెల్ప్‌లైన్ ప్రస్తుతం 1.46 లక్షల కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను కవర్ చేస్తూ, ప్రతిరోజూ సుమారు 15,000 కాల్స్ స్వీకరిస్తోంది. ఇది బహుళ భాషల్లోనూ సహాయాన్ని అందిస్తుంది.
కొత్త వ్యవస్థతో మెరుగయ్యేవి ఏమిటి?
ఆధునిక 1033 ప్లాట్‌ఫారమ్ కింది ప్రయోజనాలను అందిస్తుంది:
-
వేగవంతమైన సహాయం: కాల్‌లు స్వీకరించడం, అవసరమైన ప్రదేశానికి సహాయం పంపడానికి మెరుగైన వ్యవస్థలు.
-
లొకేషన్ గుర్తింపు: అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి సహాయపడేలా, కాల్ చేసిన వారి లొకేషన్ ఎప్పటికప్పుడు నమోదు చేయడం.
-
బహుభాషా మద్దతు: వివిధ భారతీయ భాషల్లో కాల్‌లను నిర్వహించడానికి ఏఐ సహాయం.
-
స్మార్ట్ డిస్పాచ్: అత్యంత అనువైన అంబులెన్స్, క్రేన్ లేదా పెట్రోలింగ్ వాహనాన్ని గుర్తించి పంపడంలో సహాయపడే స్మార్ట్ వ్యవస్థలు.
-
ముందస్తు హెచ్చరికలు: సంఘటనలు, ఇతర ముఖ్యమైన పరిణామాల గురించి రహదారి వినియోగదారులకు సకాలంలో అందించే సలహాలు.
-
మెరుగైన సమన్వయం: హెల్ప్‌లైన్, అత్యవసర సేవలు, జాతీయ రహదారి సంబంధిత కార్యాచరణ బృందాల మధ్య మెరుగైన సమన్వయం.
ఎన్‌హెచ్ఏఐ ఆధ్వర్యంలోని ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్... అత్యాధునిక 1033 హెల్ప్‌లైన్, కాల్ సెంటర్ అభివృద్ధి, రూపకల్పన, అమలు, నిర్వహణ, పర్యవేక్షణ కోసం కంపెనీలు, కన్సార్టియంల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, 24x7 కాల్-సెంటర్ కార్యకలాపాలు, అత్యవసర ప్రతిస్పందన సేవల్లో నైపుణ్యం అవసరం. మొబిలిటీ, రైడ్-హెయిలింగ్, లాజిస్టిక్స్, క్విక్-కామర్స్, ప్రజా భద్రత, కంప్యూటర్-ఎయిడెడ్ డిస్పాచ్, వాయిస్ ఏఐ, భారతీయ భాషల స్పీచ్-రికగ్నిషన్ సాంకేతికతల వంటి రంగాల్లో పనిచేస్తున్న కంపెనీలు ఇందులో పాల్గొనవలసిందిగా కోరడమైనది.
నూతన ప్లాట్‌ఫారమ్ అభివృద్ధిలో సహాయం కోసం పరిశ్రమ నుంచి ఫీడ్‌బ్యాక్
విశ్వసనీయమైన, విస్తరించదగిన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఐహెచ్ఎంసీఎల్ పరిశ్రమ నిపుణుల నుంచి సూచనలు, సాంకేతిక సలహాలను కోరుతోంది. అవసరాలను ఖరారు చేసేటప్పుడు సంబంధిత పరిశ్రమ ఉత్తమ పద్ధతులనూ పరిగణనలోకి తీసుకుంటారు.
అప్‌గ్రేడ్ చేసిన 1033 హెల్ప్‌లైన్... జాతీయ రహదారులపై పౌరులకు సహాయాన్ని మరింత వేగవంతంగా, సమన్వయంతో, సౌకర్యవంతంగా అందిస్తుందని భావిస్తున్నారు. సాంకేతికతను మానవ సహాయంతో మేళవించడం ద్వారా... దేశవ్యాప్తంగా రహదారి వినియోగదారుల భద్రతను, ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యాన్ని ఎన్‌హెచ్ఏఐ నిర్దేశించుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2310205)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9