ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, సమీకృత ప్రజారోగ్య ల్యాబొరేటరీలను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జేపీ నడ్డా

రోగి తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రాణాలను కాపాడే సామర్థ్యాన్ని, వ్యాధి ముప్పులు పెద్ద ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితులుగా మారకముందే వాటిని గుర్తించి స్పందించే సామర్థ్యానికి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, సమీకృత ప్రజారోగ్య ల్యాబొరేటరీలు నిదర్శనాలు: శ్రీ జేపీ నడ్డా

“భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే వైద్యారోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు సాధారణ ఆరోగ్య సేవలు నిరంతరాయంగా అందేలా చూడాలనే ఉద్దేశంతో రూపుదిద్దుకున్న పీఎం-అభిమ్’’

“పీఎం-అభిమ్ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 631 క్రిటికల్ కేర్ బ్లాక్‌లను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం... దీని ద్వారా దేశవ్యాప్తంగా ఏర్పడనున్న క్రిటికల్ కేర్ సామర్థ్యాల నెట్‌వర్క్”

“గతంలో నివారణాత్మక ఆరోగ్య సంరక్షణపైనే ఎక్కువగా దృష్టి ఉండేది... అయితే 2017 నుంచి నివారణాత్మక, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణల మధ్య బలమైన అనుసంధానాన్ని అభివృద్ధి చేసే విధానాన్ని అవలంబిస్తున్నాం”

ప్రజల ఇంటి వద్దే ఆరోగ్య సేవలను అందించటంతో పాటు 41 ఆరోగ్య విభాగాల్లో పరీక్షలను సులభతరం చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న 'సంజీవని' కార్యక్రమాన్ని ప్రశంసించిన శ్రీ జేపీ నడ్డా

నాడు పోస్టు చేయడమైనది: 12 SEP 2026 2:52PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లను (సీసీబీలు), 12 సమీకృత ప్రజారోగ్య ల్యాబొరేటరీలను (ఐపీహెచ్ఎల్) ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడుఆరోగ్య- కుటుంబ సంక్షేమం- వైద్య విద్యా శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్పార్లమెంట్ సభ్యులుశాసనసభ్యులుశాసనమండలి సభ్యులుసీనియర్ అధికారులువైద్యులుఆరోగ్య సంరక్షణ నిపుణుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ రోజు ప్రారంభించిన 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు జీఎంసీ కడపఏసీఎస్‌ఆర్ జీఎంసీ నెల్లూరుజీఎంసీ శ్రీకాకుళంఏఎంసీ విశాఖపట్నంజీఎంసీ ఒంగోలుజిల్లా ఆసుపత్రి అనకాపల్లిజీఎంసీ రాజమహేంద్రవరంకేఎంసీ కర్నూలుజిల్లా ఆసుపత్రి హిందూపూర్ఎస్ఎంసీ విజయవాడలలో ఉన్నాయి. 12 సమీకృత ప్రజారోగ్య ల్యాబొరేటరీలు ఏరియా ఆసుపత్రి సీతంపేటఏరియా ఆసుపత్రి గుంతకల్లుఏరియా ఆసుపత్రి పలమనేరుఏరియా ఆసుపత్రి అగనంపూడిఏరియా ఆసుపత్రి నందిగామఏరియా ఆసుపత్రి చీరాలఏరియా ఆసుపత్రి అరకుఏరియా ఆసుపత్రి నరసరావుపేటఏరియా ఆసుపత్రి బనగానపల్లెఏరియా ఆసుపత్రి అనపర్తిఏరియా ఆసుపత్రి తునిఏరియా ఆసుపత్రి గూడూరులలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రజా ఆరోగ్య సన్నద్ధతనుఆరోగ్య భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సౌకర్యాలు ఒక ప్రధాన ముందడుగు అని శ్రీ జేపీ నడ్డా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ జేపీ నడ్డా మాట్లాడుతూ... “ఇది కేవలం ఒక మౌలిక వసతుల ప్రారంభోత్సవం మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్‌కు, దేశానికి బలమైన ఆరోగ్య భద్రతా వ్యవస్థను నిర్మించడంలో ఒక కీలకమైన అడుగు” అని అన్నారు. క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, సమీకృత ప్రజారోగ్య ల్యాబొరేటరీలు.. ‘ఒక రోగి తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రాణాలను కాపాడే సామర్థ్యం, వ్యాధి ముప్పులు పెద్ద ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితులుగా మారకముందే వాటిని గుర్తించి స్పందించే శక్తి’ అనే సుస్థిర ఆరోగ్య వ్యవస్థకు చెందిన రెండు అత్యవసర పార్శ్వాలను తెలియజేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 

కోవిడ్-19 మహమ్మారి నేర్పిన పాఠాలను గుర్తుచేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి... ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎంత త్వరగా ఆర్థిక, సామాజిక, ఉపాధిపరమైన, అంతిమంగా జాతీయ అత్యవసర పరిస్థితిగా మారుతుందో ఈ సంక్షోభం నిరూపించిందని అన్నారు. “ఆరోగ్య భద్రత అంటే జాతీయ భద్రతే అని కోవిడ్-19 మనకు తెలియజేసింది” అని ఆయన వ్యాఖ్యానించారు. సాధారణ ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా ఆరోగ్య మౌలిక వసతులు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా ఉండాల్సిన అవసరాన్ని కూడా ఈ మహమ్మారి చెప్పిందని అన్నారు. 

మహమ్మారి సమయంలో సాధారణ ఆసుపత్రి మౌలిక వసతులను ఐసోలేషన్, కోవిడ్ కేర్ సదుపాయాలుగా మార్చాల్సి వచ్చిందని... దీనివల్ల కోవిడ్ కాని అత్యవసర ఆరోగ్య సేవలందించడంలో ఆటంకం ఏర్పడిందని శ్రీ జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు, ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు సాధారణ ఆరోగ్య సేవలు నిరంతరంగా అందేలా చూడాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-అభిమ్) రూపుదిద్దుకుందన్నారు. 

మనం ఇకపై ఆసుపత్రులను కేవలం బెడ్‌ల సంఖ్య ఆధారంగా మాత్రమే చూడలేం” అని శ్రీ జేపీ నడ్డా అన్నారు. “ఒక సుస్థిర ఆరోగ్య వ్యవస్థలో క్రిటికల్ కేర్ సామర్థ్యం, ఆక్సిజన్- మెడికల్-గ్యాస్ వ్యవస్థలు, ఐసోలేషన్ సదుపాయాలు, శిక్షణ పొందిన మానవ వనరులు, ల్యాబొరేటరీ సామర్థ్యం, సాధారణ ఆరోగ్య సేవలను కొనసాగిస్తూనే వ్యాధి వ్యాప్తిని ముందస్తుగా గుర్తించగల సత్తా ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. 

పీఎం-అభిమ్ భారతదేశ ప్రజారోగ్య మౌలిక వసతుల విధానంలో ఒక ప్రాథమిక మార్పును సూచిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. “మరిన్ని సౌకర్యాలను నిర్మించడం మాత్రమే మా ఉద్దేశం కాదు. భవిష్యత్తులో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా, అనుసంధానంగా, స్థిరంగా, సమర్థవంతంగా ఉండే ఆరోగ్య వ్యవస్థను సృష్టించడమే మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.

పీఎం-అభిమ్ కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా క్రిటికల్ కేర్ సామర్థ్యాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 631 క్రిటికల్ కేర్ బ్లాక్‌లను మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఐదేళ్ల పథక కాలానికి గాను క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, సమీకృత ప్రజారోగ్య ల్యాబొరేటరీలు, అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు, గ్రామీణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు అనే నాలుగు ప్రధాన భాగాల కింద కేంద్ర ప్రభుత్వం రూ. 1,271.80 కోట్లను ఆమోదించింది. కమ్యూనిటీ స్థాయి నుంచి జిల్లా, తృతీయ సంరక్షణ సౌకర్యాల వరకు ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో ప్రభుత్వ సమగ్ర విధానాన్ని ఇది తెలియజేస్తోందని శ్రీ జేపీ నడ్డా పేర్కొన్నారు.

పీఎం-అభిమ్ కింద ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ. 606 కోట్ల అంచనా వ్యయంతో 24 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు మంజూరు అయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులలో ఇవి ప్రణాళికాబద్ధంగా ఏర్పాటవుతున్నాయి. అధునాతన వైద్య సేవలు సకాలంలో అందుబాటులో ఉండాల్సిన ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన శ్రీ జేపీ నడ్డా... “క్రిటికల్ కేర్ సేవలు ప్రజలకు అందుబాటులో, సమీపంలోనే ఉండాలి” అని అన్నారు.

క్రిటికల్ కేర్ బ్లాక్‌లు (సీసీబీలు) తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు చికిత్స అందించే ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తే సమీకృత ప్రజారోగ్య ల్యాబొరేటరీలు వ్యాధులను అర్థం చేసుకునే, గుర్తించే, నియంత్రించే శక్తిని పెంపొందిస్తాయని శ్రీ జేపీ నడ్డా అన్నారు. పీఎం-అభిమ్ కింద ఆంధ్రప్రదేశ్ కోసం రూ. 32.50 కోట్ల కేటాయింపుతో 26 సమీకృత ప్రజారోగ్య ల్యాబొరేటరీలు మంజూరు అయ్యాయి. మొత్తం 26 ఐపీహెచ్‌ఎల్‌ల సివిల్ పనులు పూర్తయ్యాయి. వాటిలో 14 ఇప్పటికే పనిచేస్తుండగా మిగిలిన 12 ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.

కోవిడ్-19 నేర్పిన పాఠం చాలా స్పష్టంగా ఉంది. మనం ఒక ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ముందుగానే గుర్తించలేకపోతే దానిని సమర్థవంతంగా ఎదుర్కోలేం” అని శ్రీ జేపీ నడ్డా అన్నారు. ల్యాబొరేటరీ సామర్థ్యాన్ని కేవలం ఒక రోగ నిర్ధారణ సేవగా మాత్రమే కాకుండా జాతీయ ఆరోగ్య భద్రతలో ఒక కీలక భాగంగా ఆయన అభివర్ణించారు.

పీఎం-అభిమ్ కింద ప్రభుత్వం తృతీయ ఆసుపత్రులకే పరిమితం కాకుండా అన్ని స్థాయిల ఆరోగ్య సంరక్షణపై పనిచేస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. చిట్టచివరి స్థాయిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి. బలోపేతమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు) రిఫరల్, ద్వితీయ సంరక్షణను అందిస్తున్నాయి. క్రిటికల్ కేర్ బ్లాక్‌లు జిల్లా స్థాయిలో అధునాతన అత్యవసర, ఇంటెన్సివ్ కేర్‌ను ఐపీహెచ్‌ఎల్‌లు డయాగ్నస్టిక్, నిఘా సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. “ఇవన్నీ కలిసి సంరక్షణ నిరంతరతను, ప్రజా ఆరోగ్య సన్నద్ధతను సృష్టిస్తాయి” అని ఆయన పేర్కొన్నారు. భారతదేశ ఆరోగ్య విధానంలో ఇదొక ముఖ్యమైన మార్పు అన్న ఆయన.. “మనం ఆసుపత్రి-కేంద్రీకృత విధానం నుంచి ఆరోగ్య-వ్యవస్థ విధానం వైపు వెళ్తున్నాం” అని తెలిపారు.

భారత ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తనను... ఆరోగ్య సంరక్షణ పట్ల నివారణాత్మక, ప్రోత్సాహక, సమగ్ర దృక్పథం దిశగా ముఖ్యమైన మార్పును సూచించిన జాతీయ ఆరోగ్య విధానం-2017 నేపథ్యంలో చూడాలని శ్రీ నడ్డా అన్నారు. 2017కి ముందు ప్రధానంగా నివారణాత్మక ఆరోగ్య సంరక్షణపైనే దృష్టి సారించగా... ఆ తర్వాత నివారణాత్మక, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సంరక్షణల మధ్య బలమైన అనుసంధానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని ఆయన తెలిపారు. "ఆరోగ్య సంరక్షణను సమగ్రంగా, ప్రజా-కేంద్రితంగా మార్చేందుకు నివారణాత్మక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సంరక్షణల మధ్య బలమైన అనుసంధానాన్ని అభివృద్ధి చేయడానికి మేం ప్రయత్నించాం" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విధానం ఫలితంగానే ప్రాథమిక, ద్వితీయ శ్రేణి ఆరోగ్య సంరక్షణను ఏకకాలంలో బలోపేతం చేయడం... తృతీయ శ్రేణి ఆరోగ్య సంరక్షణ సంస్థలను విస్తరించడం సహా మరింత సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏర్పాటు సాధ్యమైందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 1.75 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను స్థాపించడం ద్వారా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రజల ఇంటి వద్దకే తీసుకువచ్చామని శ్రీ నడ్డా అన్నారు. ఈ కేంద్రాలు మధుమేహం, అధిక రక్తపోటు సంబంధిత పరీక్షలు, ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు, రోగనిరోధక టీకాలు, ఇతర నివారణాత్మక, ప్రోత్సాహక ఆరోగ్య సంరక్షణ సేవలు సహా అనేక రకాల సేవలను అందిస్తాయి. 42 కోట్లకు పైగా ప్రజలకు మధుమేహం, అధిక రక్తపోటు పరీక్షలు, 36 కోట్లకు పైగా నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్ తరాలను గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షించడానికి ఉచిత హెచ్‌పీవీ టీకాను ప్రవేశపెట్టడం నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ బలోపేతం దిశగా కీలక ముందడుగనీ కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

డిజిటల్ టెక్నాలజీ ద్వారా భారత రోగనిరోధక కార్యక్రమ బలోపేతం గురించీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పిల్లలందరికీ ఉచితంగా 12 టీకాలు వేయడం సహా, ఈ టీకాల రికార్డులను యూ-విన్ ద్వారా డిజిటల్‌గా ట్రాక్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేదిక ప్రధానంగా టీకాల డిజిటల్ నమోదును సాధ్యం చేస్తుంది. పిల్లలు, గర్భిణీ స్త్రీలు తమకు రావలసిన టీకాలను సకాలంలో అందుకునేలా నిర్ధారించడంలోనూ సహాయపడుతుందన్నారు. రోగనిరోధక కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ కనబరిచిన అద్భుతమైన పనితీరును శ్రీ నడ్డా ప్రశంసించారు. అధిక టీకా కవరేజీని నిర్ధారించడంలో తన నిబద్ధతను ప్రదర్శిస్తూ, మిషన్ ఇంద్రధనుష్ కింద ఈ రాష్ట్రం చాలా బాగా పనిచేసిందని కేంద్ర మంత్రి కొనియాడారు.

భారత ఆరోగ్య వ్యవస్థ పరివర్తన సంబంధిత విస్తృత ఫలితాలను కేంద్ర మంత్రి వివరించారు. 2023-24లో ఆసుపత్రిలో జరిగిన ప్రసవాలు 90 శాతానికి పైగా చేరుకున్నాయని శ్రీ నడ్డా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మాతృ మరణాల రేటు 48 శాతం తగ్గిందనీ, భారత్‌లో అది 86 శాతానికి తగ్గిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 61 శాతం తగ్గాయనీ, భారత్‌లో 79 శాతం తగ్గుదల నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నవజాత శిశు మరణాలు 54 శాతం తగ్గితే, దేశంలో 70 శాతం తగ్గాయి. డబ్ల్యూహెచ్ఓ-2025 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి (టీబీ) తగ్గుదల 12 శాతం ఉండగా, దేశంలో అది 25 శాతం తగ్గిందన్నారు. టీబీ చికిత్స విస్తరణ 90 శాతం దాటిందనీ ఆయన తెలిపారు. పౌరులకు అందిస్తున్న ఆర్థిక భద్రత పెరుగుతోందనడానికి, వారి సొంత ఖర్చు 43.4 శాతానికి తగ్గడం ఒక ముఖ్యమైన సూచిక అని శ్రీ నడ్డా అన్నారు. కేవలం 12 సంవత్సరాల వ్యవధిలో 16 కొత్త ఎయిమ్స్‌లను స్థాపించడంతో దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయనీ, దీంతో దేశంలోని మొత్తం ఎయిమ్స్‌ల సంఖ్య 23కి చేరిందని కేంద్ర మంత్రి వివరించారు.

ప్రజల ఇంటి వద్దకే ఆరోగ్య సంరక్షణను తీసుకువెళ్లి, 41 ఆరోగ్య పారామితుల పరీక్షలను సులభతరం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సంజీవని కార్యక్రమాన్ని శ్రీ నడ్డా ప్రత్యేకంగా ప్రశంసించారు. స్క్రీనింగ్, ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఈ రాష్ట్రం అనుసరిస్తున్న వినూత్న విధానాన్నీ ఆయన అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి విలువైన నమూనాలను అందిస్తాయని ఆయన అన్నారు. సంజీవని నమూనాను జాతీయ స్థాయిలో అమలు చేసే అవకాశాలను పరిశీలించడం పట్ల కేంద్ర మంత్రి ఆసక్తి వ్యక్తం చేశారు.

పీఎం-ఏబీహెచ్ఐఎమ్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాయకత్వాన్నీ, రాష్ట్ర ఆరోగ్య శాఖ, అధికారులు, ఆరోగ్య నిపుణుల కృషినీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అభినందించారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబొరేటరీ టెక్నీషియన్లు, అత్యవసర సంరక్షణ బృందాలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలనూ కేంద్ర మంత్రి ప్రశంసించారు. “మౌలిక సదుపాయాలు సామర్థ్యాన్ని సృష్టించగలవు. సాంకేతికత అనుసంధానాన్ని సృష్టించగలదు. ప్రయోగశాలలు రోగ నిర్ధారణ సామర్థ్యాన్ని సృష్టించగలవు. కానీ అంతిమంగా, ప్రజలే ప్రజలకు ఆరోగ్య సంరక్షణను అందిస్తారు” అని శ్రీ నడ్డా అన్నారు. కోవిడ్-19 సమయంలో ఆరోగ్య కార్యకర్తలు ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తుచేసుకుంటూ... ఆరోగ్య నిపుణులంతా కొత్త సౌకర్యాలను “సామర్థ్యం, కరుణ, గౌరవంతో” సంరక్షణ అందించడానికి ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

దేశ ఆరోగ్య రంగ పరివర్తనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాల్సి ఉందనీ, రాష్ట్రం నుంచి పొందుతున్న అనుభవం, ఉత్తమ పద్ధతులు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసే బృహత్ జాతీయ ప్రయత్నానికి దోహదపడగలవని శ్రీ నడ్డా అన్నారు.

నేపథ్యం:

ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ (పీఎం – ఏబీహెచ్ఐఎమ్) కింద భారత ప్రభుత్వం సుమారు రూ. 647.51 కోట్ల అంచనా వ్యయంతో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 24 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు (సీసీబీలు), 26 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీలను (ఐపీహెచ్‌ఎల్‌లు) మంజూరు చేసింది.

ముఖ్యంగా మహమ్మారులు, విపత్తులు, ఇతర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల సమయంలో... కీలకమైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల బలోపేతం కోసం, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు అధునాతన చికిత్సను సకాలంలో అందించడం కోసం క్రిటికల్ కేర్ బ్లాక్‌లు మంజూరు చేశారు. జిల్లా ఆసుపత్రుల్లో అన్ని సాధనాలతో కూడిన క్రిటికల్ కేర్ సౌకర్యాల ఏర్పాటు, అత్యవసర పరిస్థితులకు సన్నద్ధతను మెరుగుపరచడం, మరణాలను తగ్గించడం, అన్ని రకాల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోగలిగేలా ప్రజారోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇంటెన్సివ్ కేర్ సేవల్లోని లోపాలను పరిష్కరించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

దేశవ్యాప్తంగా వ్యాధులపై పర్యవేక్షణను బలోపేతం చేయడానికి, రోగ నిర్ధారణ సామర్థ్యాలను పెంచడానికి, ప్రజారోగ్య ప్రతిస్పందనను మెరుగుపరచడానికి సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలు (ఐపీహెచ్ఎల్) మంజూరు చేశారు. ఈ ప్రయోగశాలలు జిల్లా స్థాయిలో అంటువ్యాధులు, అసాంక్రమిక వ్యాధులను గుర్తించడం కోసం సమగ్రమైన, సకాలంలో పరీక్షలు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నాయి. తద్వారా వ్యాప్తిని ముందుగానే గుర్తించడం, ప్రజారోగ్య ముప్పులను మెరుగ్గా పర్యవేక్షించడం, ఆధారాలతో నిర్ణయాలు తీసుకోవడం సాధ్యపడుతుంది.

10 సీసీబీల సివిల్ పనులు పూర్తవగా, ఈ రోజు కేంద్ర మంత్రి ప్రారంభించారు. 26 ఐపీహెచ్‌ఎల్‌ల సివిల్ పనులూ పూర్తయ్యాయి. వాటిలో 14 ఐపీహెచ్‌ఎల్‌లు ఇప్పటికే కార్యాచరణలోకి రాగా, మిగిలిన 12 ఐపీహెచ్‌ఎల్‌లను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డా ఈ రోజు ప్రారంభించారు.

ఈ రోజు ప్రారంభించిన మొత్తం 22 సౌకర్యాల వివరాలు కింది విధంగా ఉన్నాయి: 

 

***


(రిలీజ్ ఐడి: 2309608) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Telugu_Vw