ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్‌ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డా


క్రిటికల్ కేర్ బ్లాక్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్, రోగి తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో ప్రాణాలను కాపాడే సామర్థ్యాన్ని, ప్రబలిన వ్యాధులు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులుగా మారకముందే వాటి ముప్పును గుర్తించి, స్పందించే సామర్థ్యాన్ని అందిస్తాయి: శ్రీ నడ్డా.

“సాధారణ ఆరోగ్య సంరక్షణను నిర్ధారిస్తూనే, భవిష్యత్‌లో ఏర్పడే మహమ్మారులు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులకు స్పందించేలా ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో పీఎం-అభీమ్‌ను రూపొందించారు”: శ్రీ నడ్డా.

“భారత ప్రభుత్వం పీఎం-అభీమ్ కింద రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 631 క్రిటికల్ కేర్ బ్లాక్‌లను మంజూరు చేసింది. తద్వారా దేశవ్యాప్తంగా క్రిటికల్-కేర్ సామర్థ్య నెట్‌వర్క్‌ను సృష్టించింది”

“గతంలో ప్రధానంగా నివారణ ఆరోగ్య సంరక్షణపై దృష్టి ఉండేది, అయితే 2017 నుంచి నివారణ, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణల మధ్య బలమైన అనుసంధానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు”

ప్రజల ఇంటి వద్దకే ఆరోగ్య సంరక్షణను తీసుకువెళ్లి, 41 ఆరోగ్య పారామితుల పరీక్షలను సులభతరం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సంజీవని కార్యక్రమాన్ని ప్రశంసించిన శ్రీ నడ్డా

నాడు పోస్టు చేయడమైనది: 12 SEP 2026 2:52PM by PIB Vijayawada

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్‌ల సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు (సీసీబీలు), 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీలను (ఐపీహెచ్ఎల్‌లు) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, సీనియర్ అధికారులు, వైద్యులు, ఆరోగ్య నిపుణులు కూడా పాల్గొన్నారు.

ఈరోజు ప్రారంభించిన 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు జీఎంసీ కడప, ఏసీఎస్ఆర్ జీఎంసీ నెల్లూరు, జీఎంసీ శ్రీకాకుళం, ఏఎంసీ విశాఖపట్నం, జీఎంసీ ఒంగోలు, జిల్లా హాస్పిటల్ అనకాపల్లి, జీఎంసీ రాజమహేంద్రవరం, కెఎంసీ కర్నూలు, జిల్లా ఆసుపత్రి హిందూపూర్ మరియు ఎస్ఎంసీ విజయవాడలో, అలాగే 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్‌లు సీతమ్మపేట ఏరియా హాస్పటల్, గుంతకల్ ఏరియా ఆసుపత్రి, పలమనేరు ఏరియా ఆసుపత్రి, అగనంపూడి  ఏరియా ఆసుపత్రి, నందిగామ  ఏరియా ఆసుపత్రి, చీరాల ఏరియా ఆసుపత్రి, అరకు ఏరియా ఆసుపత్రి, నరసరావుపేట ఏరియా ఆసుపత్రి, బనగానపల్లి ఏరియా ఆసుపత్రి, అనపర్తి ఏరియా ఆసుపత్రి, తుని ఏరియా ఆసుపత్రి మరియు గూడూరు ఏరియా ఆసుపత్రులలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో, దేశవ్యాప్తంగా ప్రజారోగ్య సంసిద్ధత మరియు ఆరోగ్య-భద్రతా నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు ఈ సౌకర్యాలు ఒక ముఖ్యమైన ముందడుగని కేంద్రమంత్రి నడ్డా అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/2026/sep/image002_20260912145500_9c788e.jpg

సభను ఉద్దేశించి కేంద్రమంత్రి శ్రీ నడ్డా మాట్లాడుతూ, ఈ ప్రారంభోత్సవం “కేవలం ఒక మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవం మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలో మరింత పటిష్టమైన ఆరోగ్య భద్రతా వ్యవస్థను నిర్మించే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు” అని అన్నారు. ఈ క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీలు ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలో రెండు ముఖ్యమైన అంశాలు - ఒకటి “ఒక రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణాలను కాపాడే సామర్థ్యం”, రెండోది “వ్యాధి ముప్పులు పెద్ద ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులుగా మారకముందే వాటిని గుర్తించి, స్పందించే సామర్థ్యాన్ని” సూచిస్తాయని తెలిపారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో నేర్చుకున్న పాఠాలను గుర్తుచేసుకుంటూ, ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎంత వేగంగా ఆర్థిక, సామాజిక, జీవనాధార, చివరికి జాతీయ అత్యవసర పరిస్థితిగా మారగలదో ఈ సంక్షోభం నిరూపించిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. ఆరోగ్య భద్రతే జాతీయ భద్రత అని కోవిడ్-19 మనకు నేర్పిందన్నారు. సాధారణ ఆరోగ్య సంరక్షణ సేవలకు అంతరాయం కలగకుండా, ఆరోగ్య మౌలిక సదుపాయాలు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొవాల్సిన అవసరాన్ని కూడా ఈ మహమ్మారి తెలియజేసిందని చెప్పారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/2026/sep/image003_20260912145515_43f904.jpg

మహమ్మారి సమయంలో, సాధారణ ఆసుపత్రి మౌలిక సదుపాయాలను ఐసోలేషన్, కోవిడ్-కేర్ సౌకర్యాలుగా మార్చవలసి వచ్చిందని, దీనివల్ల కోవిడ్ యేతర అనేక అత్యవసర ఆరోగ్య సేవలు అందుబాటు ప్రభావితమైందని నడ్డా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే, సాధారణ ఆరోగ్య సంరక్షణను నిర్ధారిస్తూనే, భవిష్యత్ మహమ్మారులు మరియు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించేలా ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ (పీఎం-అభీమ్)ను రూపొందించారు.

మనం ఇకపై ఆసుపత్రులను కేవలం పడకల సంఖ్య పరంగా మాత్రమే చూడలేమని అన్నారు. పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలో క్రిటికల్-కేర్ సామర్థ్యం, ​​ఆక్సిజన్, మెడికల్-గ్యాస్ వ్యవస్థలు, ఐసోలేషన్ సౌకర్యాలు, శిక్షణ కలిగిన సిబ్బంది, ప్రయోగశాల సామర్థ్యం, ​​అలాగే సాధారణ ఆరోగ్య సేవలను అందిస్తూనే ముప్పు వ్యాప్తిని ముందుగానే గుర్తించే సామర్థ్యం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

ప్రజారోగ్య మౌలిక సదుపాయాల విషయంలో భారతదేశ విధానంలో పీఎం-అభీమ్ ఒక ప్రాథమిక మార్పును సూచిస్తుందన్నారు. కేవలం అధిక సౌకర్యాలను నిర్మించడం మాత్రమే దీని లక్ష్యం కాదని, భవిష్యత్తు ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా, అనుసంధానంగా, ఎదుర్కొనేలా, ప్రతిస్పందించే సామర్థ్యం గల ఆరోగ్య వ్యవస్థను సృష్టించడమే దీని లక్ష్యమని అన్నారు.

పీఎం-అభీమ్ పథకం కింద, భారత ప్రభుత్వం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా 631 క్రిటికల్ కేర్ బ్లాక్‌లను మంజూరు చేసింది. తద్వారా దేశవ్యాప్తంగా క్రిటికల్ కేర్ సామర్థ్యం గల ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. భారత ప్రభుత్వం ఐదేళ్ల ఈ పథక కాలానికి నాలుగు కీలక అంశాలైన.. క్రిటికల్ కేర్ బ్లాక్‌లు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీలు, అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, రూరల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు ఆంధ్రప్రదేశ్ కు రూ.1,271.80 కోట్లను ఆమోదించింది. కమ్యూనిటీ స్థాయి నుంచి జిల్లా మరియు తృతీయ స్థాయి సంరక్షణ సౌకర్యాల వరకు ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న సమగ్ర విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుందని కేంద్రమంత్రి నడ్డా అన్నారు.

పీఎం-అభీమ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ.606 కోట్ల అంచనా పెట్టుబడితో 24 క్రిటికల్ కేర్ బ్లాక్‌లను మంజూరయ్యాయి. వీటిని ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల పరిధిలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికను రూపొందించారు. అధునాతన వైద్య సంరక్షణ సకాలంలో అందాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తూ... “క్లిష్టమైన వైద్య సంరక్షణ సమాజానికి సమీప అందుబాటులో ఉండాలని కేంద్ర మంత్రి నడ్డా చెప్పారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/2026/sep/image004_20260912145534_28a8ae.jpg

తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు వెంటనే స్పందించేలా సీసీబీలు ఆరోగ్య వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయగా, వ్యాధులను అర్థం చేసుకోవడం, గుర్తించడం, నియంత్రించడం వంటి వాటిలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్ (ఐపీహెచ్ఎల్) కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పీఎం-అభీమ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.32.50 కోట్ల కేటాయింపుతో 26 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్ మంజూరై, వాటి నిర్మాణ పనులు పూర్తిచేసుకున్నాయని, వాటిలో 14 ఇప్పటికే సేవలందిస్తున్నాయని, మిగిలిన 12 ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు.

కోవిడ్-19 నుంచి నేర్చుకున్న గుణపాఠం చాలా స్పష్టమైనదని, అది ఆరోగ్య అత్యవసర పరిస్థితిని మనం ముందుగానే గుర్తించలేకపోతే, దానితో సమర్థవంతంగా పోరాడలేమని ఆయన తెలియజెప్పారు. ప్రయోగశాల సామర్థ్యం కేవలం రోగ నిర్ధారణ సేవ మాత్రమే కాదని, అది జాతీయ ఆరోగ్య భద్రతలో భాగమని అభివర్ణించారు.

పీఎం-అభీమ్ పథకం కింద ప్రభుత్వ దార్శనికత తృతీయ స్థాయి ఆసుపత్రులకు మాత్రమే పరిమితం కాకుండా, అన్ని స్థాయిల ఆరోగ్య సంరక్షణను కలిగి ఉందని కేంద్ర మంత్రి అన్నారు. క్షేత్రస్థాయిలో, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రజలకు చేరువ చేస్తున్నాయి. బలోపేతమైన పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు రెఫరల్ మరియు సెకండరీ కేర్‌ను అందిస్తుండగా, జిల్లా స్థాయిలో క్రిటికల్ కేర్ బ్లాక్‌లు అధునాతన అత్యవసర మరియు ఇంటెన్సివ్ కేర్‌ను అందిస్తాయి, ఐపీహెచ్‌ఎల్‌లు రోగ నిర్ధారణ పర్యవేక్షణ సామర్థ్యాన్ని కల్పిస్తాయి. ఈ అంశాలన్నీ కలిసి నిరంతర సంరక్షణను, ప్రజారోగ్య సంసిద్ధతను అందిస్తాయని ఆయన అన్నారు. భారతదేశ ఆరోగ్య విధానంలో ఇది ఒక ముఖ్యమైన మార్పు అని ఆయన అభివర్ణించారు. "మనం ఆసుపత్రి-కేంద్రీకృత విధానం నుంచి ఆరోగ్య-వ్యవస్థ విధానానికి మారుతున్నామని" చెప్పారు.

భారతదేశ ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తన నేపథ్యాన్ని ఆరోగ్య సంరక్షణ పట్ల నివారణ, ప్రోత్సాహక మరియు సమగ్ర దృక్పథం దిశగా ఒక ముఖ్యమైన మార్పును సూచించిన 2017 జాతీయ ఆరోగ్య విధానంగా చూడాలని నడ్డా అన్నారు. 2017కి ముందు ప్రధానంగా నివారణ ఆరోగ్య సంరక్షణపైనే దృష్టి ఉండేదని, అయితే ఆ తర్వాత నివారణ, ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ ఆరోగ్య సంరక్షణల మధ్య బలమైన అనుసంధానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని చెప్పారు. "ఆరోగ్య సంరక్షణ సమగ్రంగా మరియు ప్రజల-కేంద్రీకృతంగా మారేలా, నివారణ, ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణల మధ్య బలమైన అనుసంధానాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ విధానం ఫలితంగా, ప్రాథమిక, ద్వితీయ ఆరోగ్య సంరక్షణను ఏకకాలంలో బలోపేతం చేస్తూ, తృతీయ ఆరోగ్య సంరక్షణ సంస్థలను విస్తరింపజేయడంతో పాటు, మరింత సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏర్పడిందని ఆయన తెలిపారు.

దేశవ్యాప్తంగా 1.75 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను స్థాపించి సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రజల ఇంటి వద్దకే తీసుకువచ్చామని తెలిపారు. ఈ కేంద్రాలు మధుమేహం, అధిక రక్తపోటు పరీక్షలు, ప్రసవపూర్వ ఆరోగ్య పరీక్షలు, రోగనిరోధక టీకాలు, ఇతర నివారణ, ప్రోత్సాహక ఆరోగ్య సంరక్షణ సేవలతో సహా పలు రకాల సేవలను అందిస్తాయి. 42 కోట్లకు పైగా ప్రజలకు మధుమేహం, అధిక రక్తపోటు పరీక్షలు, 36 కోట్లకు పైగా నోటి క్యాన్సర్ పరీక్షలు, 17 కోట్లకు పైగా మహిళలకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు, 9 కోట్లకు పైగా మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించామని తెలియజేశారు. నివారణ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి, భవిష్యత్ తరాలను గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుండి రక్షించడానికి హెచ్‌పివి  వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టడం ఒక ముఖ్యమైన ముందడుగని అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/2026/sep/image005_20260912145550_952469.jpg

డిజిటల్ టెక్నాలజీ ద్వారా భారతదేశ రోగనిరోధక కార్యక్రమాన్ని బలోపేతం చేయడం గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రస్తావించారు. పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల వయస్సు వరకు 12 టీకాలు వేస్తున్నారని, టీకాల రికార్డులను యూ-విన్ ద్వారా డిజిటల్‌గా ట్రాక్ చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్లాట్‌ఫామ్ టీకాల డిజిటల్ రికార్డింగ్‌ను నిర్వహిస్తూ పిల్లలు, గర్భిణీ స్త్రీలు తీసుకొవాల్సిన టీకాలను సకాలంలో అందుకునేలా చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ కనబరిచిన అద్భుతమైన పనితీరును ఆయన ప్రశంసించారు. మిషన్ ఇంద్రధనుష్ కింద అధిక టీకా కవరేజ్ నిర్వహణలో రాష్ట్రం ప్రదర్శించిన నిబద్ధతను, పనితీరును కొనియాడారు.

భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన యొక్క విస్తృత ఫలితాలను వివరిస్తూ, 2023-24లో సంస్థాగత ప్రసవాలు 90 శాతానికి పైగా చేరుకున్నాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మాతృ మరణాల నిష్పత్తి 48 శాతం తగ్గగా, భారతదేశంలో అది 86 శాతానికి తగ్గిందని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 61 శాతం తగ్గగా, భారతదేశంలో 79 శాతం తగ్గాయని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నవజాత శిశు మరణాలు 54 శాతం తగ్గగా, భారతదేశంలో 70 శాతం తగ్గాయి. డబ్ల్యూహెచ్ఓ 2025 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా క్షయవ్యాధి (టీబీ) తగ్గుదల 12 శాతం ఉండగా, భారతదేశంలో అది 25 శాతం తగ్గిందని, అలాగే టీబీ చికిత్స కవరేజ్ 90 శాతం దాటిందని తెలిపారు. పౌరులకు అందిస్తున్న ఆర్థిక రక్షణ పెరుగుతోందనడానికి, సొంత ఖర్చు 43.4 శాతానికి తగ్గడం కూడా ఒక ముఖ్యమైన సూచిక అని కేంద్ర మంత్రి నడ్డా అన్నారు. కేవలం 12 సంవత్సరాల వ్యవధిలో 16 కొత్త ఎయిమ్స్‌లను స్థాపించడంతో దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని, దీంతో దేశంలో ఎయిమ్స్‌ల మొత్తం సంఖ్య 23కి చేరిందని తెలిపారు.

ప్రజల ఇంటి వద్దకే ఆరోగ్య సంరక్షణను తీసుకువెళ్లి, 41 ఆరోగ్య పరీక్షలను సులభతరం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సంజీవని కార్యక్రమాన్ని కేంద్రమంత్రి ప్రశంసించారు. స్క్రీనింగ్ మరియు ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్రం తీసుకున్న వినూత్న విధానాన్ని ఆయన అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను పటిష్టపరిచే విలువైన నమూనాలను అందిస్తాయని చెప్పారు. సంజీవని నమూనాను జాతీయ స్థాయిలో అమలు చేసే అవకాశాలను పరిశీలించేందుకు కేంద్రమంత్రి ఆసక్తిని వ్యక్తం చేశారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/2026/sep/image006_20260912145604_ca8e15.jpg

పీఎం-అభీమ్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాయకత్వాన్ని, రాష్ట్ర ఆరోగ్య శాఖ, అధికారులు మరియు ఆరోగ్య నిపుణుల కృషిని కేంద్రమంత్రి అభినందించారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబొరేటరీ టెక్నీషియన్లు, అత్యవసర సంరక్షణ బృందాలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు మరియు ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలను కూడా ప్రశంసించారు. “మౌలిక సదుపాయాలు సామర్థ్యాన్ని సృష్టించగలవు. సాంకేతికత అనుసంధానించగలదు. ప్రయోగశాలలు రోగ నిర్ధారణ సామర్థ్యాన్ని పెంపొందిచగలవు. కానీ అంతిమంగా, ప్రజలే ప్రజలకు ఆరోగ్య సంరక్షణను అందిస్తారని నడ్డా అన్నారు. కోవిడ్-19 సమయంలో ఆరోగ్య కార్యకర్తలు ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తుచేసుకుంటూ, ఆరోగ్య నిపుణులందరూ ఈ కొత్త సౌకర్యాలను “సామర్థ్యం, ​​కరుణ, గౌరవంతో” సంరక్షణ అందించేందకు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

భారతదేశ ఆరోగ్య పరివర్తనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాలని, రాష్ట్రం నుంచి వెలువడుతున్న అనుభవం, ఉత్తమ పద్ధతులు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసే బృహత్ జాతీయ ప్రయత్నానికి దోహదపడగలవని కేంద్రమంత్రి నడ్డా అన్నారు.

నేపథ్యం:

భారత ప్రభుత్వం, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ (పీఎం – అభీమ్) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 24 క్రిటికల్ కేర్ బ్లాక్‌లు (సీసీబీలు) మరియు 26 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీలను (ఐపీహెచ్‌ఎల్‌లు) సుమారు రూ. 647.51 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేసింది.

ముఖ్యంగా మహమ్మారులు, విపత్తులు, ఇతర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల సమయంలో, కీలకమైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు అధునాతన చికిత్సను సకాలంలో అందించేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్‌లు (సీసీబీలు) మంజూరయ్యాయి. జిల్లా ఆసుపత్రులలో సురక్షితమైన క్రిటికల్ కేర్ సౌకర్యాలను సృష్టించడం, అత్యవసర పరిస్థితులకు సన్నద్ధతను మెరుగుపరచడం, మరణాలను తగ్గించడం, ప్రజారోగ్య వ్యవస్థ మొత్తం స్థితిస్థాపకత, సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇంటెన్సివ్ కేర్ సేవలలోని లోపాలను సరిచేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

దేశవ్యాప్తంగా వ్యాధి నిఘాను బలోపేతం చేసేందుకు, రోగ నిర్ధారణ సామర్థ్యాలను పెంచేందుకు, ప్రజారోగ్య ప్రతిస్పందనను మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీస్ (ఐపీహెచ్‌ఎల్‌లు) మంజూరయ్యాయి. ఈ ప్రయోగశాలలు జిల్లా స్థాయిలో అంటువ్యాధులు మరియు కాని వాటికి సమగ్రమైన, సకాలంలో పరీక్షలను అందించడమే లక్ష్యం. తద్వారా వ్యాప్తిని ముందుగానే గుర్తించడం, ప్రజారోగ్య ముప్పులను మెరుగ్గా పర్యవేక్షించడంతో సాక్ష్యాధారిత నిర్ణయాలు తీసుకోవడానికి సాధ్యమవుతుంది.

10 సీసీబీల నిర్మాణ పనులు పూర్తయి ఈరోజు ప్రారంభమయ్యాయి. 26 ఐపీహెచ్‌ఎల్‌ల సివిల్ పనులు పూర్తయ్యాయి. వాటిలో 14 ఐపీహెచ్‌ఎల్‌లు ఇప్పటికే కార్యాచరణలోకి రాగా, మిగిలిన 12 ఐపీహెచ్‌ఎల్‌లను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా ఈరోజు ప్రారంభించారు.

ఈరోజు ప్రారంభించిన మొత్తం 22 సౌకర్యాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 

స్ల్.

లేదు.

జిల్లా పేరు

సౌకర్యం పేరు

సౌకర్యం రకం

1

వైఎస్ఆర్ కడప

జీఎంసీ కడప

సీసీబీ

2

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు

ఎసీఎస్ఆర్ జీఎంసీ నెల్లూరు

సీసీబీ

3

శ్రీకాకుళం

జీఎంసీ శ్రీకాకుళం

సీసీబీ

4

విశాఖపట్నం

ఏఎంసీ, విశాఖపట్నం

సీసీబీ

5

ప్రకాశం

జీఎంసీ ఒంగోలు

సీసీబీ

6

అనకాపల్లి

డీహెచ్ అనకాపల్లి

సీసీబీ

7

తూర్పు గోదావరి

జీఎంసీ రాజమహేంద్రవరం

సీసీబీ

8

కర్నూలు

కెఎంసీ కర్నూలు

సీసీబీ

9

శ్రీ సత్య సాయి

డీహెచ్ హిందూపూర్

సీసీబీ

10

ఎన్టీఆర్

ఎస్ఎంసి, విజయవాడ

సీసీబీ

11

పార్వతీపురం మన్యం

ఎహెచ్ సీతంపేట

ఐపీహెచ్‌ఎల్‌లు

12

అనంతపురము

ఎహెచ్ గుంతకల్

ఐపీహెచ్‌ఎల్‌లు

13

చిత్తూరు

ఎహెచ్ పలమనేర్

ఐపీహెచ్‌ఎల్‌లు

14

విశాఖపట్నం

ఎహెచ్ అగనంపూడి

ఐపీహెచ్‌ఎల్‌లు

15

ఎన్టీఆర్

ఎహెచ్ నందిగామ

ఐపీహెచ్‌ఎల్‌లు

16

బాపట్ల

ఎహెచ్ చీరాల

ఐపీహెచ్‌ఎల్‌లు

17

అల్లూరి సీతారామరాజు

ఎహెచ్ అరాకు

ఐపీహెచ్‌ఎల్‌లు

18

పల్నాడు

ఎహెచ్ నరసరావుపేట

ఐపీహెచ్‌ఎల్‌లు

19

నంద్యాల

ఎహెచ్ బనగానపల్లి

ఐపీహెచ్‌ఎల్‌లు

20

తూర్పు గోదావరి

ఎహెచ్ అనపర్తి

ఐపీహెచ్‌ఎల్‌లు

21

కాకినాడ

ఎహెచ్ తుని

ఐపీహెచ్‌ఎల్‌లు

22

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు

ఎహెచ్ గుడూర్

ఐపీహెచ్‌ఎల్‌లు

****

 


(రిలీజ్ ఐడి: 2309487) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Telugu