వ్యవసాయ మంత్రిత్వ శాఖ
బద్రి గోశాలలో ఓపీయూ-ఐవీఎఫ్ దూడ జననం
ఉత్తరాఖండ్ దేశీయ జాతి పరిరక్షణ, జన్యుపరమైన వృద్ధిలో కీలక ముందడుగు
అధునాతన పిండ సాంకేతికత ద్వారా మేలు రకం 'బద్రి' ఆవుల వృద్ధికి సరికొత్త మార్గం
నాడు పోస్టు చేయడమైనది:
12 SEP 2026 11:45AM by PIB Hyderabad
దేశీయ పశు జాతుల పరిరక్షణ, వృద్ధి, జన్యుపరమైన అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. అకడెమిక్ డెయిరీ ఫామ్‌లో ఓవమ్ పిక్-అప్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఓపీయూ-ఐవీఎఫ్) సాంకేతికత ద్వారా ఒక సాహివాల్ ఆవు గర్భంలోకి బద్రి జాతి ఆవు పిండాన్ని ప్రవేశపెట్టారు. నిన్న ఆ ఆవు విజయవంతంగా ఆరోగ్యవంతమైన బద్రి జాతి ఆడ దూడకు జన్మనిచ్చింది. ఈ దూడ 2026 సెప్టెంబర్ 11న జన్మించింది. బద్రి జాతి ఆవులు ఉత్తరాఖండ్‌కు చెందిన ముఖ్యమైన దేశీ జాతి పశు జన్యు వనరుగా, ఉత్తరాఖండ్ రాష్ట్ర పశువుగా గుర్తింపు పొందాయి.
కర్నాల్‌లోని ఐసీఏఆర్–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐసీఏఆర్-ఎన్‌డీఆర్ఐ), ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లో గల జి. బి. పంత్ వ్యవసాయ-సాంకేతిక విశ్వవిద్యాలయం సమష్టి కృషితో పాటు హల్దీలోని ఉత్తరాఖండ్ బయోటెక్నాలజీ కౌన్సిల్ అందించిన ఆర్థిక సహాయంతో ఈ విజయం సాధ్యమైంది. విలువైన బద్రి గోవుల జన్యు పదార్థ పరిరక్షణ, వేగంగా ఆ జాతి గోవుల సంఖ్యను పెంచడం, జన్యుపరమైన అభివృద్ధిని సాధించడంలో అధునాతన పునరుత్పత్తి బయోటెక్నాలజీ సామర్థ్యాన్ని ఈ విజయం ప్రదర్శిస్తుంది.
ఈ విజయంపై కర్నాల్‌లోని ఐసీఏఆర్-ఎన్‌డీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ధీర్ సింగ్ మాట్లాడుతూ... శ్రేష్ఠమైన స్త్రీ బీజకణాలను వేగంగా వృద్ధి చేయడానికి, బద్రి జాతి పశువుల కోసం వ్యవస్థీకృత జాతి అభివృద్ధి, బీజకణ పరిరక్షణ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఓపీయూ-ఐవీఎఫ్ వంటి అధునాతన పునరుత్పత్తి సాంకేతికతలు తోడ్పడతాయని అన్నారు. జాతి పరిరక్షణ, జన్యుపరమైన అభివృద్ధి కోసం సాంకేతికత ఆధారిత విధానాలను మరింత బలోపేతం చేయడానికి ఈ విజయం పునాది వేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిశోధన కార్యక్రమం 2023లో జి. బి. పంత్ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డాక్టర్ ఎం. ఎస్. చౌహాన్ నాయకత్వం, చొరవతో ప్రారంభమైంది. ఆయన నాయకత్వంలో బద్రి జాతి పశువుల జన్యు పదార్థ పరిరక్షణ, వృద్ధి కోసం అధునాతన పునరుత్పత్తి సాంకేతికతల అబివృద్ధి లక్ష్యంగా జి. బి. పంత్ విశ్వవిద్యాలయం, కర్నాల్‌లోని ఐసీఏఆర్-ఎన్‌డీఆర్ఐ మధ్య శాస్త్రీయ సహకారం ప్రారంభమైంది. గత మూడు సంవత్సరాలుగా ఈ శాస్త్రీయ నిపుణుల బృందాలు బద్రి జాతి పశువుల కోసం ఓపీయూ-ఐవీఎఫ్, పిండోత్పత్తి, పిండ మార్పిడి విధానాలను అభివృద్ధి చేయడానికి విశేష కృషి చేశాయి.
ఓపీయూ-ఐవీఎఫ్ కార్యక్రమం కింద... జన్యుపరంగా విలువైనవి అయిన ప్రత్యేకంగా ఎంపిక చేసిన బద్రి జాతికి చెందిన దాత ఆవుల నుంచి అల్ట్రాసౌండ్-గైడెడ్ ఓవమ్ పిక్-అప్ ద్వారా అండకణాలను సేకరించారు. సేకరించిన అండకణాలను పరిపక్వం చేసి, ఆ తర్వాత ఉత్తరాఖండ్ పశుసంవర్ధక అభివృద్ధి బోర్డు ద్వారా పొందిన జన్యుపరంగా శ్రేష్ఠమైన బద్రి జాతి ఎద్దుల వీర్యంతో ఇన్ విట్రో పద్ధతిలో వాటిని ఫలదీకరణం చేశారు. ఫలితంగా ఏర్పడిన పిండాలను నియంత్రిత ప్రయోగశాల పరిస్థితుల్లో పెంచి, ఆ తర్వాత తగిన విధంగా సమకాలీకరించిన గ్రహీత ఆవుల్లోకి ఆ పిండాలను బదిలీ చేశారు. అటువంటి ఒక బద్రి జాతి పిండాన్ని సాహివాల్ జాతికి చెందిన గ్రహీత ఆవులోకి విజయవంతంగా బదిలీ చేయగా... ఆ ఆవు ఆరోగ్యవంతమైన బద్రి జాతి ఆడ దూడకు జన్మనిచ్చింది.
మరో సంకర జాతి ఆవు రాబోయే 5–7 రోజుల్లో బద్రి జాతి దూడకు జన్మనిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఓపీయూ-ఐవీఎఫ్ ద్వారా బద్రి జాతి దూడను విజయవంతంగా ఉత్పత్తి చేయడం... ఉత్తరాఖండ్‌లో బద్రి జాతి పశువుల జన్యు పదార్థ పరిరక్షణ, వృద్ధి, జన్యుపరమైన అభివృద్ధి కోసం సాంకేతికత-ఆధారిత కార్యక్రమాన్ని ప్రారంభించే దిశగా ఒక కీలక ముందడుగును సూచిస్తుంది. ఈ సాంకేతికత జన్యుపరంగా శ్రేష్ఠమైన ఆడ పశువుల నుంచి బహుళ పిండాల ఉత్పత్తినీ సాధ్యం చేస్తుంది. తద్వారా సాంప్రదాయ పునరుత్పత్తి పద్ధతులతో పోలిస్తే శ్రేష్ఠమైన జన్యు పదార్థ వృద్ధి రేటునూ ఇది పెంచగలదు.
ఈ కార్యక్రమం శ్రేష్ఠమైన, అధిక పాల దిగుబడినిచ్చే బద్రి ఆవుల క్లోనింగ్‌నూ అన్వేషిస్తోంది. బృంద సభ్యుల సహకారం, కొనసాగుతున్న పరిశోధనలోని పలు దశల ద్వారా క్లోనింగ్ చేసిన బద్రి జాతి పిండాలను విజయవంతంగా ఉత్పత్తి చేశారు. తదుపరి దశలో ఓపీయూ-ఐవీఎఫ్, క్లోనింగ్ ద్వారా పొందిన పిండాలను... తగిన సాహివాల్, సంకర జాతి, బద్రి జాతి గ్రహీత ఆవుల గర్భంలోకి బదిలీ చేయడానికి ప్రణాళిక రూపొందించారు. శ్రేష్ఠమైన బద్రి జాతి జన్యు పదార్థ వృద్ధిని వేగవంతం చేయడం, ఈ దేశీయ జాతి దీర్ఘకాలిక పరిరక్షణ, జన్యుపరమైన అభివృద్ధికి దోహదపడటం ఈ ప్రయత్నాల ముఖ్యోద్దేశం.
హిమాలయ ప్రాంతంలో సుస్థిర పశుసంపద అభివృద్ధి కోసం దేశీయ జన్యు వనరులను ఆధునిక పునరుత్పత్తి సంబంధిత బయోటెక్నాలజీతో అనుసంధానించగల సామర్థ్యాన్ని ఈ విజయం స్పష్టం చేస్తోంది. బద్రి జాతి ఓపీయూ-ఐవీఎఫ్ దూడ విజయవంతంగా జన్మించడం... ఉత్తరాఖండ్‌లో శ్రేష్ఠమైన బద్రి జాతి జన్యు పదార్థ పరిరక్షణ, జన్యుపరమైన మెరుగుదల, వాటి సంఖ్యను పెంచడం దిశగా సహకార ప్రయత్నాలను విస్తరించడానికి పునాది వేస్తుంది.
దేశీయ పశు జాతుల పరిరక్షణ, జన్యుపరమైన అభివృద్ధి, సుస్థిర వినియోగం కోసం సహకార పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకునే కార్యక్రమాల బలోపేతం కోసం కర్నాల్‌లోని ఐసీఏఆర్-ఎన్‌డీఆర్ఐ, పంత్‌నగర్‌లోని జి. బి. పంత్ వ్యవసాయ-సాంకేతిక విశ్వవిద్యాలయం కట్టుబడి ఉన్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2309586)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21