సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
రాయితీ రుణాలు, నైపుణ్యాభివృద్ధి ద్వారా పారిశుద్ధ్య కార్మికుల సామాజిక-ఆర్థిక సాధికారతను ముందుకు తీసుకువెళుతున్న ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ
ప్రారంభమైనప్పటి నుంచి రూ. 3,365.93 కోట్లను మంజూరు, పంపిణీ చేసిన కార్పొరేషన్.. ప్రయోజనం పొందిన 6.10 లక్షలకు పైగా లబ్ధిదారులు
స్వయం ఉపాధి కోసం వ్యక్తులకు రూ. 30 లక్షల, బృందాలకు రూ. 75 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్న సంస్థ
నాడు పోస్టు చేయడమైనది:
11 SEP 2026 5:44PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ సఫాయి కరంచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ).. దేశవ్యాప్తంగా ఉన్న సఫాయి కర్మచారులు, చెత్త ఏరుకునేవారు, మల విసర్జనను శుభ్రం చేసేవారు, వారిపై ఆధారపడిన వారిలో సుస్థిర ఉపాధి, సామాజిక-ఆర్థిక సాధికారతను నిరంతరం ప్రోత్సహిస్తోంది.
రుణ ఆధారిత పథకాల కింద ఆచరణీయమైన స్వయం ఉపాధి, ఆదాయాన్ని ఆర్జించే కార్యకలాపాలను చేపట్టడానికి అర్హులైన లబ్ధిదారులకు ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ రాయితీ వడ్డీ రేట్లతో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
వ్యక్తిగత లబ్ధిదారునికి రూ. 30 లక్షల వరకు, బృందంగా ఉన్న లబ్ధిదారులకు రూ. 75 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తోంది. ఆర్థిక సహాయం స్వభావం, మొత్తాన్ని బట్టి వడ్డీ రేటు 6 శాతం నుంచి 9 శాతం వరకు ఉంటుంది. రుణం మొత్తంతో పాటు పథకంలో వర్తించే నిబంధనలకు లోబడి రుణాన్ని తిరిగి చెల్లించే కాలపరిమితి మూడు నుంచి పది సంవత్సరాల వరకు ఉంటుంది.
మహిళా లబ్ధిదారులకు వర్తించే వడ్డీ రేటుపై 1 శాతం రాయితీ లభిస్తోంది. పథకంలోని వర్తించే మార్గదర్శకాల ప్రకారం సకాలంలో వాయిదాలు చెల్లించే లబ్ధిదారులకు అదనంగా 0.5 శాతం రాయితీ (రిబేట్) కూడా అందుతుంది.
ఈ రుణ పథకాలను సంబంధిత రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నామినేట్ చేసిన రాష్ట్ర ఛానలైజింగ్ ఏజెన్సీలు (ఎస్‌సీఏలు).. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీలు), ప్రభుత్వ రంగ బ్యాంకులతో (పీఎస్‌బీలు) కలిసి అమలు చేస్తున్నాయి.
లక్షిత వర్గాల ప్రయోజనం కోసం ఆర్థిక సహాయంతో పాటు రుణేతర కార్యక్రమాలను కూడా ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ అమలు చేస్తోంది. అవగాహన సదస్సులు, వర్క్‌షాప్‌లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఇతర సామర్థ్య పెంపు కార్యక్రమాలను నిర్వహించడానికి ఆర్థిక సహాయం, గ్రాంట్లను అందిస్తోంది.
ఈ చర్యలన్నీ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, వ్యవస్థాపక సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి.. లబ్ధిదారులు సురక్షితమైన, గౌరవప్రదమైన, సుస్థిర ఉపాధి అవకాశాలను పొందడానికి వీలు కల్పిస్తాయి.
కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి 2026 సెప్టెంబర్ 10 వరకు ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ.. లక్షిత వర్గానికి చెందిన 6,10,902 మంది వ్యక్తులకు ఛానలైజింగ్ ఏజెన్సీల ద్వారా రూ. 3,365.93 కోట్ల రాయితీ రుణాలను మంజూరు చేసి పంపిణీ చేసింది.
ఆర్థిక సహాయాన్ని అందించే పథకాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, సామర్థ్య పెంపు చర్యల ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు, వారిపై ఆధారపడిన వారిలో సామాజిక సమైక్యత, ఆర్థిక స్వాతంత్ర్యం, గౌరవప్రదమైన జీవనోపాధిని ప్రోత్సహించడానికి ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ నిబద్ధతను కొనసాగిస్తోంది.
1997 జనవరి 24న లాభాపేక్ష లేని కంపెనీగా ఏర్పాటైన ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ.. లక్షిత వర్గాల సర్వతోముఖాభివృద్ధికి అంకితమైన అత్యున్నత కార్పొరేషన్‌గా అక్టోబర్ 1997 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య పెంపు, సామాజిక సాధికారతకు మద్దతుగా ఈ కార్పొరేషన్ వివిధ రకాల రుణ ఆధారిత, రుణేతర పథకాలను అమలు చేస్తోంది.
మల విసర్జనను చేతులతో శుభ్రం చేసే అమానుష పద్ధతిని నిర్మూలించడానికి కృషి చేయడం, సఫాయి కర్మచారులు, మురికివాడల కార్మికులు, వారిపై ఆధారపడిన వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి కృషి చేయటమే ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీకి ఉన్న ప్రధాన లక్ష్యం. ప్రత్యామ్నాయ, సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా లక్షిత వర్గాల వారి గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని అందించటం.. వారు సగౌరవంగా జీవించేలా చేయడంతో పాటు ప్రధాన స్రవంతి సమాజంలో అంతర్భాగంగా మారేలా చేయాలన్న ఉద్దేశంతో ఇది పనిచేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2309373)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6