వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సరైన శాస్త్రీయ దృక్పథం, విధానాలు, మార్కెట్ పద్ధతులతో
అద్భుతమైన వనరుగా మెట్ట భూములు: కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్
మెట్ట భూముల అభివృద్ధికి సమగ్ర వ్యవస్థ, సామాజిక, ప్రభుత్వ విధానాలు అవసరం: డీఏఆర్ఈ కార్యదర్శి
న్యూఢిల్లీలో డ్రైల్యాండ్ కాంగ్రెస్-2026 ప్రారంభం: మొదటి రోజు చర్చల్లో వంగడాల అభివృద్ధి, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, పోషకాహారానికి ప్రాధాన్యత
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 9:02PM by PIB Hyderabad
మెట్ట వ్యవసాయాన్ని మార్చేందుకు ఆహార, పోషకాహార భద్రతను బలోపేతం చేయటానికి, రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు శాస్త్రీయ దృక్పథం, విధానాలు, మార్కెట్ మద్దతుతో కూడిన సమగ్ర విధానం అవసరమని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ (ఎన్ఏఎస్ఈ)లో జరిగిన డ్రైల్యాండ్ కాంగ్రెస్-2026 ప్రారంభ సమావేశంలో శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ ప్రసంగించారు. మెట్ట భూములను పనికిరానివిగా చూడకూడదని, సరైన శాస్త్రీయ దృక్పథం, విధానాలు, మార్కెట్ మద్దతుతో భారతదేశానికి, సవాళ్లను ఎదుర్కొంటున్న పలు ప్రాంతాలకు బలంగా మారగలవని అన్నారు.
సెప్టెంబర్ 10, 2026 నుంచి న్యూఢిల్లీలో జరిగిన డ్రైల్యాండ్ కాంగ్రెస్-2026 కార్యక్రమంలో 25 దేశాల నుంచి 800లకు పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, అభివృద్ధి భాగస్వాములు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యావేత్తలు, పౌర సామాజిక సంస్థలు, రైతులు పాల్గొన్నారు. మెట్ట భూమి సాగులో శాస్త్రీయ, సాంకేతిక, విధానపరంగా స్థిరమైన పరిష్కారాలపై చర్చలు జరిగాయి. మెట్ట భూముల సాగుపై ఆధాపడిన వారికి జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పంటల నిరోధకతను పెంపొందించటం, మెట్ట భూముల సుస్థిర నిర్వహణ, పోషకాహారం, మార్కెట్లు, విధానాలపై ఈ మూడు రోజుల సదస్సు దృష్టి సారిస్తుంది.
వ్యవసాయ వ్యవస్థలను మార్చే ప్రయత్నాల్లో ఆహార భద్రత, పోషకాహార భద్రత, రైతుల సంక్షేమమే ప్రథమంగా ఉండాలని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. కేవలం ఉత్పత్తి పెరుగుదల మాత్రమే కాక, వ్యవసాయ కుటుంబాలకు మెరుగైన జీవనోపాధి, సంక్షేమం కూడా అంతిమంగా ఉండాలని ఆయన అన్నారు. “మెట్ట భూములు ఎప్పుడూ పనికిరానివి కాదని... సరైన శాస్త్ర, సాంకేతిక, సరైన విధానాలు, మార్కెట్ మద్దతు ఉంటే భారతదేశానికి, ఆఫ్రికాకు, ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఇతర ప్రాంతాలకు గొప్ప బలంగా ఈ భూములు మారతాయి" అని స్పష్టం చేశారు.
భారత ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ (డీఏఆర్ఈ) మాజీ కార్యదర్శి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.ఎస్. పరోడా అధ్యక్షతన ఈ ప్రారంభ సదస్సు జరిగింది. ఇక్రిశాట్ బోర్డు చైర్‌పర్సన్ శ్రీమతి క్యాథీ రీడ్, సీజీఐఏఆర్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సాండ్రా మిలాచ్‌లతో పాటు ఐసీఏఆర్, ఇక్రిశాట్ మాజీ నాయకులు డాక్టర్ పంజాబ్ సింగ్, డాక్టర్ త్రిలోచన్ మెహపాత్ర, డాక్టర్ విలియం డి. డార్ ఈ సదస్సులో పాల్గొన్నారు. డీఏఆర్ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్. జాట్, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ ఈ కాంగ్రెస్‌కు ప్రోత్సాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక్రిశాట్ పరిశోధన, ఆవిష్కరణల డెప్యుటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ స్టాన్‌ఫోర్డ్ బ్లాడ్, ఐసీఏఆర్ క్రాప్ సైన్స్ డెప్యుటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ దేవేంద్ర కుమార్ యాదవ్, ఇక్రిశాట్ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ అగర్వాల్ ఈ కాంగ్రెస్ సహాధ్యక్షులుగా ఉన్నారు.
మెట్ట వ్యవసాయ పరివర్తన వ్యూహాల్లో రైతుల అనుభవాలను, అవసరాల ప్రాముఖ్యతను పద్మశ్రీ పురస్కార గ్రహీత, రైతు భికియా లడక్య ధిండా... రైతుల దృక్పథాన్ని తెలియజేశారు.
డాక్టర్ హిమాన్షు పాఠక్, డాక్టర్ స్టాన్‌ఫోర్డ్ బ్లాడ్ సంపాదకత్వంలో ఇక్రిశాట్ ప్రచురించిన ట్రాన్స్ఫార్మింగ్ ది డ్రైల్యాండ్స్: ది ఇక్రిశాట్ జర్నీ పుస్తకాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ ఆవిష్కరించారు. ఆసియా, ఆఫ్రికా, ఇతర ప్రాంతాల్లో సైన్స్, ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, ప్రభావం వంటి రంగాల్లో అయిదు దశాబ్దాలకు పైగా ఇక్రిశాట్ చేసిన కృషిని ఈ ప్రచురణ వివరిస్తుంది. 250కి పైగా సారాంశాలతో కూడిన డ్రైల్యాండ్ కాంగ్రెస్-2026 సంక్షిప్త పుస్తకంతో పాటు పంట మెరుగుదలను వేగవంతం చేయటం, వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయ విధానాలు, వ్యవసాయ-ఆహార వ్యవస్థల మార్పు వంటి రంగాల్లో సంస్థ చేసిన కృషిని తెలిపే ఇక్రిశాట్ రీసెర్చ్ అండ్ కార్పొరేట్ ప్రొఫైల్‌ను కూడా ఆవిష్కరించారు.
మొదటి రోజు సాంకేతిక కార్యక్రమంలో మూడు ప్రధాన అంశాలపై చర్చలు జరిగాయి. "భవిష్యత్తు కోసం వంగడాల అభివృద్ధి: జన్యుపరమైన లాభాలను వేగవంతం చేయటం", "వాతావరణాన్ని తట్టుకునే మెట్ట భూములు", "మార్కెట్లు, విధానాల ద్వారా మెరుగైన ఆహారపు అలవాట్లు, పోషకాహారం". పంటల్లో జన్యుపరమైన లాభాలను వేగవంతం చేయటం, వాతావరణ స్థిరత్వాన్ని బలోపేతం చేయటం, మెట్ట భూముల నిర్వహణను మెరుగుపరచటం, పోషకాహారాన్ని పెంపొందించటం మెరుగైన జీవనోపాధి అవకాశాలను సృష్టించటం వంటి అంశాలపై చర్చించేందుకు ఈ కార్యక్రమం నిపుణులను ఒకచోట చేర్చింది.
భారతదేశ వ్యవసాయ వ్యవస్థల మార్పులోని అనుభవాలు, గ్లోబల్ సౌత్ ద్వారా నేర్చుకున్న విషయాలపై డీఏఆర్‌ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్. జాట్ దార్శనిక ప్రసంగం చేశారు. మెట్ట భూముల పరివర్తనకు వ్యవసాయ రంగానికి మించిన పరిష్కారాలు అవసరమని ఆయన అన్నారు. మెట్ట భూములున్న ప్రాంతాల్లో అవకాశాలను సృష్టించటానికి, జీవనోపాధిని మెరుగుపరిచేందుకు సమగ్ర వ్యవస్థ, సమన్వయం, ప్రభుత్వపరమైన విధానాలు అవసరమని పిలుపునిచ్చారు. “సిఫార్సుల నుంచి ఆచరణల వరకు, ప్రత్యేక విభాగాల నుంచి వ్యవస్థల వరకు... మెట్ట వ్యవసాయాన్ని మార్చే మార్గం ఇదే” అని అన్నారు.
డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, భూ వనరుల నిర్వహణ, ఉమ్మడి చర్యల ద్వారా మెట్ట ప్రాంతాలను పునరుద్ధరించటంపై భారత ప్రభుత్వ భూవనరుల శాఖ కార్యదర్శి శ్రీ నరేంద్ర భూషణ్ మాట్లాడారు. భూమి, వనరుల నిర్వహణను బలోపేతం చేయటంలో, మెట్ట ప్రాంత ప్రజలకు మద్దతివ్వటంలో సమగ్ర విధానాల పాత్రను ఆయన స్పష్టం చేశారు.
ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ మాట్లాడుతూ... ఆహార వ్యవస్థలు, జీవనోపాధికి మెట్ట ప్రాంతాల అంతర్జాతీయ ప్రాముఖ్యతను తెలియజేశారు. మెట్ట ప్రాంతాల్లో ఉత్పత్తిని పెంచి, లాభదాయకంగా, ప్రతికూలతలను తట్టుకునేలా మార్చేందుకు, ఉపాధి అవకాశాలను కల్పించి, వలసలను తగ్గించేందుకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ వ్యవసాయ అభివృద్ధిలో మెట్ట ప్రాంతాలే కీలకంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మెట్ట భూమి సాగులో నీటి నిర్వహణ ప్రాముఖ్యతను డాక్టర్ ఆర్.ఎస్.పరోడా వివరించారు. ప్రతీ నీటి బొట్టు నుంచి ఆర్థిక, పోషక విలువలను రాబట్టేలా చూడాలన్నారు. మెట్ట ప్రాంతాల తదుపరి దశ అభివృద్ధి... లాభదాయకమైన, పర్యావరణ అనుకూల, విపత్తులను తట్టుకోగల, భవిష్యత్ తరాలను ఆకర్షించే వ్యవసాయ వ్యవస్థల దిశగా సాగాలని డాక్టర్ పంజాబ్ సింగ్ స్పష్టం చేశారు.
మెట్ట ప్రాంతాల్లో వేగవంతమైన పరిష్కారాల అమలు, విస్తరణ, విజ్ఞానం, నైపుణ్యం, విజయవంతమైన విధానాలను పంచుకోవటంలో గ్లోబల్ సౌత్ దేశాల మధ్య పరస్పర సహకార ప్రాముఖ్యతను డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర వివరించారు. మెట్ట వ్యవసాయంపై ప్రపంచవ్యాప్తంగా మరింత దృష్టి, పెట్టుబడులు, కార్యాచరణ అవసరమని ఇక్రిశాట్ బోర్డు చైర్‌పర్సన్ శ్రీమతి కాథీ రీడ్ పిలుపునిచ్చారు. మెట్ట ప్రాంతాల్లో వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయటంలో గ్లోబల్ సౌత్ దేశాల మధ్య పరస్పర సహకారానికున్న ప్రాధాన్యతను స్పష్టం చేశారు.
ఇక్రిశాట్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ విలియం డి. దార్ మాట్లాడుతూ... గ్లోబల్ సౌత్ దేశాలు సమాన భాగస్వాములుగా పరస్పరం నేర్చుకునేందుకు, నూతన ఆవిష్కరణలను సాధించేందుకు, ఉమ్మడిగా పరిష్కారాలను విస్తరించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల సహకారం ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఇతర మెట్ట ప్రాంతాల్లో సులభంగా అవలంబించగల, విస్తరించగల వినూత్న పరిష్కారాల కోసం గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ వనరుగా మారుతోందని సీజీఐఏఆర్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సాండ్రా మిలాచ్ తెలిపారు.
మెట్ట భూముల వ్యవసాయ పరివర్తనకు తోడ్పడేలా... శాస్త్రీయ ఆవిష్కరణలు, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి, స్థిరమైన వ్యవసాయ విధానాలు, పోషకాహారం, మార్కెట్లు, విధానాలు, ఉపాధి అవకాశాలపై దృష్టి సారిస్తూ డ్రైల్యాండ్ కాంగ్రెస్-2026లో రాబోయే రెండు రోజుల పాటు చర్చలు కొనసాగుతాయి.
***
(రిలీజ్ ఐడి: 2309182)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4