వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2030 నాటికి 100 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని సాధించేందుకు భారత్‌ - రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ పిలుపు


ఔషధాలు, ఆటో విడిభాగాలు, ఆహార ఉత్పత్తులు తదితర రంగాల్లో రష్యాకు భారత్‌ ఎగుమతులను విస్తరించేందుకు ఉన్న అవకాశాలను వివరించిన శ్రీ పీయూష్‌ గోయల్‌

భారత్‌లో తయారీ కార్యకలాపాలు చేపట్టేందుకు వినియోగానికి సిద్ధంగా ఉన్న పారిశ్రామిక కారిడార్లను వినియోగించుకోవాలని రష్యా వ్యాపార సంస్థలకు శ్రీ గోయల్‌ ఆహ్వానం

నాడు పోస్టు చేయడమైనది: 10 SEP 2026 7:10PM by PIB Hyderabad

భారత్‌ - రష్యా ఆర్థిక, పారిశ్రామిక భాగస్వామ్యాన్ని మరింత వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ పిలుపునిచ్చారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్‌ డాలర్లకు, ఇరుదేశాల మధ్య పరస్పర పెట్టుబడులను 50 బిలియన్‌ డాలర్లకు చేర్చే లక్ష్యాలను సాధించేందుకు ఇరుదేశాల వ్యాపార సంస్థలు కృషి చేయాలని ఆయన కోరారు. న్యూఢిల్లీలో ఈ రోజు ఇన్నోప్రోమ్‌ ఇండియా - 2026 ప్లీనరీ సమావేశానికి శ్రీ గోయల్‌ రష్యా పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ ఆంటన్‌ అలిఖానోవ్‌తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఇరుదేశాల అధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు రెండు దేశాల ప్రభుత్వాలు, వ్యాపార సంస్థల పనితీరుకు కొలమానంగా నిలుస్తాయని శ్రీ గోయల్ తమ ప్రసంగంలో 

ప్రస్తుతం సుమారు 60 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్‌ డాలర్లకు పెంచాలంటే వచ్చే నాలుగేళ్లలో మరో 40 బిలియన్‌ డాలర్ల మేర వాణిజ్యాన్ని పెంచడంతో పాటు, ఏడాది ప్రాతిపదికన రెండంకెల స్థాయిలో నిరంతర వృద్ధిని సాధించాల్సి ఉంటుందని శ్రీ గోయల్‌ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వాల నుంచి మాత్రమే కాకుండా ఇరుదేశాల వ్యాపార వర్గాల నుంచి కూడా సమానంగా గణనీయమైన కృషి అవసరమని ఆయన స్పష్టం చేశారు.

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడంతో పాటు విభిన్న రంగాలకు విస్తరించే అవకాశాలను శ్రీ గోయల్‌ వివరించారు. భారతదేశం నుంచి మాంసం, వండిన మాంస ఉత్పత్తుల ఎగుమతులు 36 మిలియన్‌ డాలర్ల నుంచి 97 మిలియన్‌ డాలర్లకు పెరిగి, దాదాపు 170 శాతం వృద్ధిని నమోదు చేశాయని తెలిపారు. చేపలు, జల ఉత్పత్తుల ఎగుమతులు 123 మిలియన్‌ డాలర్ల నుంచి 159 మిలియన్‌ డాలర్లకు పెరిగి దాదాపు 30 శాతం వృద్ధి సాధించాయి. కూరగాయల ఎగుమతులు 38 మిలియన్‌ డాలర్ల నుంచి 54 మిలియన్‌ డాలర్లకు పెరిగి 40 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు 13 శాతం పెరిగి 116 మిలియన్‌ డాలర్లకు చేరుకోగా, మిల్లింగ్‌ పరిశ్రమ ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు రెట్టింపయ్యాయి.

ఈ గణాంకాలు భారత రైతులు, ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు), ఎంఎస్ఎంఈ ఎగుమతిదారులు తయారు చేసే ఉత్పత్తులకు రష్యా మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నాయని శ్రీ గోయల్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అవకాశాల్లో స్వల్ప భాగాన్ని మాత్రమే వినియోగించుకున్నామని ఆయన తెలిపారు. ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థల పరస్పర అనుకూలతను ప్రస్తావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా రష్యా గణనీయంగా దిగుమతి చేసుకునే, భారత్‌ గణనీయంగా ఎగుమతి చేసే అనేక ఉత్పత్తులు ఉన్నప్పటికీ, రష్యాకు భారత్‌ నుంచి వాటి ఎగుమతులు ఇంకా గణనీయమైన స్థాయికి చేరుకోలేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఔషధాలు, ఆటో విడిభాగాలు, ట్రాక్టర్లు, ఆహార ఉత్పత్తులు వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇరుదేశాల మధ్య ఇంధనేతర వాణిజ్యం దాని పూర్తి సామర్థ్యంతో పోలిస్తే ఇంకా చాలా తక్కువ స్థాయిలోనే ఉందని, 60 బిలియన్‌ డాలర్ల నుంచి 100 బిలియన్‌ డాలర్లకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు పూడ్చాల్సిన అంతరాన్ని ఇది సూచిస్తోందని మంత్రి తెలిపారు. ఔషధాలు, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, రసాయనాలు, వస్త్రాలు, ఆహార ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, ఆటోమొబైల్‌ ఉత్పత్తుల ఎగుమతులను భారత్‌ నుంచి మరింత పెంచడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతుల్యత సాధించడం ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలకమని ఆయన పేర్కొన్నారు.

పెట్టుబడుల అంశంపై శ్రీ గోయల్‌ మాట్లాడుతూ, భారత్‌ - రష్యా ప్రాధాన్యతా పెట్టుబడి ప్రాజెక్టుల వ్యవస్థ ప్రస్తుతం అధునాతన తయారీ, ఇంధనం, గనులు, రైల్వేలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి రంగాల్లో 40 క్రియాశీల పెట్టుబడి ప్రాజెక్టులను పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఔషధాలు, ఐటీ, కృత్రిమ మేధ, సేవలు, ఇంజినీరింగ్‌, రైల్వేలు వంటి రంగాల్లో భారత్‌ నుంచి రష్యాలో పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు కల్పించేలా రష్యా ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. తద్వారా 50 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి లక్ష్యం అసలైన పరస్పర పెట్టుబడి లక్ష్యంగా మారుతుందని పేర్కొన్నారు.

భారత్‌, రష్యా దేశాలు కొత్త ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని వేగంగా ఖరారు చేసేందుకు చర్యలు చేపడుతున్నాయని శ్రీ గోయల్‌ తెలిపారు. పెట్టుబడులకు అనువైన గమ్యస్థానాలను ఎంపిక చేసుకునే సమయంలో ఇరుదేశాల పెట్టుబడిదారులకు అవసరమైన చట్టపరమైన స్పష్టత, భరోసాను ఈ ఒప్పందం కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. రష్యా, బెలారస్‌, కజకిస్థాన్‌, ఆర్మేనియా, కిర్గిజ్‌ రిపబ్లిక్‌లతో కూడిన యురేషియన్‌ ఎకనామిక్‌ యూనియన్‌తో భారత్‌ గత ఏడాది అధికారిక స్వేచ్ఛా వాణిజ్య చర్చలను ప్రారంభించిందని ఆయన తెలిపారు. పరిశ్రమలకు, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈలు) సంస్థలకు కొత్త మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ చర్చల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడానికి భారత్‌ కట్టుబడి ఉందని శ్రీ గోయల్‌ స్పష్టం చేశారు.

ఇరుదేశాలు జాతీయ, స్థానిక కరెన్సీలలో చెల్లింపుల పరిష్కార వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నాయని మంత్రి తెలిపారు. సుంకాల కంటే చెల్లింపులకు సంబంధించిన అవరోధాలే క్షేత్రస్థాయిలో వాణిజ్యాన్ని ఎక్కువగా మందగింపజేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉత్తర - దక్షిణ రవాణా కారిడార్‌, చెన్నై - వ్లాదివోస్తోక్‌ సముద్ర మార్గం సహా ద్వైపాక్షిక సంబంధాలకు భౌతిక పునాదిగా నిలిచే మౌలిక వసతుల్లో పెట్టుబడుల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అనుసంధానత అనేది కేవలం మౌలిక వసతుల అంశం మాత్రమే కాదని, వాణిజ్య విధానంలోనూ అది కీలక భాగమని ఆయన స్పష్టం చేశారు.

ఇరుదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, అధికారులు చేపట్టాల్సిన ఐదు నిర్దిష్ట చర్యలను శ్రీ గోయల్‌ సూచించారు. మొదటగా, ఢిల్లీ నుంచి వెళ్లేలోగా కనీసం ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకోవాలని, ఒక కొత్త మిత్రుని, భాగస్వామిని గుర్తించాలని, కనీసం ఒక స్పష్టమైన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఆయన వ్యాపార వర్గాలను కోరారు. రెండోది, ముఖ్యంగా ఔషధాలు, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, రసాయనాలు, ఆటో విడిభాగాలు, ట్రాక్టర్‌ విడిభాగాలు, వస్త్రాలు, ఆహారం, వ్యవసాయ సాంకేతికత, సముద్ర ఉత్పత్తులు వంటి రంగాల్లో ఇంధనేతర కొత్త ఉత్పత్తి విభాగాన్ని తమ వాణిజ్య, పెట్టుబడి ప్రణాళికల్లో చేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ రంగాలు 100 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని సాధించడంలో కీలకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

మూడోది, రష్యా పరిశ్రమలు భారత్‌లో తమ ఉత్పత్తులను విక్రయించడంతో పాటు ఇక్కడే తయారీ కార్యకలాపాలను చేపట్టాలని శ్రీ గోయల్‌ కోరారు. భారత్‌లోని జాతీయ పారిశ్రామిక కారిడార్లు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాముల కోసం వినియోగానికి సిద్దంగా ఉన్న (ప్లగ్‌ అండ్‌ ప్లే) మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. యువతతో కూడిన ప్రతిభావంతమైన మానవ వనరులు, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి రష్యా కంపెనీలకు భారత్‌లో ముఖ్యమైన వనరుగా నిలుస్తాయని, రష్యాలో ఇలాంటి నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి లభ్యత కష్టంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.

నాలుగోది, భారత పారిశ్రామిక వేత్తలు రష్యాను కేవలం సందర్శకులుగా కాకుండా పెట్టుబడిదారులు, ఎగుమతిదారులుగా సందర్శించాలని శ్రీ గోయల్‌ కోరారు. కొత్త స్నేహ సంబంధాలు, భాగస్వామ్యాలు, వ్యాపార అవకాశాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఐదోది, ఇరుదేశాల అధికారులు పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలను స్వీకరించి, వాణిజ్యం, పెట్టుబడులకు అడ్డంకులుగా ఉన్న అంశాలను గుర్తించాలని శ్రీ గోయల్‌ కోరారు. చెల్లింపు వ్యవస్థలు, ధ్రువీకరణ అవసరాలు, ప్రమాణాలు, సరకు రవాణా, వీసా లభ్యత లేదా అనుమతుల ప్రక్రియలు ఏవైనా ఇబ్బందులకు కారణమవుతున్నాయా అనే అంశాలను పరిశీలించాలని ఆయన సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను సులభంగా, సాఫీగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు తాను, తన సహచరులు రష్యా పక్షానికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు.

భారతదేశాన్ని పెట్టుబడులు, తయారీకి అనుకూల కేంద్రంగా నిలబెట్టే బలాలను శ్రీ గోయల్‌ వివరించారు. మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, పారిశ్రామిక పార్కుల పథకం, స్టార్టప్‌ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా భారత్‌ విస్తృత స్థాయి, వేగంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక తయారీ పునాదిని అందిస్తోందని ఆయన అన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, రైల్వేలు, అంతర్గత జలమార్గాలు, విద్యుత్‌ మౌలిక సదుపాయాలు, నీటి మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక పార్కుల్లో కొత్త మౌలిక సదుపాయాల నిర్మాణం, సామర్థ్య విస్తరణకు భారత్‌ ప్రతి సంవత్సరం 130 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడుతోందని ఆయన తెలిపారు. భారత్‌లో ప్రపంచ భాగస్వాములకు ఆతిథ్యం ఇవ్వగల సరైన వ్యవస్థ, మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు బలమైన కృషి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

భారత్‌ సమృద్ధిగా ప్రతిభ, నైపుణ్యాలను అందించగలదని, అలాగే ప్రపంచ భాగస్వాములతో కలిసి ఆవిష్కరణలు, రూపకల్పన, సహ రూపకల్పన, సహ సృష్టి, సహ తయారీ చేసేందుకు సిద్ధంగా ఉన్న యువ, ఆశాజనక జనాభా దేశంలో ఉందని శ్రీ గోయల్‌ అన్నారు. ముఖ్యంగా ఏరోస్పేస్‌, లోహశాస్త్రం, అణు సాంకేతికత, గనుల రంగాల్లో రష్యాకు దశాబ్దాల ఇంజినీరింగ్‌ నైపుణ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌, రష్యాల బలాలు కలిసినప్పుడు ఈ సంబంధం వాణిజ్యాన్ని మించి, ఇరు ఆర్థిక వ్యవస్థల్లోనూ సుస్థిరతను పెంపొందించగలదని ఆయన స్పష్టం చేశారు. 

భారత్‌ - రష్యా చిరకాల సంబంధాలను ప్రస్తావిస్తూ, మారుతున్న ప్రపంచ పరిణామాలను తట్టుకుంటూ ఈ బంధం ఏడు దశాబ్దాలుగా కొనసాగుతోందని శ్రీ గోయల్‌ అన్నారు. ఇప్పుడు ఇరుదేశాల ముందున్న కర్తవ్యం కేవలం ఈ సంబంధాన్ని కొనసాగించడం మాత్రమే కాదని, దాన్ని మరింత వేగవంతం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ “భారత్‌ - రష్యా సంబంధాలకున్న అతిపెద్ద బలం పరస్పర విశ్వాసం. ఈ విశ్వాసం మన ఉమ్మడి కృషికి దిశ, వేగాన్ని అందించడంతో పాటు, కొత్త కలలు, ఆకాంక్షలకు స్ఫూర్తినిచ్చే వేదికగా నిలుస్తుంది” అని శ్రీ గోయల్ అన్నారు.

భారత్‌లో ఇన్నోప్రోమ్‌ తొలిసారిగా జరగడం ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నదని శ్రీ గోయల్‌ అన్నారు. గ్లోబల్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌గా ఇన్నోప్రోమ్‌ గత దశాబ్దానికి పైగా రష్యా ఇంజినీరింగ్‌, తయారీ రంగాల సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ వేదికను భారత్‌కు తీసుకురావడం ద్వారా ఇరుదేశాల సంబంధాలు ప్రస్తుతం ఏ స్థాయికి చేరుకున్నాయో స్పష్టమవుతోందని, అలాగే విధివిధానాల నుంచి ఉత్పత్తి దిశగా, సంకల్పం నుంచి పరిశ్రమ దిశగా ముందుకు సాగేందుకు ఇరుదేశాలు సిద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని ఇది ప్రతిబింబిస్తోందని ఆయన తెలిపారు.

గత కొన్ని నెలలుగా ఆర్థిక, పారిశ్రామిక సహకారాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఇరుదేశాల మంత్రిత్వ శాఖలు సన్నిహితంగా పనిచేస్తున్నాయని శ్రీ గోయల్‌ తెలిపారు. రష్యా పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ ఆంటన్‌ అలిఖానోవ్‌ పర్యటన ఈ పురోగతిని మరింత వేగవంతం చేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇన్నోప్రోమ్‌ ఇండియాలో భాగస్వామ్యానికి గానూ రష్యా పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ ఆంటన్‌ అలిఖానోవ్‌కు, మొత్తం రష్యా ప్రతినిధి బృందానికి  శ్రీ గోయల్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నోప్రోమ్‌ ఇండియా 2026 విజయవంతం కావాలని, ఈ ప్రదర్శనలో పాల్గొన్న అన్ని వ్యాపార సంస్థలకు సత్ఫలితాలు రావాలని ఆయన ఆకాంక్షించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2308971) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , Urdu , हिन्दी , Gujarati