ప్రధాన మంత్రి కార్యాలయం
పారిస్ అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 3:22PM by PIB Hyderabad
మిత్రుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్కూ, ప్రముఖులకూ, కార్యక్రమ భాగస్వాములందరికీ.. నమస్కారం!
ఈ మొదటి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో భాగస్వామిని కావడం నాకెంతో సంతోషంగా ఉంది. నన్ను ఎంతో గౌరవంతో ఆహ్వానిస్తూ సమయోచితమైన ఈ విశేష కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అధ్యక్షుడు మాక్రాన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. శతాబ్దాలుగా మన ఆలోచనలకూ, ఊహలకూ అంతరిక్షం ఊపిరిపోసింది. నేడు వాతావరణ మార్పుల నుంచి పంటల దిగుబడి వరకూ, సముద్రాల స్థితిగతుల నుంచి సమాజ సంక్షేమం వరకూ... భూమిపై మన మనుగడనూ అంతరిక్ష రంగం నిర్దేశిస్తోంది. అంతరిక్షం అందించే అవకాశాలు అనంతం. అయితే, దానిపై మనకు సమష్టి బాధ్యత ఉంది. అంతరిక్షంలో కక్ష్యలు నానాటికీ కిక్కిరిసిపోతున్న, సాంకేతికతలు అత్యంత శక్తిమంతంగా మారుతున్న, అంతరిక్ష భాగస్వాముల సంఖ్య పెరుగుతున్న ఈ రోజుల్లో... మన నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉండాలి. ఘర్షణలకు కన్నా సహకారానికీ, తక్షణ ప్రయోజనాల కన్నా సుస్థిరతకూ, ఎవరినీ విస్మరణకు గురిచేయకుండా.. సమ్మిళితత్వానికీ మనం ప్రాధాన్యమివ్వాలి.
మిత్రులారా,
‘వసుధైక కుటుంబం’ (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత) అన్న విశాల భావనే భారత్ విధానానికి ప్రాతిపదిక. ఈ స్ఫూర్తి ఇప్పుడు భౌగోళిక హద్దులను దాటి అంతరిక్షానికీ విస్తరించాలి. అంతర్జాతీయ చట్టాలు, చర్చలు, బహుపాక్షిక సహకారం ప్రాతిపదికగా.. సురక్షిత, భద్రమైన, శాంతియుత, సుస్థిర అంతరిక్ష రంగాన్ని సాకారం చేసుకునేందుకు మేం సంపూర్ణంగా మద్దతిస్తున్నాం. పారదర్శకత, సమగ్రతతో... సర్వజన హితానికీ, ప్రజా సంక్షేమానికీ శాస్త్రీయ సమాచారం ఉపయోగపడాలి.
ఈ ఉదార తాత్వికతనే భారత అంతరిక్ష ప్రయాణం ప్రతిబింబిస్తోంది. ఈ ప్రస్థానానికి మూలస్తంభంగా నిలిచిన ఇస్రో.. అసాధారణ నైపుణ్యంతో, తక్కువ వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్త ప్రశంసలను అందుకుంది. ఇస్రో సాంకేతిక సామర్థ్యాలు రైతులకు, మత్స్యకారులకు ఎంతో మేలు చేయడంతోపాటు.. వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ, నావిగేషన్ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటివరకు 34 విభిన్న దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలను భారతీయ రాకెట్లు అంతరిక్షంలోకి పంపించాయి. ఇస్రో అందించే సాంకేతికతలు, భాగస్వామ్యాలు భారత్‌కు మాత్రమే కాదు.. యావత్ ప్రపంచానికీ సేవలందిస్తున్నాయి.
ఈ అంతర్జాతీయ విశ్వాసం వెనుక.. తరతరాల భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల అంకితభావం, నిరంతర శ్రమ దాగి ఉన్నాయి. అహర్నిశలూ శ్రమిస్తూ.. ఒక్కో మిషన్ ద్వారా ఒక్కో విజయంతో ఇస్రోకి వారు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టారు. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్‌కు విశిష్టమైన, ప్రతిష్ఠాత్మకమైన స్థానాన్ని కల్పించారు.
చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధృవం సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఆదిత్య- ఎల్1 సూర్యుడి రహస్యాలను ఛేదిస్తోంది. గతేడాది ఒక భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. భవిష్యత్తుపై దృష్టి సారిస్తూ.. 2035 నాటికి ‘భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని’ ఏర్పాటు చేయాలనీ, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపాలనీ లక్ష్యాలుగా నిర్దేశించుకున్నాం. ఈ దిశగా చేపట్టే చర్యలన్నింటిలోనూ మా మార్గదర్శక సూత్రం సుస్పష్టంగా ఉంది - వీటి ప్రయోజనాలు సమస్త మానవాళికీ అందాలి.
ఇస్రోతోపాటు భారత ప్రైవేటు అంతరిక్ష రంగం కూడా శరవేగంగా దూసుకెళ్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉత్సాహం.. ఇస్రో అత్యుత్తమ నైపుణ్యంతో జతకడుతోంది. 1960లలో తుంబా వేదికగా భారత అంతరిక్ష కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఫ్రాన్స్ మాకు అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా నిలిచింది. నేడు భూ పరిశీలన నుంచి అధునాతన సాంకేతికతల వరకు.. మన సహకారం విస్తరించింది. మానవాళి ప్రయోజనాలనూ, శాస్త్రీయ నైపుణ్యాన్నీ ఇది ఏకం చేస్తోంది. తదుపరి అంతరిక్ష ప్రస్థానంలో భారత్‌తో కలిసి నడవాల్సిందిగా ఫ్రాన్స్‌నూ, ప్రపంచ దేశాలనూ మేం ఆహ్వానిస్తున్నాం.
మిత్రులారా,
‘‘సమస్త మానవాళి కోసం, భవిష్యత్ తరాల కోసం... మనమంతా కలిసి పనిచేద్దాం, సమష్టి ఆవిష్కరణలు చేద్దాం, అంతరిక్షాన్ని రక్షించుకుందాం’’ అన్న స్పష్టమైన సందేశాన్ని పారిస్ అంతరిక్ష సదస్సు ప్రపంచానికి అందించాలి. సదస్సులో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
ధన్యవాదాలు.
***
(రిలీజ్ ఐడి: 2308774)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7