నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు విద్యుత్‌ ప్రదాతగా ప్రజానీకానికి వెలుగులు కూడా పంచుతున్నాడు

· కేంద్ర నవ్య-పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్‌ జోషి వ్యాఖ్య

· “ఒకే భూ కమతం నుంచి ఆహారం.. కాలుష్య రహిత ఇంధన ఉత్పాదనలో అగ్రివోల్టాయిక్స్ ద్వారా రైతులకు వెసులుబాటు”

· న్యూఢిల్లీలో అక్టోబరు 21 నుంచి 23దాకా అంతర్జాతీయ 7వ అగ్రివోల్టాయిక్స్ సదస్సు-2026

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2026 8:07PM by PIB Hyderabad

  దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు విద్యుత్‌ ప్రదాతగా ప్రజానీకానికి వెలుగులు పంచుతున్నాడు” అని కేంద్ర నవ్య-పునరుత్పాదక ఇంధన, విద్య-వినియోగదారు  వ్యవహారాలు-ఆహార-ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి అన్నదాతలను కొనియాడారు. న్యూఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ 7వ అగ్రివోల్టాయిక్స్-2026 సదస్సుకు ముందు ఇవాళ ఏర్పాటు చేసిన సన్నాహక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

‘పీఎం-కుసుమ్’ పథకం తదుపరి దశలో ‘అగ్రివోల్టాయిక్స్’ కోసం ప్రత్యేక కార్యక్రమం అంతర్భాగంగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. తద్వారా రైతులు వ్యవసాయం కొనసాగిస్తూనే విద్యుదుత్పాదన ద్వారానూ ఆదాయార్జన చేయగలరని ఆయన తెలిపారు. ఈ క్రమంలో రైతుకు భూమి హక్కు కొనసాగుతుందని, చిన్న-సన్నకారు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు, పంచాయతీలపై దృష్టి సారిస్తామని వివరించారు. సాధారణంగా రుతుపవనాలు, మార్కెట్ ధరలపై ఆధారపడి జీవించే రైతులకు సౌర విద్యుదుత్పాదన ద్వారా మరింత ఆదాయ భద్రత లభిస్తుందని ఆయన అన్నారు.

ఒక ఎకరా భూమి నుంచి రైతు మూడు రకాల ఆదాయార్జన చేయవచ్చునని శ్రీ జోషి పేర్కొన్నారు. ఈ మేరకు పంట అమ్మకం, డిస్కామ్‌కు విద్యుత్ విక్రయం, డీజిల్‌పై పొదుపుతో ‘త్రివిధ ఆదాయం’ పొందగలరని విశదీకరించారు. ఒక చిన్న రైతుకు సౌరశక్తి ద్వారా అదనపు ఆదాయం లభించడం మాత్రమే కాకుండా ఆదాయ భద్రతకు అదొక ఉపకరణం కాగలదన్నారు. కాలం కలసివచ్చినా, కరవుకాటకాలు సంభవించినా ఇదొక సుస్థిర ఆదాయ వనరుగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

ప్రపంచ జనాభాలో భారత్‌ వాటా సుమారు 18 శాతం కాగా, భూభాగంలో వాటా కేవలం 2.4 శాతం మాత్రమేనని మంత్రి గుర్తుచేశారు. దేశంలోని అన్నదాతలలో 85 శాతానికి పైగా 2 హెక్టార్లకు మించి కమతాలు లేనివారేనని.. అంటే- చిన్న, సన్నకారు రైతులేనని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అగ్రివోల్టాయిక్స్‌ విధానం అమలులోకి వస్తే పంటకు, సౌర విద్యుత్ ప్లాంట్‌కు మధ్య ఏదో ఒకటి ఎంచుకునే పరిస్థితి ఉండదని చెప్పారు. ఈ  రెండింటినీ ఏకకాలంలో కొనసాగించడం… అంటే- ఆ భూమిలో పంట సాగుతో పాటు కాలుష్య రహిత విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసే వీలుంటుందని వివరించారు.

భారత్‌ నిరుడు 55.29 గిగావాట్ల మేర అదనంగా శిలాజేతర విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని శ్రీ జోషి గుర్తు చేశారు. నార్వే (40.6 గిగావాట్లు), స్విట్జర్లాండ్ (సుమారు 30 గిగావాట్లు), ఆస్ట్రియా (34 గిగావాట్లు), బెల్జియం (సుమారు 33 గిగావాట్లు) వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంకన్నా ఇది అధికమని మంత్రి అన్నారు.

పీఎం-కుసుమ్ పథకం కింద సాధించిన ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- సుమారు 29 లక్షల పంపులను సౌరశక్తితో అనుసంధానించామని శ్రీ జోషి తెలిపారు. అలాగే, నిరుడు వికేంద్రీకృత సౌరశక్తి 16.3 గిగావాట్ల విద్యుత్తును సరఫరా చేయగా, ఇందులో పీఎం-కుసుమ్ వాటా 7.6 గిగావాట్లు… ప్రధానంగా ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’  కింద పైకప్పు సౌరశక్తి ద్వారా 8.7 గిగావాట్లుగా ఉందని చెప్పారు. తద్వారా 56 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ప్రయోజనం కలిగిందని ఆయన వెల్లడించారు.

వివిధ పంటలు, వాతావరణాలు, ప్రాంతాలకు ఏది ఉత్తమమో అవగాహన చేసుకోవడానికి అగ్రివోల్టాయిక్స్‌పై మరింత పరిశోధన అవసరమని కేంద్ర మంత్రి ప్రస్ఫుటం చేశారు. పుణెలోని ‘బీఏఐఎఫ్’ గ్రామీణ ఆవిష్కరణల కేంద్రం పరిశోధకులు 30 పంటలతో 17 సౌర విద్యుత్తు సంధాన విధానాలను పరీక్షిస్తున్నారని ఆయన ప్రస్తావించారు. ప్రతి సాగు పరిస్థితితో పంట, ప్యానెల్ ఎత్తు, అంతరం, ట్రాకింగ్ వ్యవస్థ, వ్యాపార నమూనాల సముచిత సమ్మేళనం నిర్ధారణ ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేశారు.

ట్రాక్టర్లు, పంటకోత యంత్రాలు స్వేచ్ఛగా తిరిగే, స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకోగల నిర్మాణాలపై ఐసీఏఆర్, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు పంటల వారీ, ప్రాంతాలవారీ సమాచార సేకరణ, సంప్రదాయ సౌరశక్తి మధ్యగల వ్యయ వ్యత్యాసం తగ్గించేగల నిర్మాణాలు, పదార్థాలు, మౌంటింగ్ వ్యవస్థల ఆవిష్కరణపై పరిశ్రమ, ఆవిష్కర్తలు, భాగస్వాములు దృష్టి సారించాలని శ్రీ జోషి కోరారు. భారత్‌ ఇప్పటికే గ్రామీణ స్థాయిలో నైపుణ్య వికాసానికి చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా దాదాపు 70,000 మంది ‘సూర్య మిత్ర’లకు శిక్షణ ఇచ్చిందని ఆయన తెలిపారు.

భారత వ్యవసాయ-సౌరశక్తి అనుభవం ప్రత్యేకించి పేద దేశాలకు ప్రయోజనకరమని మంత్రి అన్నారు. ఆయా దేశాల్లోనూ రైతులు చిన్న కమతాల యజమానులే కావడం, సూర్యరశ్మికి కొదవ లేకపోవడం వంటి అవకాశాలున్నాయని తెలిపారు. అయితే, గ్రిడ్‌ల విషయంలో మరింత ప్రగతి సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పేద దేశాలన్నిటా అనుసరించగల సరళ, చౌక, ఆచరణాత్మక పరిష్కారాల రూపకల్పనలతో భారత్‌కుగల విశాల అనుభవం ఒక అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు.

ఈ సన్నాహక కార్యక్రమంలో భాగంగా అధికారిక సదస్సు లోగోను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. అలాగే, అంతర్జాతీయ 7వ అగ్రివోల్టాయిక్స్ సదస్సు-2026 టీజర్‌ను కూడా విడుదల చేశారు. “పొలాల నుంచి వినియోగదారుకు వరకూ ఆవిష్కరణలకు ఇంధనం” ఇతివృత్తంగా ‘అగ్రివోల్టాయిక్స్ పిచ్ హబ్‌’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ‘నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ విజ్ఞాన భాగస్వామిగా వ్యవహరించనుంది. ఆహారం, ఇంధనం, ఫైబర్ అనే ‘3ఎఫ్‌’ చట్రం ప్రాతిపదికగా నిర్మితం కానున్న ‘ఈ పిచ్ హబ్’ అగ్రివోల్టాయిక్స్ భవిష్యత్తుకు దోహదపడే వినూత్న పరిష్కారాలను ఆహ్వానిస్తుంది.

నేటి కార్యక్రమంలో అనేక జాతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో పాటు మంత్రిత్వశాఖలు, రాష్ట్ర విభాగాలు, పరిశోధన-పారిశ్రామిక రంగాల సీనియర్ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో అక్టోబరు 21 నుంచి 23 వరకూ అంతర్జాతీయ 7వ అగ్రివోల్టాయిక్స్ సదస్సు-2026ను నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ-సౌరశక్తి భవితవ్యంపై చర్చలతోపాటు ఈ రంగం విస్తరణకు గల మార్గాన్వేషణకు ప్రపంచవ్యాప్త రైతులు, విధాన రూపకర్తలు, పరిశోధకులు, పారిశ్రామిక అగ్రగాములు, అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు, ఇతర భాగస్వాములను ఒకే వేదికపైకి వస్తారు.

జాతీయ-అంతర్జాతీయ భాగస్వాముల అనుభవ ఆదానప్రదానానికి, భాగస్వామ్యాల ఏర్పాటుకు, వ్యవసాయం-సౌరశక్తి ఏకీకరణ దిశగా ఆచరణాత్మక మార్గాన్వేషణకు ఈ సదస్సు కీలక వేదిక కాగలదని అంచనా. రైతు-కేంద్రక, సుస్థిర, విస్తరణీయ వ్యవసాయ-సౌరశక్తి పరిష్కారాన్వేషణ సహా ఈ రంగంపై అంతర్జాతీయ చర్చకు స్ఫూర్తినివ్వడంలో భారత్‌ పాత్ర బలోపేతానికీ ఇది ఉపకరిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2308566) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada