పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
గువహటిలోని ఎన్ఆర్ఎల్ సెంటర్‌లో రేపు ప్రత్యేక కో వర్కింగ్ స్పేస్, ఇన్నొవేషన్ కేంద్రాన్ని ప్రారంభించనున్న ఎంసీ2
50కి పైగా పనికేంద్రాలు, 16 క్యాబిన్లు, పెట్టుబడిదారు, సాంకేతిక సంప్రదింపుల కేంద్రాలు
ఈశాన్య రాష్ట్రాల్లో అంకుర సంస్థలకు ఊతం
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 2:02PM by PIB Hyderabad
దేశంలో, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో అంకుర సంస్థలు, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో.. ఎంసీ²+ సంస్థ రేపు కీలక ముందడుగు వేయనుంది. గువహటీలోని ఎన్ఆర్ఎల్ సెంటర్ ఆరో అంతస్తులో ప్రత్యేక ‘నోడ్, కో వర్కింగ్ స్పేస్’ను ప్రారంభించనుంది.
గువహటి కేంద్రంగా నిర్మించిన ఈ నూతన కేంద్రాన్ని... అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తల కోసం ఒక ప్రభావవంతమైన, సహకారాత్మక, వృత్తిపరమైన సదుపాయాలతో కూడిన వాతావరణాన్ని అందించే వేదికగా తీర్చిదిద్దారు. వర్ధమాన సంస్థల మారుతున్న అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కేంద్రం.. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, నిపుణుల మార్గనిర్దేశం, సాంకేతిక నైపుణ్యం, పెట్టుబడిదారులతో అనుసంధానం, పారిశ్రామిక భాగస్వామ్యాలను ఒకే ఛత్రం కిందికి తెస్తోంది.
50కి పైగా నిర్దిష్ట పని ప్రదేశాలు, 16 క్యాబిన్లు, 4 పెట్టుబడిదారుల మీటింగ్ రూంలు, 2 సాంకేతిక సంప్రదింపుల రూంలతోపాటు 2 సమావేశ మందిరాలు, పూర్తిస్థాయి కెఫ్టేరియా, ఉమ్మడి ప్రాంగణాలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ప్రముఖ అంకుర సంస్థలు, ఆవిష్కరణ ప్రాంగణాలకు సరిసమానంగా.. అత్యుత్తమ ప్రమాణాలతో ఈ మౌలిక వసతులను రూపొందించారు. ఇది అంకుర సంస్థలు పనిచేసుకోవడానికి, పరస్పర సహకారానికి, అభివృద్ధి చెందడానికి ఒక వృత్తిపరమైన, ప్రస్తుత ధోరణులకు తగిన వాతావరణాన్ని అందిస్తుంది.
ఈ పెట్టుబడిదారుల మీటింగ్ రూంలు.. అంకుర సంస్థల వ్యవస్థాపకులు పరస్పరం ఆలోచనలను పంచుకోవడానికీ, పెట్టుబడిదారులతో చర్చించడానికీ, నిధుల సేకరణతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్య అవకాశాల అన్వేషణకూ ప్రత్యేక వేదికను అందిస్తాయి. అలాగే సాంకేతిక సంప్రదింపుల రూంలు నిపుణులతో ముఖాముఖి చర్చలకు వీలు కల్పిస్తూ.. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, ఉత్పత్తుల మెరుగుదల, సాంకేతిక సవాళ్ల పరిష్కారంలో అంకుర సంస్థలకు మార్గనిర్దేశాన్ని అందిస్తాయి.
ఈ ప్రాంగణం అందించే సేవలు భౌతిక మౌలిక వసతులకు మాత్రమే పరిమితం కాలేదు. అంకుర సంస్థలకు విభిన్న రంగాల నిపుణులు, సాంకేతిక సలహాదారులు, న్యాయ నిపుణులు, ప్రత్యేక ఆర్థిక, ఆడిట్ నిపుణులతో కూడిన ఒక సమగ్ర సహాయక
వ్యవస్థ ఎంసీ2 ని అందుబాటులోకి తేనుంది. ఇది సాంకేతికత - ఉత్పత్తుల అభివృద్ధి, మేధో సంపత్తి, ఒప్పందాలు - నియంత్రణా నిబంధనలు, ఆర్థిక ప్రణాళిక, అకౌంటింగ్, ఆడిట్ సన్నాహకాలు, అనుమతులు, వ్యాపార పునర్నిర్మాణం వంటి కీలక అంశాల్లో వృత్తిపరమైన మార్గనిర్దేశాన్ని పొందడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంతగానో తోడ్పడుతుంది.
సంప్రదాయ పనిప్రదేశాల మాదిరిగా కాకుండా... ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికీ, తమ ఆలోచనలను పంచుకోవడానికీ, భవిష్యత్తులో అర్థవంతమైన భాగస్వామ్యాలుగా అవతరించగల పరిచయాలను ఏర్పరచుకోవడానికీ అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేలా ఒక పూర్తిస్థాయి కెఫ్టేరియా, కేఫ్ప్యాంట్రీని ఇక్కడ తీర్చిదిద్దారు. ఆత్మీయ చర్చలకు, నెట్వర్కును పెంచుకునేందుకు వేదికగా ఇది ఉపయోగపడుతుంది.
అంకుర సంస్థలకు కేవలం పనిచేసుకోవడానికి ఒక స్థలాన్ని మాత్రమే కాకుండా, అంతకు మించి ఒక బలమైన వేదికను అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. తమ వ్యాపార ప్రయాణంలోని వివిధ దశల్లో అత్యవసరమైన మౌలిక వసతులను, విషయ పరిజ్ఞానాన్ని, నిపుణుల మార్గదర్శకత్వాన్ని, వృత్తిపరమైన సలహాలను ఒకే చోట అందించేలా దీన్ని రూపొందించారు.
గువహటిలోని ఎన్ఆర్ఎల్ సెంటర్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం.. గువహటి, ఈశాన్య రాష్ట్రాల్లో అంకుర సంస్థలు, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన ముందడుగు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిపుణులు, పెట్టుబడిదారులు, పరిశ్రమ భాగస్వాములను ఒక్కచోటకు తెచ్చి... ఆవిష్కరణ దశ నుంచి అభివృద్ధి, ధ్రువీకరణ, విస్తరణ దశల వరకు ఆలోచనలను ముందకు తీసుకెళ్లేందుకు వీలు కల్పించే వాతావరణాన్ని సృష్టించడమే దీని లక్ష్యం.
గువహటిలోని ఎన్ఆర్ఎల్ సెంటర్‌లో రేపు, అంటే 2026 సెప్టెంబరు 10న దీన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2308380)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2