ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని వడోదరలో ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 4:23PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఆన్‌లైన్ ద్వారా మాతో మమేకమైన ఇతర రాష్ట్రాల ప్రముఖులు- మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి శ్రీ సునేత్ర పవార్ సహా ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యక్రమంలో పాల్గొంటున్న లక్షలాది మంది పౌరులు… వేదికను అలంకరించిన కేంద్ర మంత్రిమండలి సహచరులు శ్రీ అశ్వనీ వైష్ణవ్, ఉప ముఖ్యమంత్రి-యువజన నాయకుడు హర్ష్ సంఘవి, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, గుజరాత్‌లోని నా ప్రియ సోదరీసోదరులారా!
ముఖ్యంగా… వడోదరలోని మహారాజా సయాజీరావు విశ్వవిద్యాలయ మైదానం వివిధ రంగాల వారిని ఒకే వేదికపైకి చేరుస్తోంది కాబట్టి, ఇక్కడ ఈ ప్రగతి వేడుకను ఇక్కడ ఏక కాలంలో నిర్వహిస్తుండటం విశేషం.
మిత్రులారా!
‘వికసిత భారత్’ ప్రస్థాన వేగాన్ని మరింత పెంచడం లక్ష్యంగా నేనివాళ మీ మధ్యకు వచ్చాను. కొద్దిసేపటి కిందటే దేశ ప్రగతి సంబంధిత వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఇక్కడ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశాం. ఈ సందర్భంగా దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఈ ప్రగతి వేడుక నేపథ్యంలో వడోదర నగరవ్యాప్తంగా సేవాభావంతో చేపట్టిన పరిశుభ్రత, స్వాగత కార్యక్రమాలపై ఇక్కడి పౌరులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రశంసిస్తున్నాను. నిన్న నేను చూసిన ఒక వీడియో మీ ఉత్సాహాన్ని కళ్లకు కట్టింది. అది చూశాక నా హృదయం గర్వంతో ఉప్పొంగింది. ఎంతటి అద్భుతం! ఇది నా వడోదర నగరమేనా? ఇప్పుడిక్కడ గణేశుని ఉత్సవ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత నవరాత్రి వేడుకలు ఉంటాయి. ఈ రెండు ఉత్సవాల వేళ యావత్ గుజరాత్ దృష్టి వడోదర నగరంపైనే కేంద్రకృతం అవుతుంది. ఈ నేపథ్యంలో వారం నుంచీ ప్రతి కుటుంబం పరిశుభ్ర వాతావరణం సృష్టించే దిశగా శ్రమించడం నేను ఆసక్తితో గమనించాను. ఈసారి గణేశుని రాక వడోదరపై ఆశీస్సుల వర్షం కురిపిస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
మిత్రులారా!
ఈ ఏడాది ఎర్రకోట పైనుంచి నా ప్రసంగంలో భాగంగా 'వికసిత భారత్’ కోసం ‘సప్తధార’ సంకల్పంపై పిలుపునిచ్చాను. ఆ ధారలలో ఒకటి ‘గతిశక్తి’. అభివృద్ధి చెందిన భారత్ కోసం మనకు కాలానుగుణ, నిరంతరాయ, వేగవంతమైన అనుసంధానం అవశ్యం. ఇక వడోదర నగరం ‘గతిశక్తి విశ్వవిద్యాలయ’ నిలయం. ఇక్కడి నుంచే ‘ప్రత్యేక సరకు రవాణా కారిడార్’ తుది సంధానం పనులు సాగాయి. ఈ కారిడార్ ప్రాజెక్టు ఇప్పటికే 2,800 కిలోమీటర్లకు పైగా పూర్తయింది. ఇది ప్రస్తుత 21వ శతాబ్దపు భారత్‌కు ఒక చారిత్రక విజయం.
మిత్రులారా!
మన దేశంలో పని సంస్కృతి గడచిన 12 ఏళ్లలో ఎంతగా రూపాంతరం చెందిందో చెప్పడానికి ఈ ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఒక నిదర్శనం. ఈ ఆలోచన 2004లో మొదలైంది... అంటే- ఇక్కడి యువతరంలో చాలామంది ఆనాటికి పుట్టి ఉండరు. ఇక 2006లో ఈ ప్రాజెక్టు కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసినా, 2014 దాకా ఫైళ్లు బల్లల మీద అటూఇటూ నడుస్తూనే ఉన్నాయి తప్ప పనులు అంగుళం కూడా కదల్లేదు. దురదృష్టవశాత్తు దుమ్ము పేరుకుపోతున్న ఆ ఫైళ్లను భద్రపరచే ఓ అటక కూడా లభించలేదు! ఫైళ్లన్నీ తిరుగుతూ.. వేలాడుతూ.. ఎక్కడెక్కడో ఇరుక్కుపోయాయి. ఇక 2014లో వడోదర, గుజరాత్.. యావద్దేశ ప్రజానీకం నన్ను గుజరాత్ నుంచి ఢిల్లీకి పంపారు. అప్పటిదాకా ఉన్న ప్రభుత్వం గద్దె దిగి పోయింది.. వాస్తవానికి ఈ కారిడార్ శ్రీకారం చుట్టుకున్నాక ఏడేళ్లలో- నా యువ మిత్రులారా.. జాగ్రత్తగా వినండి.. గుర్తుంచుకోండి.. ఒక్క కిలోమీటరు మేర కూడా పనులు పూర్తి కాలేదు. ఒకవేళ దేశం ఆనాటి వేగంతోనే కొనసాగి ఉంటే, బహుశా మూడునాలుగు తరాల తర్వాత కూడా ఇది పూర్తయ్యే అవకాశం ఉండేది కాదు. భారత రవాణా సదుపాయాల వ్యవస్థలో సమూల మార్పులకు ఉద్దేశించిన ప్రాజెక్టును వారింతటి దుస్థితిలోకి నెట్టారు.
మిత్రులారా!
ఇక 2014 తర్వాత మీరిక్కడ నాకిచ్చిన అవగాహన, అనుభవాలు, ఈ నేల నాకు నేర్పిన పాఠాలు ఇవన్నీ ఒక్కటై- ఢిల్లీ చేరిన వెంటనే ఈ ప్రాజెక్టు వేగం పెంచేందుకు దోహదం చేశాయి. ఇవాళ్టికి 2,800 కిలోమీటర్ల కారిడార్ పూర్తి కావడంతో తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు దేశ వాణిజ్యానికి నేడు కీలక పునాదిగా మారుతున్నాయి.
మిత్రులారా!
శరవేగంగా పురోగమించే మన దేశానికి ప్రత్యేక సరకు రవాణా కారిడార్ జీవనాడి వంటిది. ఇది భారత రవాణా రంగాన్ని సమూల రీతిలో మార్చేసింది. లోగడ సరకు రైళ్లతో పాటు ప్రయాణిక రైళ్లు కూడా ఒకే మార్గంలో నడవాల్సి వచ్చేది. అంటే ప్రయాణం, రవాణా రెండూ నెమ్మదిగా సాగేవి. కానీ, నేటి ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఈ దుస్థితిని మార్చేసింది. తూర్పు, పశ్చిమ రవాణా కారిడార్లలో ఇప్పుడు నిత్యం 430కి పైగా సరకు రవాణా రైళ్లు నడుస్తున్నాయి. ఇంతకుముందు ఒక సరకు రవాణా రైలు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే ఆరున్నర గంటలు పట్టేది. ఇప్పుడు అదే రైలు సగం కన్నా తక్కువ సమయంలోనే 100 కిలోమీటర్ల ప్రయాణం పూర్తిచేస్తోంది. సాధారణంగా ట్రక్కుల ద్వారా సరకు రవాణాకు 30 గంటల సమయం పడుతుండగా, ఇప్పుడు ప్రత్యేక కారిడార్ ద్వారా 10-12 గంటల్లోనే పూర్తవుతోంది. అంటే- ఈ కారిడార్‌లో సరకు రవాణా రైళ్లు నడవడం వల్ల ట్రక్కులు-రైళ్లతో పోలిస్తే ఇంధనం ఎంతో ఆదా అవుతుంది. ఫలితంగా రవాణా ఖర్చులు తగ్గి, సమయం ఆదా కావడమే కాకుండా పర్యావరణానికి మేలు కలుగుతుంది. ఏతావాతా ఒకే ట్రాక్‌పై పెట్టిన పెట్టుబడితో అనేక ప్రయోజనాలు చేకూరాయన్న మాట!
మిత్రులారా!
ఈ కారిడార్ ద్వారా తూర్పు, పశ్చిమ భారత రైతుల ఉత్పత్తులు నేడు పెద్ద మార్కెట్లకు మరింత వేగంగా చేరుతున్నాయి. కాలానుగుణంగా అనేక రకాల నశ్వర వస్తువులైన పూలు, కూరగాయలు, పండ్లు వంటివి ఇప్పుడు సకాలంలో మండీలకు, వినియోగదారులకు చేరే మార్గం సుగమమైంది. దీనివల్ల రైతులకూ ఎంతో ప్రయోజనం చేకూరుతోంది.
మిత్రులారా!
ఈ సరకు రవాణా కారిడార్ మరో విధంగానూ విశిష్టమైనది. ఇటీవలే ముంబయిలోని జేఎన్‌పీటీ ఓడరేవు నుంచి వడోదర దాకా ‘డబుల్-స్టాక్ కంటైనర్’ సరకు రవాణా రైలును నడిపారు. అంటే- ఒక కంటైనరుపై మరొకటిగా ఈ రైలును నడిపారు. తద్వారా ముంబయి నుంచి వడోదరకు ఒకేసారి 250కి పైగా ట్రక్కులలో సమానమైన సరకు రవాణా అయింది. అక్షరాలా 250 ట్రక్కులు! ఇప్పుడు- “అసహనపరులైన కొందరు” “ట్రక్కు యజమానుల పరిస్థితేమిటి? ఆ ట్రక్కులన్నీ ఎక్కడికెళ్తాయి? ట్రక్కులు కొన్నవారి భవిష్యత్తేమిటి” అని గావుకేకలు పెడతారు. కానీ, వాస్తవమేమిటంటే ఇప్పుడు దేశంలోని ఒక మూల నుంచి మరో మూలకు భారీ స్థాయిలో సరుకు వేగంగా రవాణా అవుతోంది.
మిత్రులారా!
ఈ కారిడార్‌తో సరకులతో పాటు దశాబ్దాలుగా రైలు సౌకర్యం లేని ప్రాంతాలకూ ఇప్పుడు రైల్వేలు చేరువ అవుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని గిరిజన ప్రాంతాలను కూడా ఈ ప్రాజెక్టు రైలు మార్గంతో అనుసంధానిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో బడ్జెట్ సందర్భంగా ఒకటి లేదా రెండు రైళ్లను ప్రకటించి, ఏడాది పొడవునా అదొక ఘనతగా గొప్పలు చెబుతుండే వారు. కానీ, ఇవాళ ఏడాది పొడవునా ఒకదాని తర్వాత మరొకటిగా కొత్త రైళ్లు ప్రారంభమవుతున్నాయి. నేటి కార్యక్రమంలోనూ అనేక కొత్త రైళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలో వడోదర, ఛోటా ఉదయపూర్, అలీరాజ్‌పూర్ ప్రజలకు కొత్త రైలు ఎంతో సౌకర్యం కల్పిస్తోంది.
మిత్రులారా!
రోడ్లు, రైల్వేలు, మెట్రోలు, విమానాశ్రయాలు, గ్యాస్ పైప్‌లైన్లు, పేదల కోసం ఇళ్లు- ఇలా దేశంలోని కోట్లాది ప్రజల కోసం మౌలిక సదుపాయాలు నిర్మించినప్పుడు జీవన సౌలభ్యం కలుగుతుంది. అదే సమయంలో స్వల్ప స్థాయి నుంచి భారీ స్థాయి దాకా కార్మికులకు లక్షలాది ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఒక్క రైల్వేలనే పరిగణనలోకి తీసుకుంటే- ఈ ఏడాది రైల్వే బడ్జెట్ రూ.2.75 లక్షల కోట్లు దాటింది. అంటే- 12 ఏళ్ల కిందటితో పోలిస్తే ఎన్నో రెట్లు అధికం. అంటే- రైల్వేల ఆధునికీకరణపై వ్యయం వేలాది కొత్త ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తోంది. ఈ ఉద్యోగాలన్నీ నిర్మాణ సమయంలోనే అందివస్తున్నాయి. మొత్తం మీద రోడ్లు, రైల్వేలు, పైప్‌లైన్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు పూర్తయితే, వాటి చుట్టూ ఎన్నో కొత్త పరిశ్రమలు, వ్యాపారాలు ఏర్పడి, మరిన్ని కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
మిత్రులారా,
అభివృద్ధి చెందిన భారత్ సంకల్ప కోసం నేను దేశం ముందు 'సప్తధారల' (ఏడు శక్తి ప్రవాహాల) దార్శనికతను పెట్టాను. ఆ ఏడు ప్రవాహాల్లో తయారీ రంగం కూడా ఒకటి. వడోదర నగరానికి ఈ శక్తి గురించి బాగా తెలుసు. అర్థం చేసుకోగలదు కూడా. విద్య, నైపుణ్యం, పరిశ్రమలు ఎలా కలిసి పనిచేస్తాయో దాదాపు 150 ఏళ్లుగా వడోదర నిరూపిస్తూ వస్తోంది. దశాబ్దాల కిందట ఇక్కడ వస్త్ర, టైల్స్ తయారీతో ఈ ప్రయాణం ప్రారంభమై... ఆ తర్వాత చమురు, పెట్రోకెమికల్స్ రంగాల దిశగా పురోగమించింది. గత రెండు, రెండున్నర దశాబ్దాలుగా ఎంఎస్ఎంఈలకు ప్రధాన కేంద్రంగా వడోదర మారింది. నాకు గుర్తుంది. నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో వడోదర ప్రజలకు నాపై ఎంతో ఆప్యాయత ఉండేది. ప్రతీ వారం ఏదో ఒక ప్రతినిధి బృందం వచ్చి "వడోదరలో తయారీ రంగం కోసం ఏదో ఒకటి చేయండి" అని కోరేది. అప్పట్లో ఇక్కడ జ్యోతి, ఎల్‌ఎంబీ, జీఎస్‌ఎఫ్‌సీ మాత్రమే ఉండేవి. వాటిని మించి ఏమీ ఉండేది కాదు. కానీ నేడు ఎంత మార్పు వచ్చింది! ఇప్పుడు దేశ తొలి 'మేడ్ ఇన్ ఇండియా' సైనిక రవాణా విమానానికి కూడా ఈ నగరం చిరునామాగా మారింది. సీ-295 విమానం తొలి విమానయానాన్ని ఇక్కడి గగనతలంలోనే చూశాం. ఈ అపూర్వ గౌరవాన్ని సాధించిన వడోదర ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
దేశ తయారీ రంగం గురించి నేను కొన్ని గణాంకాలను మీతో పంచుకోవాలనుకుంటున్నా. గత దశాబ్ద కాలంలో రైలు కోచ్‌లు, మెట్రో కోచ్‌లు, రైలు ఇంజిన్ల తయారీలో ప్రధాన దేశంగా భారత్ అవతరించింది. 2014 నుంచి భారత్ దాదాపు 50,000 ఆధునిక రైల్వే కోచ్‌లను తయారు చేసింది. ఈ సంఖ్యను వినండి - 2014 నుంచి భారత్ 50,000 ఆధునిక కోచ్‌లను తయారు చేసింది. మునుపటి ప్రభుత్వం పదేళ్లలో కనీసం 50,000 మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయింది. మేం 50,000 ఆధునిక కోచ్‌లను తయారుచేశాం. భారత రైల్వేలో సరకు రవాణా రైళ్లకు దాదాపు 2,50,000 బోగీలను జతచేశారు.
మిత్రులారా,
ఇప్పుడు చిప్ నుంచి షిప్ వరకు తయారీ రంగంలో భారత్ నూతన శకానికి శ్రీకారం చుడుతోంది. అంటే విడిభాగాలు మనవే... ఉత్పత్తులూ మనవే. స్వావలంబనకు సంబంధించిన పూర్తి వ్యవస్థ ఇప్పుడు భారత్‌లో ఏర్పాటవుతుంది. సోలార్ విద్యుత్ విషయంలో దీన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉదాహరణకు... కడానా డ్యామ్ వద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ ప్రాజెక్ట్‌ను చూడవచ్చు. కొన్నేళ్ల కిందట మన దేశంలో సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయటం ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే పీవీ మాడ్యూల్స్, అన్ని రకాల హార్డ్‌వేర్‌ను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ కొన్నేళ్లుగా భారత్‌లోనే పీవీ మాడ్యూల్స్ తయారీని ప్రారంభించాం. నేడు 200 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యాన్ని మనం అభివృద్ధి చేశాం. ఇలాంటి స్వావలంబన కారణంగానే పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 55 లక్షల కుటుంబాలు ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసుకున్నాయి. వారిలో 11 లక్షల కుటుంబాలు గుజరాత్‌కు చెందినవే. ఇక్కడ ఎన్నో కుటుంబాలు విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారాయి. దీనివల్ల ఉత్పత్తి నుంచి ఇన్‌స్టాలేషన్ (అమరిక), సర్వీసింగ్ వరకు ఎంతోమంది యువతకు ఉపాధి లభించింది. అనేక కొత్త వ్యాపార సంస్థలు ఆవిర్భవించాయి.
మిత్రులారా,
"అసత్యపు మాటలను" ప్రచారం చేసేవారు ప్రతీచోటా ఉంటారు. కానీ భారతదేశ యువత సత్యాన్ని ఎలుగెత్తి చెబుతుంది. సత్య మార్గంలోనే నడుస్తుందని, సత్యం కోసం జీవిస్తుంది. సోలార్, పవన, జల, అణు విద్యుత్ వంటి ప్రతి రంగంలోనూ ప్రభుత్వం ఏ విధంగా ఏకాగ్రతతో పనిచేస్తోందో యువత గమనిస్తుంది.
మిత్రులారా,
రాబోయే యుగంలో ప్రతి ఆధునిక రంగం విద్యుత్, విద్యుత్ వ్యవస్థపై ఆధారపడి నడుస్తుంది. ఉదాహరణకు చిప్ పరిశ్రమ, డేటా సెంటర్లు, కృత్రిమ మేధతో అనుసంధానమైన పరిశ్రమలకు విద్యుత్తే ఆహారం, నీరు వంటిది. ప్రపంచం కన్నా ముందుగానే ఏఐలో మనం మహాశక్తిగా ఎదగాలంటే... దేశం ఒక వ్యవస్థను సిద్ధం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో భారత్ సరిగ్గా అదే పని చేస్తోంది. అందుకే ఒక దేశంతో యురేనియం కోసం, మరికొన్ని దేశాలతో కీలక ఖనిజాలు, అరుదైన భూ ఖనిజాల కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. దేశంలోని యువత భవిష్యత్తు - మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచేందుకే అహర్నిశలు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మిత్రులారా,
వేగంగా మారుతున్న ప్రపంచంతో పాటు, ప్రపంచ అవసరాలు కూడా మారుతున్నాయి. మన అభ్యసన, అధ్యయన పద్ధతులు కూడా మారుతున్నాయి. గతంలో కేవలం డిగ్రీల మీదే దృష్టి ఉండేది... కానీ ఇప్పుడు డిగ్రీలతో పాటు నైపుణ్యాల మీద కూడా దృష్టి సారిస్తున్నారు. నైపుణ్యాల ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది. యువత వద్ద నైపుణ్యాలు ఉండటం... ఆ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవటం ప్రధానంగా మారింది. అందువల్ల మన విద్యా విధానాన్ని, బోధనా, శిక్షణ సంస్థలను నూతనంగా తీర్చిదిద్దుకుంటున్నాం. ఈ స్ఫూర్తితోనే నేను ఎర్రకోట నుంచి యువ శక్తి కోసం రెండు కీలకమైన ప్రకటనలు చేశాను. మొదటి ప్రకటన దేశ సంప్రదాయ అవసరానికి సంబంధించినది. మన దేశంలో లక్షలాది మంది యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని మీ అందరికీ తెలుసు. ఏటా మధ్యతరగతి కుటుంబాల ఆదాయంలో సింహభాగం పిల్లల కోచింగ్ కోసమే ఖర్చవుతుంది. అలాంటి పేద, మధ్యతరగతి కుటుంబాల డబ్బును ఆదా చేయాటమే మా ప్రయత్నం. విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌లోని అత్యుత్తమ ఉపాధ్యాయుల చేత కోచింగ్ ఇప్పిస్తాం. పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత కోచింగ్ బాధ్యతను ప్రభుత్వమే స్వయంగా తీసుకుంటుంది.
మిత్రులారా,
భారత్‌లోని యువత ఏఐ నైపుణ్యాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. మన యువతను ఏఐ కోసం సిద్ధం చేయాలని కోరుకుంటున్నాం. ఏఐ నైపుణ్యం కేవలం ఐటీ రంగానికే పరిమితం కాదు. ఈ నైపుణ్యం ఉన్న వ్యక్తి వ్యవసాయ రంగంలోనూ నూతన ఏఐ పరిష్కారాలను సృష్టించగలడు. ఆరోగ్య రంగంలోనూ సాంకేతికతను అభివృద్ధి చేయగలడు. తయారీ రంగంలో ఉత్పాదకతను పెంచగలడు. రోబోటిక్స్‌లో సొంత అంకుర సంస్థను ప్రారంభించగలడు. దేశ, విదేశాల పరిశ్రమల కోసం ఏఐని అర్థం చేసుకుని, దాన్ని ఉపయోగించే యువత మన దేశంలో ఉండటం ఎంతైనా అవసరం. దీనికోసం ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
మిత్రులారా,
భారత్‌కు ఇది అపూర్వమైన కాలం. భారత యువశక్తి ఉదయించే శకం. భారతదేశ చరిత్రలో ఈ సమయం మళ్లీ రాదు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్నే అత్యున్నత ధ్యేయంగా మలచుకోవాలి. మనమంతా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి. ఈ పిలుపుతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న మీ అందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.
వడోదర ప్రజలతో నాకు చిన్న పని ఉంది. - మీరు ఆ పనిని చేస్తారా? కచ్చితంగా చేస్తారా? మీరు వడోదరను పరిశుభ్రంగా మార్చారు. దాని కోసం ఎంతో శ్రమించారు. మన యువత అహర్నిశలు పరిశుభ్రత కోసం శ్రమించటం నేను చూశాను. కానీ, ఇకపై వడోదరను ఎప్పటికీ అపరిశుభ్రంగా మార్చబోమని ఇవాళే గట్టిగా నిర్ణయించుకుందాం. "నేను ఎక్కడా చెత్తను సృష్టించను" అని ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తే... ఇక వడోదర అపరిశుభ్రంగా మారుతుందా? వడోదర ఎప్పటికీ మురికిగా మారదు. అప్పుడు దీపావళి అద్భుతంగా ప్రకాశిస్తుంది. నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతాయి. గణేశ్ ఉత్సవం కన్నులపండువగా శోభిల్లుతుంది. కాబట్టి ఈ చిన్న పనిని మీరందరూ తప్పకుండా చేస్తారు.
చాలా చక్కగా చేస్తారు.
కృతజ్ఞతలు
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
***
(రిలీజ్ ఐడి: 2308110)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9