రక్షణ మంత్రిత్వ శాఖ
శ్రీలంకలో మూడు రోజులు పర్యటించనున్న రక్షణ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
06 SEP 2026 3:40PM by PIB Hyderabad
రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 2026 సెప్టెంబర్ 08 నుంచి 10 వరకు మూడు రోజులపాటు శ్రీలంకలో పర్యటించనున్నారు. ఈ అధికార పర్యటనలో భాగంగా కీలక అంశాలపై శ్రీలంక అగ్రనాయకత్వంతో జరిగే ద్వైపాక్షిక చర్చల్లో ఆయన పాల్గొంటారు. కొలంబోలోని భారతీయ సమాజంతో ముఖాముఖి సంభాషిస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో ఆయన శ్రీలంక వెళతారు.
భారత్, శ్రీలంక దేశాలు నాగరికతా సంబంధాలను, బహుముఖ భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి. ప్రాంతీయ భద్రత, రక్షణ, ఆర్థిక, వాణిజ్య సహకారంతో పాటు ప్రజల మధ్య బలమైన సంబంధాలు ఈ భాగస్వామ్యానికి ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి. శ్రీలంకకు ఆర్థిక సంక్షోభ సమయంలో భారత్ అండగా నిలవడం, 2025లో శ్రీలంకలో సంభవించిన ‘దిత్వా’ తుపాను అనంతరం తొలి స్పందన దేశాల్లో ఒకటిగా భారత్ సహాయ సహకారాలు అందించడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభించింది. ‘పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యం’ విధానంపై భారత్ కొనసాగిస్తున్న నిబద్ధతను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన మహాసాగర్ (ప్రాంతాల మధ్య భద్రత, అభివృద్ధి కోసం పరస్పర, సమగ్ర పురోగతి) దార్శనికతకు ఇస్తున్న ప్రాధాన్యతను ఇది స్పష్టంగా చాటిచెప్పింది.
రక్షణ మంత్రి శ్రీలంక పర్యటన ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరమైన రంగాలతో పాటు బలమైన సముద్ర తీర, రక్షణ భాగస్వామ్యంతో కూడిన సాంప్రదాయక, స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2307191)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8