ప్రధాన మంత్రి కార్యాలయం
బెల్జియం ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
03 SEP 2026 2:29PM by PIB Hyderabad
గౌరవ ప్రధానమంత్రి,
ఇరు దేశాల ప్రతినిధులు,
మీడియా మిత్రులారా,
నమస్కారం!
భారత పర్యటనకు తొలిసారిగా విచ్చేసిన బెల్జియం ప్రధానమంత్రికి హృదయపూర్వక స్వాగతం పలకడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.
భారతదేశంలో ఆయనకు ఇదే తొలి పర్యటన అయినప్పటికీ, మన దేశంతో ఆయనకు చిరకాల అనుబంధం ఉంది. ఆయన అనేక సంవత్సరాల పాటు ఆంట్వెర్ప్ మేయర్‌గా సేవలందించారు. అప్పటి నుంచి అక్కడి విస్తృత భారతీయ సమాజానికి, భారత్ - బెల్జియం వజ్రాల వాణిజ్యానికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచారు.
మిత్రులారా,
భారత్ - బెల్జియం సంబంధాల మూలాలు చరిత్రలో ఎంతో లోతుగా నాటుకున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బెల్జియంలో వేలాది మంది భారతీయ సైనికులు ప్రదర్శించిన ధైర్యసాహసాలు, చేసిన త్యాగాలు మన ఉమ్మడి స్మృతిలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచాయి.
నేడు ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న లోతైన సంబంధాలు మనలను సహజసిద్ధమైన భాగస్వాములుగా నిలబెడుతున్నాయి.
మిత్రులారా,
పదేళ్ల క్రితం నాకు బెల్జియం సందర్శించే అవకాశం లభించింది. గత దశాబ్ద కాలంలో మన భాగస్వామ్యం అద్భుతమైన పురోగతిని సాధించినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.
నేడు మన భాగస్వామ్యం సాంప్రదాయ రంగాలకే పరిమితం కాకుండా రక్షణ, స్వచ్ఛ ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కూడా విస్తరించింది. 'జోరావర్' ట్యాంక్ వంటి అధునాతన రక్షణ పరికరాల తయారీలో మనం కలిసి పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులలో ఒక దానిని మనం అభివృద్ధి చేస్తున్నాం.
మిత్రులారా,
నేడు ప్రపంచం తీవ్రమైన అలజడులు, అస్థిరతల గుండా వెళుతోంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఘర్షణలు, యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉన్నాయి. ఆహారం, ఇంధనం లేదా సరఫరా వ్యవస్థలు ఏవైనప్పటికీ... ప్రతి రంగమూ అనిశ్చితి వల్ల తీవ్ర ప్రభావితమవుతోంది.
ఈ సవాలుతో కూడిన పరిస్థితుల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ తన వృద్ధి వేగాన్ని కొనసాగించింది. గత త్రైమాసికంలో మేం 7.8% వృద్ధి రేటును నమోదు చేశాం. నేడు భారతదేశ వృద్ధి ప్రయాణం ప్రపంచానికి నమ్మకంగా, నూతన అవకాశాలను అందించే ఒక మూలాధారంగా మారుతోంది.
మిత్రులారా,
ఈ ఏడాది ఆరంభంలో మేం చారిత్రాత్మక భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టిఏ) ఖరారు చేసుకున్నాం. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తుల మధ్య కుదిరిన ఈ అపూర్వమైన భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి, అభివృద్ధికి, ఉమ్మడి సౌభాగ్యానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది.
భారతదేశం నిలకడగా సాధిస్తున్న ఆర్థిక పురోగతి, ఈ ఒప్పందం మన ఆర్థిక సంబంధాలకు నూతన మార్గాలను సుగమం చేశాయి. ఈ అవకాశాలను స్పష్టమైన, ఆచరణాత్మక ఫలితాలుగా మలచేందుకు నేడు మనం పలు ముఖ్యమైన చర్యలు చేపట్టాం.
మిత్రులారా,
బెల్జియం కంపెనీల కోసం భారతదేశంలో పెట్టుబడులకు వేగవంతమైన మార్గదర్శక వ్యవస్థను ఏర్పాటు చేశాం. భారత్ - బెల్జియం బిజినెస్ ఫోరమ్‌ను ఒక క్రమబద్ధమైన వ్యవస్థగా కొనసాగించాలని నిర్ణయించాం. ఇరు దేశాల ఆర్థిక, ఫిన్‌టెక్, నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తాం.
ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వ్యాపారాన్ని రెట్టింపు చేయాలనే మన లక్ష్యాన్ని సాధిస్తాం.
మిత్రులారా,
రక్షణ, భద్రత సహకారం మన సంబంధాలకు అత్యంత కీలకం. ఇరు దేశాల మధ్య సైనిక మార్పిడి విధానాలను, శిక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి నేడు మనం పరస్పరం అంగీకరించాం.
మన ప్రభుత్వాలు, రక్షణ పరిశ్రమల మధ్య కుదిరిన ఒప్పందాలు రక్షణ రంగంలో ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తి విభాగాలకు నూతన అవకాశాలను కల్పిస్తాయి. నేరాల అదుపులో మన దర్యాప్తు సంస్థల మధ్య నిఘా సమాచార మార్పిడిని, సహకారాన్ని కూడా మరింత బలోపేతం చేసుకుంటాం.
మిత్రులారా,
స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు, విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలు మన ఉమ్మడి ప్రాధాన్యతలు. ఈరోజు సంతకం చేసిన పునరుత్పాదక ఇంధన అవగాహన ఒప్పందం మన సుస్థిరత సహకారానికి కొత్త ఊపునిస్తుంది. కీలక ఖనిజాల విషయంలోనూ, వాటి శుద్ధి, పునర్వినియోగంలోనూ సహకారాన్ని పెంపొందించాలని నిర్ణయించాం.
సెమీకండక్టర్ల రంగంలో బెల్జియంకు ఉన్న నైపుణ్యం, భారతదేశం వద్ద ఉన్న విస్తృతమైన అవకాశాలు ఒకదానికొకటి పూర్తి స్థాయిలో తోడ్పడతాయి. ఈ దిశగా, బెల్జియం ఐమెక్ సంస్థను భారత సెమీకండక్టర్ వ్యవస్థతో అనుసంధానించేందుకు మనం కలిసి పనిచేస్తాం.
మిత్రులారా,
ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న సాన్నిహిత్యం మన సంబంధాలకు అతిపెద్ద బలం. నేడు మన అంకుర పరిశ్రమల మధ్య అనుసంధానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి, సముద్ర రవాణా రంగంలో సామర్థ్య పెంపును విస్తరించడానికి మనం సిద్ధంగా ఉన్నాం.
విశ్వవిద్యాలయాలు, పరిశోధన రంగాల మధ్య సహకారాన్ని కూడా మరింత బలోపేతం చేస్తాం. నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల రాకపోకలను సులభతరం చేసేందుకు త్వరలోనే వలసలు - చలనశీలత భాగస్వామ్య ఒప్పందం (మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్) ఖరారు చేసుకోనున్నాం.
మిత్రులారా,
ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా మేం సుదీర్ఘంగా చర్చించాం. చట్టబద్ధమైన పాలన, చర్చలు, దౌత్య మార్గాల పట్ల భారత్, బెల్జియం రెండూ పూర్తి విశ్వాసంతో ఉన్నాయి.
ఉక్రెయిన్ అయినా, పశ్చిమ ఆసియా అయినాఘర్షణలకు త్వరితగతిన ముగింపు పలికి శాంతిని పునరుద్ధరించే దిశగా జరిగే అన్ని ప్రయత్నాలకు మేం మద్దతు ఇస్తాం. అలాగే, ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మన ఉమ్మడి నిబద్ధత.
గౌరవ ప్రధానమంత్రి,
గత నెలలో బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా హాకీ ప్రపంచకప్‌ను నిర్వహించాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు మీకు అభినందనలు. మన క్రీడాకారులు కనబరిచిన కృషి, ప్రతిభను కూడా అభినందిస్తున్నాను.
వజ్రాలు చాలాకాలంగా భారత్ - బెల్జియం దేశాల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. నేడు, ఈ చారిత్రక అనుబంధాన్ని మరింత విస్తృతమైన, సమగ్ర సంబంధంగా మలుచుకుంటున్నాం.
నేటి చర్చలు మన ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయానికి నాంది పలుకుతాయని నేను విశ్వసిస్తున్నాను. మరోసారి, మీకు, మీ ప్రతినిధి బృందానికి భారతదేశానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.
ధన్యవాదాలు.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.
***
(రిలీజ్ ఐడి: 2306379)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7