పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌వోసీ ప్రక్రియ సరళీకరణ, ఆటోమేషన్ చర్యల పురోగతిని సమీక్షించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి

15 రోజుల్లోగా కాలపరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

నాడు పోస్టు చేయడమైనది: 02 SEP 2026 4:58PM by PIB Hyderabad

పౌర విమానయాన రంగంలో వ్యాపార నిర్వహణ సులభతరం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) చేసేందుకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్షించారు. ముఖ్యంగా నిరభ్యంతర పత్రాల (ఎన్‌వోసీ) జారీ ప్రక్రియ సరళీకరణ, క్రమబద్ధీకరణ పురోగతిని సమీక్షించేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు.

 

ఈ సమావేశంలో శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... ఎన్‌వోసీ జారీ ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా, పారదర్శకంగా, స్వయంచాలకంగా, కాలపరిమితితో కూడినదిగా, కనీస మానవ ప్రమేయం గలదిగా మెరుగుపరచాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. విమానయాన భద్రతకు సంబంధించిన నియంత్రణ అవసరాలు సక్రమంగా నెరవేరేలా చూడటం, సాధారణ ప్రజలు, సంఘాలు, బిల్డర్లు, పరిశ్రమల సభ్యులకు సౌకర్యాలను కల్పించడం ఈ ప్రతిపాదిత సంస్కరణల లక్ష్యం.

 

ముఖ్యంగా ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ వంటి ప్రధాన మహానగరాల్లో, దరఖాస్తుదారులకు ప్రారంభ దశలోనే అనుమతించదగిన/గుర్తించిన భవన ఎత్తు వివరాలను అందించడంలో సాధ్యాసాధ్యాలనూ కేంద్ర మంత్రి చర్చించారు. దరఖాస్తుదారులు, ఇతర భాగస్వాములు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రారంభం నుంచే వర్తించే ఎత్తు పరిమితులకు అనుగుణంగా తమ భవన నిర్మాణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ఇటువంటి విధానం వీలు కల్పిస్తుంది.

 

ఈ సమావేశంలో ఏరోనాటికల్ స్టడీస్‌కు సంబంధించిన ప్రక్రియనూ చర్చించారు. ఆమోదాలను సరళీకృతం చేయడం, వేగవంతం చేయడంపై సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా, ప్రారంభ దశలో సైట్‌లో భౌతిక ధ్రువీకరణ అవసరాన్ని తగ్గించడం... భవన అభివృద్ధి ప్రణాళికలు, ఇతర పత్రాలను సమర్పించాల్సిన అవసరాన్ని హేతుబద్ధీకరించడం వంటి అంశాలపై చర్చించారు.

నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లికేషన్ సిస్టమ్ (ఎన్‌వోసీఏఎస్) ప్రస్తుత భౌగోళిక పరిధినీ సమీక్షించారు. ఎన్‌వోసీఏఎస్ ప్రస్తుతం వీఎఫ్ఆర్ (విజువల్ ఫ్లైట్ రూల్స్) కార్యకలాపాలకు 20 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను, ఐఎఫ్ఆర్ (ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లైట్ రూల్స్) కార్యకలాపాలకు 56 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను కవర్ చేస్తోంది. సాధ్యమైన చోటల్లా పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో ఎన్‌వోసీలను జారీ చేయడంలో సాధ్యాసాధ్యాలను ఈ సమావేశం పరిగణించింది. తద్వారా, ఎన్‌వోసీలను పొందడానికి వ్యక్తులు, పరిశ్రమలు నేరుగా ఏఏఐని సంప్రదించాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చు.

 

పైన పేర్కొన్న చర్యలు సహా... ఎన్‌వోసీ ప్రక్రియ సరళీకరణ, ఆటోమేషన్, వికేంద్రీకరణ విధివిధానాలను పరిశీలించి, విధానాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. 15 రోజుల కాలపరిమితిలోగా వాటి అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

 

విమానయాన భద్రతకు ఏ విధంగానూ భంగం కలగకుండా... సంబంధిత డేటా, అనుమతించదగిన ఎత్తు సమాచారాన్ని వెబ్‌సైట్‌తో సహా ప్రజలకు పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతిపాదనలకు వేగవంతమైన, కాలపరిమితితో కూడిన అనుమతిని అందించడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సరళమైన, అంచనా వేయగల, పారదర్శకమైన ఎన్‌వోసీ విధానం... ముఖ్యమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులను సకాలంలో అమలు చేయడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా ఇది పెట్టుబడులు, ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పన, మొత్తం జీడీపీ వృద్ధికి తోడ్పడుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2306203) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Malayalam