వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఆహార, ప్రజా పంపిణీ విభాగానికి సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార కార్యదర్శుల సమావేశం సమీక్ష
131 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యాన్ని ప్రతిపాదిస్తూ నూతన నిల్వ విధానం
వాహనం ఉన్న ప్రదేశాన్ని గుర్తించే వ్యవస్థ (వీఎల్‌టీఎస్)ను 2026 డిసెంబరుకల్లా పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలకు సలహా
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 8:39PM by PIB Hyderabad
ఆహార ధాన్యాల కొనుగోలు, ప్రజలకు పంపిణీ చేయడం, నిల్వ చేయడానికి సంబంధించిన కీలక అంశాలను సమీక్షించడానికి రాష్ట్రాల ఆహార కార్యదర్శుల సమావేశాన్ని న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ ఆహార, ప్రజా పంపిణీ విభాగం (డీఎఫ్‌పీడీ) కార్యదర్శి శ్రీ సంజీవ్ చోప్రా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార కార్యదర్శులతో పాటు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారులు కూడా పాల్గొన్నారు.
వడ్లు కొనుగోలు,
బాగు పరచిన బియ్యం
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చలు జరిపిన తరువాత, 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎమ్ఎస్)కు గాను వడ్ల కొనుగోలు అంచనాలను 708.64 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎమ్‌టీ)గా ఖరారు చేశారు.
‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న్ యోజన’ (పీఎమ్‌జీకేఏవై)తో పాటు, ఇతర సంక్షేమ ప్రధాన పథకాల పరిధిలో బాగు పరిచిన బియ్యాన్ని అందిస్తున్న తీరును కూడా సమీక్షించారు. ఆమోదించిన విధానం ప్రకారం, కొనుగోలు చేసిన ముడి బియ్యంలో 10 శాతం వరకు నూక ఉండవచ్చు. ప్రస్తుత 25 శాతం నిర్దేశిత పరిమితికి బదులు ఇక ఈ పద్ధతిని అమలు చేస్తారు. ఉప్పుడు బియ్యం విషయంలో, ఈ పరిమితి 5 శాతానికి పరిమితం అవుతుంది. ప్రస్తుతం దీని విషయంలో నిర్దేశిత పరిమితి 16 శాతంగా ఉంది.
బాగు పరచిన బియ్యం కొనుగోలు ప్రక్రియను 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎమ్ఎస్) నుంచి మొదలు పెడతారు. కొనుగోలు చేసే రాష్ట్రాలకు దీనిని క్రమ క్రమంగా విస్తరిస్తారు. ముడి బియ్యాన్ని నిర్ణీత విధానం ప్రకారం ప్రాసెస్ చేసేందుకు ప్లాంటులకు ఉన్న సామర్థ్యాన్ని అంచనా వేసి అవసరాలకు అనుగుణంగా ఉన్నతీకరణ పథకాలను రూపొందించాల్సిందిగా, అమలుకు సంబంధించి దశ వారీ కార్యాచరణను సిద్ధం చేయాల్సిందిగా రాష్ట్రాలను కోరారు.
2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో రాష్ట్రాలు 18.85 ఎల్ఎమ్‌టీ ముతక ధాన్యం కొనుగోలు చేస్తాయని అంచనా వేశారు.
ముతక ధాన్యాలు, ‘శ్రీ అన్న’,
కొనుగోలు సంబంధిత సాంకేతికత
ముతక ధాన్యాలు, శ్రీ అన్న, అపరాధాన్యాల కొనుగోలు, పంపిణీ పథకాలను కూడా సమీక్షించారు. 2025-26లో 16.38 ఎల్ఎమ్‌టీ ముతక ధాన్యాలను, ‘శ్రీ అన్న’ను కొనుగోలు చేసిన విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. గత అయిదు సంవత్సరాల్లో ఇంత ఎక్కువ స్థాయిలో కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి.
ప్రొక్యూర్‌మెంట్ సెంటర్ స్మార్ట్-అసెస్‌మెంట్ పోర్టల్ (పీసీఎస్ఏపీ)లో నమోదైన పురోగతిని కూడా సమీక్షించారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎమ్ఎస్) నుంచి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఇమేజ్ ధ్రువీకరణను ప్రారంభించనున్న విషయాన్ని కూడా పరిశీలనలోకి తీసుకున్నారు.
జాయింట్ ఫిజికల్ వెరిఫికేషన్ (జేపీవీ)లో పురోగతిని కూడా సమావేశంలో సమీక్షించారు. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎమ్ఎస్) నుంచి ఆరంభమయ్యే కొనుగోలు సీజన్ ముగిసిన తరువాత ధాన్యం ఫిజికల్ వెరిఫికేషన్‌కు ఆన్‌లైన్ పద్ధతిని అనుసరించే అంశాన్ని రాష్ట్రాలతో చర్చించారు.
రాష్ట్రాల్లో ఈ కింది అత్యుత్తమ పద్ధతులతో పాటు విజయవంతమైన కార్యక్రమాలను కూడా గుర్తించి సత్కరించారు:
• ఆంధ్రప్రదేశ్- బాగు చేసిన బియ్యం పథకాన్ని అత్యుత్తమంగా అమలు చేసింది
• పంజాబ్- జేపీవీ, పీసీఎస్ఏపీల్లో అత్యుత్తమ పనితీరు
• కర్ణాటక-‘శ్రీ అన్న’ కొనుగోళ్లలో శ్రేష్ఠమైన పనితీరు
• ఛత్తీస్‌గఢ్-వడ్ల కొనుగోలులో ‘అగ్రీస్టాక్’ను అమలు చేసిన తొలి రాష్ట్రం
నిల్వ సామర్థ్యం,
‘డిపో దర్పణ్’
నూతన నిల్వ విధానాన్ని సమావేశంలో సమీక్షించారు. నిల్వకు, పంపిణీకి మధ్య పెరుగుతున్న అసమానత, ప్రాంతీయ అసమతౌల్యం, నిల్వ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోక పోవడం వంటి సమస్యలకు పరిష్కారాలను సూచించడం ఈ విధానం ఉద్దేశం.
ఈ విధానంలో 131 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎమ్‌టీ) అదనపు నిల్వ సామర్థ్యాన్ని జత చేయాలని సంకల్పించారు. ఇందులో 111 ఎల్ఎమ్‌టీ ని రాష్ట్రాలు, 20 ఎల్ఎమ్‌టీని ఎఫ్‌సీఐ జోడిస్తాయి. కాలబద్ధ కార్యాచరణ ప్రణాళికలను సమర్పించాల్సిందిగా ఎంపిక చేసిన రాష్ట్రాలను కోరారు.
ఆహారధాన్య నిల్వల సదుపాయాలను ‘డిపో దర్పణ్’ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని కూడా రాష్ట్రాలకు సలహా ఇచ్చారు. ఈ వెబ్‌సైట్ గిడ్డంగులకు ఒక స్వీయ మూల్యాంకన సాధనంగా పనిచేస్తుంది. నిర్దిష్ట సమయం లోపల మూల్యాంకన ప్రక్రియను ముగించి, సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ), ఎఫ్‌సీఐలతో పాటు ఆహార, ప్రజా పంపిణీ విభాగం (డీఎఫ్‌పీడీ) అందించే శిక్షణను, మార్గదర్శక సహాయాన్ని పొందాల్సిందిగా రాష్ట్రాలకు సూచించారు.
సాంకేతికత సాయంతో
ఆహార ధాన్యాల రవాణా
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సరఫరా మార్గంలో భాగంగా ఆహార ధాన్యాలను చేరవేసే వాహనాలకు జీపీఎస్ ఆధారిత వాస్తవిక సమయ ట్రాకింగుకు గాను ఆ యా వాహనాలు ఉన్న ప్రదేశాన్ని గుర్తించే వ్యవస్థ (వీఎల్‌టీఎస్)ను అమలు చేయడంపై సమీక్షను చేపట్టారు.
2026 డిసెంబరు కల్లా అమలు ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్రాలకు సలహా ఇచ్చారు. దీనిలో ఎంపిక చేసిన రాష్ట్రాలకు 2026 సెప్టెంబరు కల్లా ఈ ప్రక్రియను ముగించాల్సిందిగా లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎమ్ఎస్), రబీ మార్కెటింగ్ సీజన్ (ఆర్ఎమ్ఎస్)లు రెండిటికీ ఉపయోగపడే ప్రొక్యూర్‌మెంట్ ఆప్టిమైజేషన్ టూల్‌ను కూడా సమీక్షించారు. ఈ సాధనానికి సురక్షితంగా ఆడిట్ ప్రక్రియను ముగించి పంజాబ్, హర్యానాల్లో రంగంలోకి దించారు. 2026 సెప్టెంబరు 15 లోపు కొనుగోలు కేంద్రం, మిల్లు, గిడ్డంగి సంబంధిత సమాచారాన్ని సిద్ధం చేసి, తాజా వివరాలను సిస్టమ్‌లో పొందుపరచాలని మిగతా రాష్ట్రాలను కోరారు.
సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో మానవ జోక్యానికి స్వస్తి పలకడానికి ‘అన్న చక్ర’ను రాష్ట్ర సరఫరా మార్గ నిర్వహణ వ్యవస్థలు (ఎస్‌సీఎమ్ఎస్), వీఎల్‌టీఎస్‌లతో ఏకీకరించే అంశాన్ని కూడా సమావేశంలో సమీక్షించారు. ఆరు రాష్ట్రాల విషయంలో ఈ ఏకీకరణ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. 2026 సెప్టెంబరు, డిసెంబరు మధ్య కాలంలో దశల వారీగా ఏకీకరణను ముగించి ఎఫ్‌పీఎస్, గిడ్డంగా, కమాడిటీ మాస్టర్ డేటాల ప్రమాణీకరణ, అప్‌డేషన్‌కు మార్గాన్ని సుగమం చేయాల్సిందిగా మిగతా రాష్ట్రాలకు సలహా ఇచ్చారు.
పీడీఎస్ సంస్కరణలు,
సాంకేతికత ఆధారిత సేవలు
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సంస్కరణలు, సాంకేతికత ఆధారిత సేవల అందజేతతో ముడిపడిన ప్రధాన కార్యక్రమాలను సమావేశంలో సమీక్షించారు. వీటిలో.. స్మార్ట్-పీడీఎస్, సార్థక్-పీడీఎస్,ఈ-కేవైసీ, మొబైల్ నంబర్ సీడింగ్ ప్రక్రియలో భాగంగా ఆన్‌బోర్డింగ్, ముందున్న మార్గంతో పాటు ‘మేరా రేషన్’, ‘అన్న మిత్ర’ మొబైల్ అప్లికేషన్స్ భాగంగా ఉన్నాయి.
చర్చలలో రేషన్ దుకాణాల (ఎఫ్‌పీఎస్) సక్రమ వ్యవస్థీకరణ, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ), నిష్క్రియాత్మక (సైలెంట్) లబ్ధిదారులు, నకిలీ లబ్ధిదారుల గుర్తింపు, ఫిర్యాదుల పరిష్కారం, రాష్ట్రం లోపల తరలింపులు, ఎఫ్‌పీఎస్ పంపిణీదారుల మార్జిన్లు, పర్యవేక్షణ యంత్రాంగాన్ని పటిష్ఠపరచడం వంటి అంశాలపై కూడా చర్చించారు.
ఎఫ్‌పీఎస్ డీలర్ మార్జిన్లకు డిజిటల్ రూపాయి ఆధారిత డీబీటీ
ఎఫ్‌పీఎస్ డీలర్ మార్జిన్లను దృష్టిలో పెట్టుకొని డిజిటల్ రూపాయి ఆధారిత ప్రయోజనాల ప్రత్యక్ష బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్.. డీబీటీ) పద్ధతిని ఇప్పటికే గుజరాత్, పుదుచ్చేరి, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీల్లో మొదలుపెట్టారు. దీనిని ప్రయోగాత్మక ప్రాతిపదికన ఢిల్లీ రాష్ట్రవ్యాప్తంగానూ, అలాగే మరో 6 రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో రెండేసి జిల్లాల్లోనూ విస్తరించనున్నారు.
ఒక సమీక్షాత్మక కార్యశాల (వర్క్‌షాప్)ను గుజరాత్ లోని గాంధీనగర్‌లో 2026 సెప్టెంబరు 11న ఏర్పాటు చేయనున్నారు.
సార్థక్-పీడీఎస్’,
రేషన్ దుకాణాలు
2026-31 మధ్య కాలానికి ఒక విస్తృత పథకాన్ని ‘సార్థక్ పీడీఎస్’ పేరిట అమలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2026–27 సంవత్సరానికి గాను 100 శాతం ఆమోదాన్ని మంజూరు చేశారు. ఈ పథకం రాష్ట్రాలకు ఆహార ధాన్యాలను రాష్ట్రం లోపల వివిధ ప్రాంతాలకు చేరవేయడం, ఎఫ్‌పీఎస్ డీలర్ మార్జిన్ల విషయాల్లో సాయపడటానికి స్మార్ట్-పీడీఎస్ సాంకేతికతతో ఏకీకృతం చేసే పథకం.
ఈ-కేవైసీ,
రేషన్ కార్డుల సమాచారం
ఈ సంవత్సరం జులై 30 నాటికి ఈ-కేవైసీ విస్తృతి 90.64 శాతం స్థాయిలో ఉంది. ఈ-కేవైసీ ఆధారిత డేటా నకలు, ఈపీఓఎస్ ద్వారా మొబైల్ నంబరును లింక్ చేయడానికి ఒక కొత్త ప్రామాణిక నిర్వహణ ప్రక్రియను (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్.. ఎస్ఓపీ) ప్రవేశపెట్టారు. ఇది ఆహార ధాన్యాలను లబ్ధిదారులు సులభంగా అందుకొనేందుకు వీలు కల్పిస్తుందని విభాగం మరో సారి స్పష్టం చేసింది.
సవరించిన టీపీడీఎస్ (కంట్రోల్) ఆర్డరు-2015 ద్వారా నిష్క్రియాత్మక (సైలెంట్) రేషన్ కార్డులు, నకిలీ లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని కొత్త ఎస్‌ఓపీలను జారీ చేశారు. వీటిలో తాత్కాలిక అనర్హత, ఆ తరువాతి దశలో ఈ-కేవైసీ పునఃప్రమాణీకరణకు 3 నెలల గడువును ఇచ్చేందుకు వెసులుబాట్లను కల్పించారు. ఈ సదుపాయం 2026 అక్టోబరు 1 నుంచి స్మార్ట్-పీడీఎస్‌లో చెలామణి లోకి రానుంది.
నిఘా యంత్రాంగాలను బలోపేతం చేయడం
నిఘా సంఘాలను ఎప్పటికప్పుడు నియమించి, నిరంతర విధి నిర్వహణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చారు. జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ)-2013లోని 29వ సెక్షన్‌కు అనుగుణంగా నిర్ధారిత సమయంలో తాజా స్థితి సంబంధిత నివేదకలను సమర్పించాలని కూడా సూచించారు.
నిఘా సంఘాలు రేషన్ షాపు స్థాయిలో ఆహార ధాన్యాలు అందినట్లుతెలిపే రసీదులకు ‘ఆధార్’ ఆధారిత ప్రమాణీకరణ పద్ధతిని అమలు చేయాలని, నాలుగు వారాల్లోపల కార్యాచరణను ముగించినట్లుగా నివేదికలను సమర్పించాలని కూడా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించారు.

***
(రిలీజ్ ఐడి: 2305978)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2