ఉప రాష్ట్రపతి సచివాలయం
వామపక్ష తీవ్రవాద భయం నుంచి శాంతి, ప్రగతి, అవకాశాల వైపు ఛత్తీస్‌గఢ్ ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తోన్న ఎయిమ్స్ రాయ్‌పూర్: ఉపరాష్ట్రపతి
దృఢమైన రాజకీయ సంకల్పం, పటిష్టమైన భద్రతా విధానం, అభివృద్ధి ఆధారిత పాలనతో ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం అంతం: ఉపరాష్ట్రపతి
ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామం అభివృద్ధి చెందినప్పుడే ‘వికసిత్ భారత్’ సాధ్యం: ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
02 SEP 2026 1:07PM by PIB Hyderabad
రాయ్‌పూర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) మూడో స్నాతకోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ నేడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రులైన విద్యార్థులు దేశ ప్రజల ఆరోగ్యం, విశ్వాసం, ప్రాణాలను కాపాడే బాధ్యతను భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు.
సభను ఉద్దేశించి ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ... స్నాతకోత్సవం కేవలం వేడుకల సందర్భం మాత్రమే కాదని, బాధ్యతను గుర్తు చేసే క్షణం కూడా అని అన్నారు. ‘‘ఈ రోజు మీరు డిగ్రీలు అందుకుంటున్నారు. రేపు మీకు దేశ ప్రజల ఆరోగ్యం, విశ్వాసం, వారి జీవితాలు వంటి విలువైన బాధ్యతను మీకు అప్పగిస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు.
2012లో స్థాపించినప్పటి నుంచి ఎయిమ్స్ రాయ్‌పూర్, మధ్య దేశంలో వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన రంగాల్లో ప్రాంతీయ అసమానతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి తెలిపారు. అతి తక్కువ సమయంలోనే ఈ సంస్థ ఛత్తీస్‌గఢ్‌తో పాటు పొరుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రముఖ తృతీయ స్థాయి వైద్య సంస్థగా అభివృద్ధి చెందిందని అన్నారు.
ఎయిమ్స్ రాయ్‌పూర్ అభివృద్ధి ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంటున్న గణనీయమైన మార్పుకు ప్రతిబింబమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాయని శ్రీ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, తగిన రవాణా సౌకర్యాలు లేకపోవడం, వామపక్ష తీవ్రవాదం అభివృద్ధికి తీవ్ర అవరోధాలుగా మారాయని తెలిపారు. మారుమూల, గిరిజన ప్రాంతాల్లో భయం, హింస కారణంగా రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధి దెబ్బతిన్నదని, ఫలితంగా ప్రజలు అత్యవసర సేవలను పొందేందుకు దూరం, కొరత వంటి సమస్యలను ఎదుర్కొన్నారని వివరించారు.
గతంలోని చీకటి పరిస్థితుల నుంచి బయటపడి, ప్రస్తుతం సుసంపన్నత, అభివృద్ధి, ప్రగతితో కూడిన కొత్త శకాన్ని ఛత్తీస్‌గఢ్ చూస్తోందని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని నిర్ణయాత్మక విధానం, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా వ్యూహాత్మక సంకల్పం, ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి నిబద్ధతతో కూడిన నాయకత్వం ఈ మార్పునకు కారణమని ఆయన పేర్కొన్నారు.
దశాబ్దాలుగా కొనసాగిన నక్సలిజం సమస్యకు ముగింపు పలికారని, ఒకప్పుడు హింసకు మారుపేరుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు రహదారులు, పాఠశాలలు, ఆసుపత్రులు, మెరుగైన రవాణా అనుసంధానం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కేంద్రాలుగా గుర్తింపు పొందుతున్నాయని తెలిపారు.
“దృఢమైన రాజకీయ సంకల్పం, పటిష్టమైన భద్రతా విధానం, అభివృద్ధి ఆధారిత పాలనతో ఎలాంటి మార్పు తీసుకురావచ్చో ఈ పరిణామం స్పష్టమైన ఉదాహరణ” అని ఉపరాష్ట్రపతి అన్నారు.
భయం, వెనుకబాటుతనం ఉన్న కాలం నుంచి శాంతి, ప్రగతి, అవకాశాలతో కూడిన కొత్త శకంలోకి అడుగుపెడుతున్న ఛత్తీస్‌గఢ్‌కు ఎయిమ్స్ రాయ్‌పూర్ ఒక అద్భుతమైన ప్రతీకగా నిలుస్తోందని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు.
అధునాతన వైద్య సేవలు, అవయవ మార్పిడి రంగాల్లో ఎయిమ్స్ రాయ్‌పూర్ సాధించిన విజయాలను ఆయన ప్రశంసించారు. ఛత్తీస్‌గఢ్‌లో తొలిసారిగా చేపట్టిన కిడ్నీ మార్పిడి, కిడ్నీ మార్పిడి చికిత్సల్లో 95 శాతానికి పైగా విజయవంతమైన ఫలితాలు, మూత్రపిండాలు, కార్నియా మార్పిడులు, చెవి ఇంప్లాంట్లు వంటి విజయాలు ఈ ప్రాంతంలో ఆధునిక వైద్యం వేగంగా అందుబాటులోకి వస్తోందనడానికి నిదర్శనమని తెలిపారు. గుండె మార్పిడి కార్యక్రమానికి అనుమతి లభించడం మరో కీలక విజయంగా ఆయన పేర్కొన్నారు.
‘వికసిత్ భారత్’ జాతీయ దార్శనికతను సాధించేందుకు సమతుల్య అభివృద్ధి ఎంతో ముఖ్యమని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రతి రాష్ట్రం, జిల్లా, గ్రామం అభివృద్ధి చెందినప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాకారమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఉన్నత విద్యకు అందరికీ అవకాశం కల్పించడం ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో కీలకమని తెలిపారు. గత 12 ఏళ్లలో దేశంలో ఉన్నత విద్య విస్తరణ గణనీయంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగిందని ఉపరాష్ట్రపతి తెలిపారు. 2014-15లో 1.57 కోట్లుగా ఉన్న మహిళా విద్యార్థుల నమోదు 2023-24 నాటికి 2.24 కోట్లకు పెరిగిందని, ఇది 42.2 శాతం వృద్ధిని సూచిస్తుందని వివరించారు. ఎయిమ్స్ రాయ్‌పూర్ స్నాతకోత్సవంలోనూ 376 మంది మహిళలు, 313 మంది పురుషులు డిగ్రీలు అందుకుంటున్నారని ఆయన తెలిపారు.
పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి శ్రీ సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ... యువ గ్రాడ్యుయేట్లు ఎల్లప్పుడూ “మాదకద్రవ్యాలు వద్దు” అని స్పష్టంగా చెప్పాలని పిలుపునిచ్చారు. సాంకేతికత దేశంలోని చివరి పౌరుడికి కూడా చేరేలా, ప్రతి యువ భారతీయుడు మెరుగైన భవిష్యత్తును ఆశించేలా భారత్‌ను నిర్మించడంలో వారు భాగస్వాములు కావాలని కోరారు.
“మీ జ్ఞానం ప్రజలకు స్వస్థతను చేకూర్చాలి, మీ పరిశోధనలు నూతన ఆవిష్కరణలకు దోహదపడాలి, మీ సేవ ఇతరులకు స్ఫూర్తినివ్వాలి” అని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.
వైద్య సేవల్లో అత్యుత్తమ ప్రమాణాలు, శాస్త్రీయ ఆవిష్కరణలు, ప్రజారోగ్యం, మానవీయ సేవల రంగాల్లో ఎయిమ్స్ రాయ్‌పూర్ మరింత విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న అభివృద్ధి మార్పు, ‘వికసిత్ భారత్ 2047’ వైపు దేశం సాగుతున్న సుదీర్ఘ ప్రయాణంలో ఒక కీలక అధ్యాయంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపరాష్ట్రపతి బంగారు పతకాలు, ధ్రువపత్రాలను ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ రామెన్ దేకా, కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్, ఛత్తీస్‌గఢ్ వైద్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రి శ్రీ శ్యామ్ బిహారీ జైస్వాల్, రాయ్‌పూర్ ఎంపీ శ్రీ బృజ్‌మోహన్ అగర్వాల్, ఎయిమ్స్ రాయ్‌పూర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ (డాక్టర్) సంజీవ్ హండా, ఎయిమ్స్ రాయ్‌పూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అశోక్ జిందాల్ తదితరులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2305973)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3