భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
భూ విజ్ఞాన శాస్త్రాలు, ప్రజాసేవల్లో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా... మై గవ్ సహకారంతో జాతీయ స్థాయి ఆన్‌లైన్ క్విజ్‌ను ప్రారంభించిన మంత్రిత్వశాఖ
వాతావరణం, మహా సముద్రాలు, ధ్రువప్రాంతాలపై పరిశోధన, సముద్ర అగాధాల పరిశోధనల్లో విజ్ఞానాన్ని పరీక్షించుకోవాల్సిందిగా ప్రజలకు ఆహ్వానం
అగ్రస్థానంలో నిలిచిన విజేతలకు రూ. 10 వేల నగదు బహుమతి
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 8:13PM by PIB Hyderabad
శాస్త్రీయ ఉన్నతి, ఆవిష్కరణలు, దేశసేవల్లో భూ విజ్ఞాన శాస్త్ర రంగం రెండు దశాబ్దాలను పూర్తిచేసుకున్న సందర్భంగా, ‘మైగవ్’ భాగస్వామ్యంతో.. ‘ఎంవోఈఎస్ వ్యవస్థాపక దినోత్సవ క్విజ్: భూ విజ్ఞాన శాస్త్రాల్లో పురోగతి, దేశ సాధికారత’ పోటీని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రారంభించింది. ‘వికసిత్ భారత్ 2047’ జాతీయ లక్ష్యానికి అనుగుణంగా - వాతావరణం, వాతావరణ అధ్యయనాలు, సముద్ర శాస్త్రం, ధ్రువ ప్రాంత అధ్యయనాలు, భూకంప శాస్త్రం సహా.. భౌగోళిక వ్యవస్థ సంబంధిత విజ్ఞాన శాస్త్రాల్లో భారత్ సాధించిన అద్భుత పురోగతిని ప్రజలకు పరిచయం చేయడమే లక్ష్యంగా మంత్రిత్వశాఖ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఈ దేశవ్యాప్త ఆన్‌లైన్ పోటీని నిర్వహిస్తున్నారు.
క్విజ్ అవలోకనం, క్రమం
భూ విజ్ఞాన శాస్త్ర అంశాల్లో భారత్ సాధించిన విజయాలపై పౌరులకు ఉన్న అవగాహనను అంచనా వేసేలా ఈ క్విజ్‌ను నిర్వహిస్తున్నారు. నిర్దేశిత సమయ పరిమితితో ఆసక్తికరమైన పోటీని నిర్వహిస్తున్నారు:
- విధానం: 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు.
- సమయ పరిమితి: 300 సెకన్లు (5 నిమిషాలు).
- వేదిక: మైగవ్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ధ్రువీకరణ అవసరం.
- ప్రయత్నాలు: ఒక అభ్యర్థికి ఒక ఎంట్రీకి మాత్రమే అవకాశం (నమోదిత మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీ ద్వారా).
బహుమతులు:
అన్ని వయసుల వారు, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు విస్తృతంగా ఈ క్విజ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించడానికి భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ కొన్ని ముఖ్య పురస్కారాలను ప్రకటించింది:
- నగదు బహుమతులు: 300 సెకన్ల వ్యవధిలో అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారి నుంచి.. ఎంపిక చేసిన మొదటి ముగ్గురు విజేతలకు రూ. 10,000 (పది వేల రూపాయలు) చొప్పున నగదు బహుమతి అందజేస్తారు.
- ధ్రువపత్రాలు: క్విజ్‌ను విజయవంతంగా పూర్తిచేసిన ప్రతి అభ్యర్థికీ డిజిటల్ సర్టిఫికేట్ అందజేస్తారు. దాన్ని వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ, మార్గదర్శకాలు
అభ్యర్థులు అధికారిక ‘మైగవ్’ క్విజ్ పోర్టల్‌ను సందర్శించి, నమోదు చేసుకున్న మైగవ్ లాగిన్ వివరాలు లేదా ఆధీకృత వివరాలను ఉపయోగించి లాగిన్ అయి ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చు.
- అర్హత: భారత పౌరులందరికీ అందుబాటులో ఉంది (భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ, మైగవ్ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మినహా).
- నిష్పాక్షికంగా ఎంపిక ప్రక్రియ: ఈ క్విజ్‌ను పూర్తి పారదర్శకతతో నిర్వహించనున్నారు. అత్యధిక మార్కులు సాధించిన అర్హులైన అభ్యర్థుల జాబితా నుంచి ఒక స్వయంచాలక, సిస్టమ్ ఆధారిత యాదృచ్ఛిక ప్రక్రియ ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు.
- ప్రొఫైల్ ధ్రువీకరణ: బహుమతుల పంపిణీకి ముందు చెల్లుబాటు అయ్యే గురింపు కార్డుల ధ్రువీకరణ తప్పనిసరి కాబట్టి, అభ్యర్థులు తమ ‘మైగవ్’ ప్రొఫైల్ వివరాలను నవీకరించుకోవాల్సిందిగా మంత్రిత్వశాఖ కోరుతోంది.
(రిలీజ్ ఐడి: 2305858)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10