ఆర్థిక మంత్రిత్వ శాఖ
బంగారం స్మగ్లింగ్‌పై జరిపిన దాడుల్లో రూ.65 కోట్లకు పైగా విలువైన 42 కేజీలకు పైగా విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ
కోల్‌కతా, ముంబయి, కేరళ, ఇతర ప్రాంతాల్లో చేపట్టిన వివిధ నిఘా ఆపరేషన్లలో 25 మంది అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
31 AUG 2026 9:30PM by PIB Hyderabad
వ్యవస్థీకృత బంగారం అక్రమ రవాణాను అరికట్టే చర్యలను కొనసాగిస్తూ... ఇటీవల దేశవ్యాప్తంగా చేపట్టిన నిఘా ఆపరేషన్లలో మొత్తం 42 కేజీలకు పైగా విదేశీ బంగారాన్ని, సుమారుగా 10 కేజీల వెండిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) స్వాధీనం చేసుకుంది. వీటి మొత్తం విలువ రూ. 65 కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఆపరేషన్లలో భాగంగా అయిదుగురు విదేశీయులతో సహా 25 మందిని అరెస్టు చేసింది.
వాహనాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన ఖాళీ భాగాల్లోను, శరీరంలోను దాచి తరలించడం, ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బందిని ఉపయోగించుకోవడం, భూతల, సముద్ర మార్గాల ద్వారా స్మగ్లింగ్ చేయడంతో సహా విభిన్నమైన, అధునాతమైన విధానాలు ఈ ఆపరేషన్లలో బహిర్గతమయ్యాయి.
ముంబయి విమానాశ్రయంలో ప్రధాన ఆపరేషన్
ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా విదేశీ బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న వ్యవస్థీకృత ముఠా గుట్టును 28/29.08.26న డీఆర్ఐ బహిర్గతం చేసింది. ఈ ముఠాలో దుబాయ్, బ్యాంకాక్, మాలే సహా వివిధ ప్రాంతాల నుంచి ముంబయి మీదుగా ప్రయాణిస్తున్న విదేశీయులు ఉన్నారు. అలాగే ముంబయిలో అక్రమ బంగారాన్ని రహస్యంగా తరలించడానికి సహకరించిన విమానాశ్రయ సిబ్బంది ఒకరు ఈ ముఠాలో ఉన్నారు. మైనం రూపంలో 6.85 కేజీల బరువున్న 24 క్యారెట్ల బంగారు పొడి ఉన్న మొత్తం 16 క్యాప్సూల్స్‌ను డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది.

|
ముంబయి విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న మైనం రూపంలో ఉన్న 6.85 కేజీల బంగారం
|
ఈ ఆపరేషన్లో ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో ముంబయి మీదుగా ప్రయాణిస్తున్న అయిదుగురు విదేశీయులు, ఒకరు విమానాశ్రయ సిబ్బంది ఉన్నారు. అక్రమ బంగారాన్ని రహస్యంగా తరలించేందుకు రవాణా మార్గాలను, విమానాశ్రయ సిబ్బందిని వ్యవస్థీకృత ముఠాలు ఉపయోగించుకుంటున్నాయని ఈ ఆపరేషన్ మరోసారి రుజువు చేసింది.
కోల్‌కతా/పశ్చిమబెంగాల్‌లో భారీగా స్వాధీనం
కోల్‌కతాలోని ఎన్ఎస్‌సీబీఐ విమానాశ్రయంలో 29.08.26న నిర్వహించిన రెండు వేర్వేరు నిఘా ఆపరేషన్లలో బంగారు అక్రమ రవాణా ముఠాల్లో భాగస్వాములుగా భావిస్తున్న ఇద్దరు ప్రయాణికులను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు బ్యాంకాక్ నుంచి, మరొకరు దుబాయి నుంచి ప్రయాణిస్తున్నారు.

|
నాడియా జిల్లాలో బీఎస్‌ఎఫ్ సమన్వయంతో15.61 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ
|
దుబాయ్ నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికులకు సంబంధించిన ఒక కేసులో... వారి లోదుస్తులు, జీన్స్‌లో దాచిన సెమీ సాలిడ్ గోల్డ్ పేస్టును కనుగొన్నారు. దీని నుంచి 4.87కేజీల బంగారాన్ని స్వాధీనం చేసున్నారు. ఈ పేస్టును కరిగించి కడ్డీల రూపంలో సేకరించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టం–1962 లోని సంబంధిత నిబంధనల ప్రకారం ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు.
బ్యాంకాక్ నుంచి వస్తున్న విమానానికి సంబంధించిన మరో కేసులో ఒక ప్రయాణికుడి నుంచి 11 ముడి గొలుసుల రూపంలో ఉన్న 3.36 కేజీల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రీన్ ఛానల్ దాటేందుకు మరో ప్రయాణికుడు ఈ బంగారాన్ని అతడికి అప్పగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు.
అదే రోజు మరో కేసులో, 15.61 కేజీల బరువున్న 125 విదేశీ బంగారు కడ్డీలను డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. నాడియా జిల్లాలోని బన్పూర్ గ్రామంలోని బీవోపీ తుంగి వద్ద ఓ మహిళ నివాసంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) నిర్వహించిన ఆకస్మిక దాడిలో వీటిని స్వాధీనం చేసుకున్నారు. తన కుటుంబంలోని పురుషులతో కలసి అనుమానిత స్మగ్లింగ్ కార్యకలాపాల్లో తాను పాల్గొన్నట్లు డీఆర్ఐ చేపట్టిన విచారణలో సదరు మహిళ అంగీకరించింది. కస్టమ్స్ చట్టం – 1962 లోని వర్తించే నిబంధనల ప్రకారం ఆ మహిళను అరెస్టు చేశారు.

|
బీఎస్ఎఫ్ సమన్వయంతో 1.74 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ
|
కేరళలో మరో రెండు స్వాధీనాలు
డీఆర్ఐ కొచ్చి జోనల్ విభాగం, దాని అనుబంధ కాలికట్ ప్రాంతీయ విభాగం 29.08.2026న కేరళలో నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో రస్ అల్ ఖైమా, జెడ్డా నుంచి వస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నాయి. రస్ అల్ ఖైమా నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి మిశ్రమ రూపంలోని రెండు బంగారం ప్యాకెట్ల నుంచి 1.78 కేజీల బంగారాన్ని వెలికితీసి స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అరెస్టు చేశారు.
కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెడ్డా నుంచి వస్తున్న మరో ప్రయాణికుడి వద్ద ఉన్న ఐరన్ బాక్సులో భార మిశ్రమ లోహ భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఖాళీల్లో దాచిన విదేశీ బంగారాన్ని వైమానిక నిఘా విభాగంతో కలసి డీఆర్ఐ అధికారులు గుర్తించారు. 549 గ్రా. బరువున్న 24 క్యారెట్ల బంగారాన్ని కస్టమ్స్ చట్టం, 1962 ప్రకారం స్వాధీనం చేసుకుని, ఆ ప్రయాణికుడిని అరెస్టు చేశారు.
ఈ వారం ప్రారంభంలో 2026 ఆగస్టు 26, 27 తేదీల్లో ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున విదేశీ బంగారాన్ని బీఎస్ఎఫ్ సమన్వయంతో డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. రెండు వేర్వేరు ఆపరేషన్లలో 935 గ్రాములు, 1.74 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రతి కేసులోనూ ఒక వ్యక్తి చొప్పున అరెస్టు చేశారు.
కోల్‌కతాలో నిర్వహించిన మరో ఆపరేషన్లో థాయిలాండ్ నుంచి తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న 1.48 కేజీల విదేశీ (ఎఫ్‌వో) బంగారాన్ని నలుగురి నుంచి డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశీయంగా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న ఈ నలుగురు అయిదు క్యాప్యూళ్లలో ఉంచిన విదేశీ బంగారాన్ని తమ రెక్టమ్/శరీరంలో రహస్యంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ నలుగురితో పాటు, వారి హ్యాండ్లర్‌ను కూడా అరెస్టు చేశారు.
త్రిపుర సెక్టార్‌లోని ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దు గుండా తరలిస్తున్న 3.84 కేజీల విదేశీ బంగారు కడ్డీలను గువాహటిలో డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. ఓ మహిళతో సహా ఇద్దరిని అరెస్టు చేసింది.
తమిళనాడులోని రామనాథపురంలో 1.360 కేజీల విదేశీ బంగారాన్ని, 9.99 కేజీల విదేశీ వెండిని డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా దీనిని తరలిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు అరెస్టయ్యారు.

|
తమిళనాడులోని రామనాథపురంలో స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి
|
నిఘా ఆధారితమైన, సమన్వయంతో కూడిన అమలు చర్యల ద్వారా వివిధ దశల్లో స్మగ్లింగ్ నెట్వర్క్‌ను భగ్నం చేస్తూ... దేశంలోకి విలువైన లోహాల అక్రమ రవాణాను డీఆర్ఐ అడ్డుకుంటోంది.
***
(రిలీజ్ ఐడి: 2305431)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5