గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
పంచ్ సమ్మేళనాల ద్వారా దేశవ్యాప్తంగా వీబీ-జీ రామ్ జీ చట్టంపై అవగాహన విస్తరణ
1,338 పంచ్ సమ్మేళనాల్లో పాల్గొన్న 5.26 లక్షలకు పైగా పంచాయతీరాజ్ ప్రతినిధులు, సిబ్బంది, అధికారులు
నాడు పోస్టు చేయడమైనది:
31 AUG 2026 4:10PM by PIB Hyderabad
వికసిత్ భారత్–గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్): వీబీ-జీ రామ్ జీ (వికసిత్ భారత్–జీ రామ్ జీ) చట్టం 2025ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, పంచాయతీరాజ్ సంస్థల (పీఆర్‌ఐలు) ప్రజాప్రతినిధులు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించిన జిల్లా స్థాయి ‘పంచ్ సమ్మేళనాల’ కార్యక్రమం అద్భుత విజయాన్ని సాధించింది. చట్టంలోని నిబంధనలు, తమ పాత్రలు, బాధ్యతలను పంచాయతీరాజ్ సంస్థల మూడు స్థాయిల్లోని ఎన్నికైన ప్రజాప్రతినిధులు, సిబ్బంది తెలుసుకునేలా పంచ్ సమ్మేళనాలు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరింది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,338 పంచ్ సమ్మేళనాలు విజయవంతంగా నిర్వహించారు. వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూపుతున్న చురుకైన భాగస్వామ్యం, నిబద్ధత, బాధ్యతాయుతమైన పాత్రకు ఈ విజయం నిదర్శనంగా నిలిచింది.

ఈ పంచ్ సమ్మేళనాల ద్వారా 5.26 లక్షల మందికి పైగా పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులు, సిబ్బంది, అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో పాల్గొనడం ద్వారా భాగస్వామ్య ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, క్షేత్రస్థాయి పాలనలో గ్రామ పంచాయతీల పాత్రపై స్థానిక ప్రజాప్రతినిధుల్లో పెరుగుతున్న అవగాహన, ఉత్సాహం స్పష్టమవుతున్నాయి.
ఇప్పటివరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమకు నిర్దేశించిన పంచ్ సమ్మేళనాలను పూర్తి చేశాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్–నికోబార్ దీవులు, దాద్రా–నగర్ హవేలీ, డామన్–డయ్యూ, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరి ఉన్నాయి. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణీత సమయంలో సమర్థవంతంగా కార్యక్రమాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలిచాయి.
పంచ్ సమ్మేళనాల విస్తృత ప్రచారం కోసం పలు రాష్ట్రాలు వినూత్న, బహుళస్థాయి విధానాలను అవలంబించాయి. గుజరాత్, జమ్మూకశ్మీర్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు జిల్లా స్థాయిలోనే కాకుండా ఇతర పరిపాలన స్థాయిల్లోనూ సమ్మేళనాలను నిర్వహించాయి. దీంతో పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులు, సిబ్బందికి మరింత విస్తృతంగా చేరువ కావడంతో పాటు, క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం, సామర్థ్యాన్ని పెంపొందించడం మరింత బలోపేతమైంది.
వీబీ-జీ రామ్ జీ చట్టం 2025 గ్రామీణాభివృద్ధి ప్రక్రియలో గ్రామ పంచాయతీలను కేంద్రబిందువుగా నిలిపి.. ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ, పారదర్శకత, సామాజిక జవాబుదారీతనం వంటి అంశాల్లో కీలక బాధ్యతలను అప్పగించింది. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (వీజీపీపీ), గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కార్డు, ఆస్తుల కల్పన, పథకాల సమన్వయం, సామాజిక తనిఖీ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు తదితర చట్టంలోని వివిధ నిబంధనలపై ఎన్నికైన ప్రజాప్రతినిధులు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు పంచ్ సమ్మేళనాలు సమర్థవంతమైన వేదికగా మారాయి.
దేశవ్యాప్తంగా పంచ్ సమ్మేళనాల కార్యక్రమం ఉత్సాహభరితమైన పురోగతితో ముందుకు సాగుతోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చురుకైన భాగస్వామ్యం, వివిధ వర్గాల విస్తృత భాగస్వామ్యంతో గ్రామీణాభివృద్ధి, సుపరిపాలన, భాగస్వామ్య ప్రణాళిక, పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి బలమైన పునాది ఏర్పడుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2305131)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5