పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
2026 సెప్టెంబరు 1న న్యూఢిల్లీలో నాలుగో ఇండో - జర్మన్ పర్యావరణ సదస్సు
పర్యావరణం, వాతావరణ మార్పులపై ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, బహుపాక్షిక చర్చలకు సౌలభ్యం కల్పించేలా వేదిక
నాడు పోస్టు చేయడమైనది:
31 AUG 2026 2:05PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో సెప్టెంబరు 1న నిర్వహించనున్న భారత్ - జర్మనీ పర్యావరణ సదస్సు నాలుగో సమావేశానికి.. భారత కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, జర్మనీ పర్యావరణ, వాతావరణ పరిరక్షణ, ప్రకృతి సంరక్షణ, అణు భద్రత శాఖ మంత్రి శ్రీ కార్‌స్టెన్ ష్నెయిడర్ సంయుక్తంగా అధ్యక్షత వహించనున్నారు. ‘పర్యావరణ సుస్థిరత దిశగా సమష్టిగా ముందుకు సాగుదాం’ అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించనున్నారు.
పర్యావరణ విధానంపై భారత్, జర్మనీ మధ్య అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక వేదిక ఇండో-జర్మన్ పర్యావరణ సదస్సు. 2008 నుంచి దీనిని నిర్వహిస్తున్నారు. జర్మనీ వాణిజ్య వ్యవహారాల ఆసియా - పసిఫిక్ కమిటీ (ఏపీఏ), భారత పారిశ్రామిక సంఘాలతో కలిసి.. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ - జర్మనీ పర్యావరణ, వాతావరణ పరిరక్షణ, ప్రకృతి సంరక్షణ, అణు భద్రత మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం, అనుభవాలను పంచుకోవడంతోపాటు ఆచరణాత్మక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా.. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ విధానాలకు సంబంధించిన కీలక అంశాలపై శ్రీ భూపేందర్ యాదవ్, శ్రీ ష్నెయిడర్ చర్చిస్తారు. కర్బనోద్గారాలు తక్కువగా వెలువడే పరిశ్రమలు, చిత్తడి భూములు, పర్వత ప్రాంతాలు, అడవుల్లో జీవవైవిధ్యం, సమర్థంగా వనరుల వినియోగం, పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థను వ్యాపార నమూనాగా స్వీకరించడం, ఎప్పటికప్పుడు నిధులను అందించడం, సుస్థిర నైపుణ్యాలు, పెట్టుబడుల సమీకరణ వంటి వివిధ అంశాల్లో సవాళ్లు, పరిష్కార మార్గాలు, అవకాశాలపై... అంశాల వారీ సదస్సుల ద్వారా ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
ఇరుదేశాల మధ్య పర్యావరణ, వాతావరణ సహకారంపై.. విధాన నిర్ణేతలు, ప్రైవేటు రంగ ప్రతినిధులు, నిపుణులు, ఇతర భాగస్వామ్య పక్షాల మధ్య ద్వైపాక్షిక చర్చలకు ఈ సదస్సు వేదికగా నిలవనుంది. మంత్రిత్వశాఖలు, వ్యాపార రంగం, నిపుణుల బృందాలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.
ఈ సదస్సుకు ముందు.. వాతావరణ మార్పు, జీవవైవిధ్యం, పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ)ల మూడు సంయుక్త కార్యవర్గ బృందాల ఈ ఏడాది సమావేశాలు జరిగాయి. ఇరుపక్షాలకు ప్రయోజనకరంగా ఉన్న రంగాల్లో సాధించిన పురోగతిపై ఆయా కార్యవర్గ బృందాలు చర్చించాయి.
భారతదేశం, జర్మనీ మధ్య బలోపేతమవుతున్న, విస్తరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక సంబంధాలు, సుస్థిర సాంకేతికతలు, పర్యావరణ హిత ఆర్థిక వ్యవస్థలో మరింత బలమైన సహకారానికి అవకాశాల నేపథ్యంలో.. ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2304977)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11