వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్, బ్రెజిల్ వాణిజ్య పర్యవేక్షక యంత్రాంగం 8వ సమావేశానికి సహాధ్యక్షత వహించిన వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ అగర్వాల్
వాణిజ్య, ఆర్థిక సంబంధాల బలోపేతానికి నిబద్ధతను పునరుద్ఘాటించిన భారత్, బ్రెజిల్...
2030 కల్లా 30 బిలియన్ అమెరికా డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య సాధనే లక్ష్యం
భారత్, ‘మర్కెసుర్’ పరిశీలనాంశాలపై సమీక్ష...
భారతీయ ఫార్మాస్యూటికల్స్ రంగ ఉత్పాదనలకు మరింత ఎక్కువ మార్కెట్టు లభ్యతను
వీలయినంత త్వరగా నిర్ధారించే నిబద్ధత పునరుద్ఘాటించిన భారత్, బ్రెజిల్
వ్యవసాయ మార్కెట్టు లభ్యతతో పాటు వాణిజ్య సౌలభ్యాన్ని పెంపొందించాలని సంకల్పించిన భారత్, బ్రెజిల్...
బ్రిక్స్, జీ20, డబ్ల్యూటీఓ వేదికల్లో మరింత సహకరించుకొందామంటూ పునరుద్ఘాటన
భారత్, బ్రెజిల్ ఉన్నత స్థాయి వాణిజ్య స్వాగత కార్యక్రమం...
25కు పైగా భారతీయ కంపెనీల ప్రతినిధి వర్గానికి వాణిజ్య కార్యదర్శి సారథ్యం
నాడు పోస్టు చేయడమైనది:
31 AUG 2026 9:54AM by PIB Hyderabad
భారత్, బ్రెజిల్ వాణిజ్య పర్యవేక్షక యంత్రాంగం (ట్రేడ్ మానిటరింగ్ మెకానిజం..టీఎమ్ఎమ్) 8వ సమావేశాన్ని బ్రెజిల్ లోని బ్రసిలియాలో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖలోని వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ అగర్వాల్‌తో పాటు బ్రెజిల్‌కు చెందిన అభివృద్ది, పరిశ్రమ, వాణిజ్య, సేవల (ఎమ్‌డీఐసీ) మంత్రిత్వశాఖలో విదేశీ వాణిజ్య కార్యదర్శి తాతియానా లైసర్రదా ప్రాజెరెస్ సహాధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డీ సిల్వా నాయకత్వంలో ద్వైపాక్షిక సంబంధాలకు జతకలిసిన రాజకీయ వేగాన్ని మరింత పెంపొందింపచేస్తూ, భారత్, బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అద్దం పట్టే శక్తిమంతమైన సంస్థాగత ప్రాథమిక ప్రణాళికతో పాటు ఇరు పక్షాల వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఈ సమావేశంలో ఉమ్మడి నిబద్ధతను వ్యక్తం చేశారు.
బ్రెజిల్‌కు చెందిన ఎమ్‌డీఐసీ మంత్రి శ్రీ మార్సియో ఎలియాస్ రోజాతోనూ వాణిజ్య కార్యదర్శి సమావేశమయ్యారు. వారు ఇరువురూ ప్రాధాన్య రంగాల్లో ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడం, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలపరుచుకోవడంపై చర్చించారు. భారత్, బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక వ్యాపారం నిరంతరాయంగా అభివృద్ధి చెందుతూ 2025-26లో 15.07 బిలియన్ అమెరికా డాలర్ల స్థాయిని అందుకుంది. ఉభయ పక్షాలూ మరింత ఎక్కువ విభిన్న, సమతౌల్య, నిరంతర భాగస్వామ్యాన్ని... మరీ ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, ఇంజినీరింగ్ వస్తువులు, యంత్ర పరికరాల రంగాల్లో.. నెలకొల్పుకుంటూ, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030కల్లా 30 బిలియన్ అమెరికా డాలర్ల స్థాయికి విస్తరించాలన్న ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించాయి.
భారత్, ‘మర్కెసుర్’ వాణిజ్య కూటమి పరిశీలనాంశాలలో పురోగతిని ఉభయ పక్షాలూ ఈ సమావేశాల సందర్భంగా సమీక్షించాయి. భారత్, మర్కెసుర్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంటులో విస్తరణ, ఆధునికీకరణలకు సంబంధించిన అనేక అవకాశాలు ఇమిడివున్నాయి. 2025లో భారత్, మర్కెసుర్ ద్వైపాక్షిక వాణిజ్యం 20.84 బిలియన్ అమెరికా డాలర్ల స్థాయికి చేరుకొంది. పరిశీలనాంశాలను వీలైనంత త్వరలో కొలిక్కి తీసుకువద్దామంటూ ఇరు పక్షాలూ నిబద్ధతను వ్యక్తం చేశాయి.
భారతీయ ఔషధ ఉత్పాదనలకు మార్కెట్టు లభ్యతకు మార్గాన్ని సుగమం చేయడంలో కూడా చెప్పుకోదగిన పురోగతి చోటుచేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుదిరిన సీడీఎస్‌సీఓ-ఏఎన్‌వీఐఎస్ఏ అవగాహన ఒప్పందం ఆరోగ్యం, ఔషధాల రంగంలో సహకారం పెంపునకు ఒక ముఖ్య సంస్థాగత పునాదిని అందిస్తోంది. మరింత ఎక్కువ ముందస్తు అంచనాలకు ఆస్కారం ఉండే నియంత్రణ ప్రక్రియలకు మద్దతివ్వడంతో పాటు మార్కెట్టు లభ్యతకు మార్గాన్ని సుగమం చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని భారత్ స్పష్టం చేసింది. నాణ్యమైన మందులను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచే విషయంలో తోడ్పాటును అందించడం ద్వారా ఆరోగ్యసంరక్షణ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారత్ దోహదపడనుంది.
వ్యవసాయ రంగంలో, పరస్పర ఆసక్తి ఉన్న కీలక ఉత్పాదనలతో ముడిపడిన ప్రాధాన్య మొక్కల స్వచ్ఛత సంరక్షణ సంబంధిత అభ్యర్థన (ఫైటోశానిటరీ రిక్వెస్టు)లపైనా సమగ్రంగా చర్చించారు. ఉభయ పక్షాల మార్కెట్ల లభ్యతకు సంబంధించి రాయితీలను ఇచ్చే దిశగా సాంకేతిక ప్రక్రియలను నిర్ణీత కాలంలో ముందుకు తీసుకుపోవడానికి ఒక సుస్పష్ట అజెండాను రూపొందించారు. చర్చల సందర్భంగా ఎలక్ట్రానిక్ మౌలిక ధ్రువపత్రాల పరస్పర గుర్తింపు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎమ్ఎస్ఎమ్‌ఈ), ఔత్సాహిక పారిశ్రామికత్వం, హస్తకళల రంగంలో సహకారం అంశాల్లో ప్రోత్సాహకరమైన ప్రగతి చోటు చేసుకోవడాన్ని సమీక్షించారు. ఇది వాణిజ్యాన్ని సులభతరంగా మార్చడంలోనూ, వాణిజ్య సంబంధిత కార్యకలాపాల్లో ఎదురుకాగల ఇబ్బందులను తగ్గించే దిశగానూ ఒక కీలకమైన అడుగు అని వర్ణించారు.
బ్రిక్స్, జీ20, డబ్ల్యూటీఓ సహా వివిధ బహుళ పక్ష వేదికల్లో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించాలని, ఆంక్షలకు తావు ఉండని, సమ్మిళిత, అభివృద్ధి ప్రధాన బహుళ పక్ష వ్యవస్థను ప్రోత్సహించాలని ఇరు పక్షాలూ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. 2030 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రిక్స్ ఆర్థిక భాగస్వామ్య వ్యూహం, 2026-2030 మధ్య కాలానికి గ్లోబల్ వేల్యూ చైన్ (జీవీసీ) కార్యాచరణ ప్రణాళిక.. ఈ రెండిటినీ ముందుకు తీసుకుపోవడంలో బ్రెజిల్ పాలుపంచుకోవడాన్ని భారత్ ప్రశంసించింది. బ్రిక్స్ కూటమికి ఈ సంవత్సరం భారత్ అధ్యక్షత వహించి పూర్తి చేసిన పనులను, ప్రత్యేకించి బ్రిక్స్ స్టార్టప్స్ నాలెడ్జ్ హబ్, బ్రిక్స్ బిజినెస్ ఇంక్యుబేటర్ వంటి కార్యక్రమాల అమలుకు గాను భారత్‌ను బ్రెజిల్ అభినందించింది.
ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత్, బ్రెజిల్ ఉన్నత స్థాయి వాణిజ్య సంబంధ స్వాగత కార్యక్రమాన్ని బ్రసిలియాలో నిర్వహించారు. దీనిలో రెండు దేశాలకు చెందిన ప్రముఖ వాణిజ్య ప్రతినిధులతో పాటు పారిశ్రామిక రంగ ఆసక్తిదారులు పాల్గొన్నారు. భారతీయ వాణిజ్య సంస్థలతో కూడిన 25 మందికి పైగా ప్రతినిధుల బృందానికి వాణిజ్య కార్యదర్శి నాయకత్వం వహించారు. బృందంలో కిర్లోస్కర్ గ్రూపు, యూపీఎల్, ఆదిత్య బిర్లా గ్రూపు, తదితర సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ఈ వాణిజ్య సంబంధ స్వాగత కార్యక్రమం కీలక ఖనిజాలు, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయ సంబంధిత వాణిజ్యం, మౌలిక సదుపాయాల కల్పన, ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ సేవలు, ఆధునిక వస్తు రవాణా వ్యవస్థ (లాజిస్టిక్స్), అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో సహకారానికి కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఒక ప్రధాన వేదికగా నిలిచింది. న్యూఢిల్లీలో అపెక్స్‌బ్రెజిల్ (ApexBrasil) కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు ఇరు పక్షాలూ హర్షాన్ని వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమం వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసి భారత్, బ్రెజిల్ మధ్య పెట్టుబడులను పెంచడానికి తోడ్పడుతుంది. భారత్, బ్రెజిల్ మధ్య చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయి. అవి పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలు, అంతకంతకు వృద్ధి చెందుతున్న ఆర్థిక సహకారం కారణంగా అంతకంతకు విస్తరిస్తున్నాయి. ఈ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఒక కొత్త వేగాన్ని జోడించింది. అంతేకాదు బలమైన, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడం పట్ల రెండు దేశాల ఉమ్మడి నిబద్ధత మరింత బలాన్ని పుంజుకుంది.


***
(రిలీజ్ ఐడి: 2304965)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14