ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ వజ్ర 2.0లో భాగంగా భారీ అంతర్రాష్ట్ర ఔషధాల అక్రమ తరలింపును అడ్డుకున్న సీబీఎన్
66.80 లక్షల సైకోట్రోపిక్ మాత్రలు స్వాధీనం; ఒకరి అరెస్ట్
నాడు పోస్టు చేయడమైనది:
29 AUG 2026 5:40PM by PIB Hyderabad
సైకోట్రోపిక్ ఔషధాల అక్రమ మళ్లింపు, అక్రమ రవాణాపై చేపట్టిన చర్యల్లో భాగంగా కేంద్ర నార్కోటిక్స్ బ్యూరో (సీబీఎన్) మధ్యప్రదేశ్ యూనిట్ కచ్చితమైన సమాచారం ఆధారంగా కీలక విజయం సాధించింది.
పంజాబ్ - హిమాచల్‌ప్రదేశ్ మార్గంలో భారీగా సైకోట్రోపిక్ ఔషధాలను అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన కచ్చితమైన నిఘా సమాచారంతో, సీబీఎన్ మధ్యప్రదేశ్ యూనిట్‌కు చెందిన ప్రత్యేక నిరోధక బృందం నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. ఆపరేషన్ వజ్ర 2.0 కింద 2026 ఆగస్టు 27 - 28 తేదీల్లో చండీగఢ్ - బద్దీ అంతర్ రాష్ట్ర మార్గంలో వ్యూహాత్మకంగా మోహరించింది.
ఈ ఆపరేషన్‌లో భాగంగా పెద్దఎత్తున 66,79,980 సైకోట్రోపిక్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆల్ప్రజోలం, ట్రామాడోల్, నైట్రాజెపామ్, క్లోనాజెపామ్ మాత్రలు ఉన్నాయి. అవసరమైన చట్టబద్ధ పత్రాలు లేకుండానే ఈ ఔషధాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, ఒక ఎస్ఎంఎల్ ఇసుజు సర్తాజ్ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.
రాత్రంతా నిఘా అనంతరం, 2026 ఆగస్టు 27న ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న అనుమానాస్పద ఎస్ఎంఎల్ ఇసుజు సర్తాజ్ ట్రక్కును బృందం అడ్డగించింది. అనంతరం క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించింది.
ఒక్కో కార్టన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, నియంత్రిత సైకోట్రోపిక్ పదార్థాలతో కూడిన 120 మాస్టర్ కార్టన్లు బయటపడ్డాయి. ఈ సరుకులో ఆల్ప్రజోలం, ట్రామాడోల్, నైట్రాజెపామ్, క్లోనాజెపామ్ మాత్రలు ఉన్నాయి. మొత్తం 66,79,980 మాత్రలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ సరఫరా శృంఖలాన్ని దాచడానికి, నిబంధనల నుంచి తప్పించుకోవడానికి పలు ఉద్దేశపూర్వక చర్యలు చేపట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న బ్లిస్టర్ స్ట్రిప్స్, పెట్టెలపై బ్యాచ్ నంబర్లు, తయారీ తేదీలు, గడువు ముగిసే (ఎక్స్‌పైరీ) తేదీలను చెరిపివేసినట్లు గుర్తించారు.
“పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో విక్రయించరాదు” అనే ముద్రణ ఉన్న ఔషధాలను భారీ మొత్తంలో ఎలాంటి చెల్లుబాటు పత్రాలు లేకుండా ఈ ప్రాంతంలోకి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించి ఇన్‌వాయిస్‌లు, బిల్టీ లేదా ఈ-వే బిల్లులు వంటి అవసరమైన పత్రాలు ఏవీ లేవని తేలింది.


వివరమైన జాబితా తయారీ, పరిశీలన, స్వాధీనం ప్రక్రియలు రాత్రంతా 14 గంటలకు పైగా కొనసాగాయి. మొత్తం 66,79,980 సైకోట్రోపిక్ మాత్రలను, వాటిని తరలించేందుకు ఉపయోగించిన ఎస్ఎంఎల్ ఇసుజు సర్తాజ్ ట్రక్కు ను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం - 1985లోని సంబంధిత నిబంధనల కింద స్వాధీనం చేసుకున్నారు.
ఎన్‌డీపీఎస్ చట్టం–1985లోని సంబంధిత నిబంధనల కింద ఒక అనుమానితుడిని అరెస్ట్ చేశారు.
ఈ భారీ అంతర్రాష్ట్ర ఔషధాల అక్రమ మళ్లింపు వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఔషధాల తయారీ, సరఫరాకు సంబంధించిన పైస్థాయి మార్గాలతో పాటు, దిగువస్థాయి పంపిణీ వ్యవస్థను గుర్తించి ఛేదించేందుకు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ సైకోట్రోపిక్ ఔషధాల అక్రమ మళ్లింపు, అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
మందులు లేదా ఔషధాల సురక్షిత వినియోగం లక్ష్యంతోపాటు నషా ముక్త్ భారత్ అభియాన్ కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) దృఢంగా కట్టుబడి ఉంది. మత్తు పదార్థాలు, సైకోట్రోపిక్ ఔషధాల అక్రమ రవాణా, మళ్లింపులపై పక్కా సమాచారంతో కూడిన చట్టపరమైన చర్యలను నిరంతరం కొనసాగిస్తోంది.
ప్రస్తుత 2026 క్యాలెండర్ సంవత్సరంలో, కేంద్ర నార్కోటిక్స్ బ్యూరో (సీబీఎన్) అక్రమ రవాణా నిరోధక చర్యల్లో విశేష ప్రతిభ కనబరిచింది. అక్రమ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్న 197 కేసులను నమోదు చేసి, 272 మందిని అరెస్ట్ చేసింది. సింథటిక్ మాదకద్రవ్యాల తయారీ కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపట్టిన సీబీఎన్, 6 రహస్య మాదకద్రవ్యాల తయారీ ప్రయోగశాలలను ఛేదించింది. విస్తృతమైన కార్యాచరణ చర్యల ద్వారా భారీ మొత్తంలో అక్రమ మాదకద్రవ్యాల తరలింపును కూడా అడ్డుకుని సుమారు 51,000 కిలోల వివిధ రకాల ఎన్‌డీపీఎస్ మాదకద్రవ్యాలతో పాటు, 12,72,00,000 సైకోట్రోపిక్ ఔషధాల మాత్రలు, క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకుంది.
***
(రిలీజ్ ఐడి: 2304560)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10