ఉప రాష్ట్రపతి సచివాలయం
ఎవాన్ 3.3, ప్లెక్సస్ లతో కూడిన స్వదేశీ ఏఐ సాంకేతిక వేదిక 'జ్ఞాని అర్థ'ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్
కొత్త అవకాశాలను కల్పిస్తూ భారత ఆర్థిక ప్రగతిని తదుపరి దశకు తీసుకెళ్లనున్న కృత్రిమ మేధ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ సంకల్పం, ‘ఇండియా ఫస్ట్’ విధానం భారత్‌ను సాంకేతిక స్వావలంబన దిశగా నడిపిస్తున్నాయి: ఉపరాష్ట్రపతి
ఎప్పటికీ వినియోగదారులుగా ఉండిపోకుండా ఇతరులు వినియోగించే వస్తువులను మనమే సృష్టించాలి: ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
28 AUG 2026 5:55PM by PIB Hyderabad
జ్ఞాని ఏఐ అభివృద్ధి చేసిన ఎవాన్ 3.3, ప్లెక్సస్ లతో కూడిన స్వదేశీ ఏఐ సాంకేతిక వేదిక 'జ్ఞాని అర్థ'ను ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్‌లో ప్రారంభించారు. ఎవాన్ 3.3 ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కాగా, ప్లెక్సస్ ఏఐ సాంకేతికతను వాస్తవ ప్రపంచ పనులతో, సంస్థలతో అనుసంధానించే వేదిక.
‘జ్ఞాని అర్థ’ ఆవిష్కరణను స్వాగతిస్తూ, ఎవాన్ 3.3, ప్లెక్సస్ ల సమ్మేళనం భారత సాంకేతిక వ్యవస్థలో పెరుగుతున్న సామర్థ్యానికి ప్రతిబింబమని, భారతీయ ఇంజినీర్లు అత్యాధునిక సాంకేతికతలను వినియోగించడమే కాకుండా, వాటిని స్వయంగా అభివృద్ధి చేయగలరని నిరూపిస్తోందని ఉపరాష్ట్రపతి అన్నారు.
టైప్‌రైటర్లు, పరిమిత స్థాయిలో వ్యక్తిగత కంప్యూటర్ల వినియోగం ఉన్న కాలం నుంచి నేటి కృత్రిమ మేధ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యుగం వరకు సాంకేతికతలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని శ్రీ రాధాకృష్ణన్ అన్నారు. కంప్యూటర్లు వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలు గతంలో వ్యక్తమైనప్పటికీ, అందుకు భిన్నంగా ఐటీ రంగం భారత్‌లోనూ, విదేశాల్లోనూ అనేక ఉపాధి అవకాశాలను సృష్టించిందని ఆయన గుర్తుచేశారు. అదే విధంగా ఏఐ కూడా కొత్త ఉపాధి, అభివృద్ధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని, తద్వారా భారత ఆర్థిక ప్రగతిని తదుపరి దశకు తీసుకెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కృత్రిమ మేధ రంగంలో భారత్ సాధిస్తున్న వేగవంతమైన పురోగతిని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, ఇండియా ఏఐ మిషన్, ఏఐ కోసం ఏర్పాటు చేసిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి కార్యక్రమాలు దేశ మార్పు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో సాంకేతిక మార్పుకు వెన్నుదన్నుగా నిలుస్తున్న వేగానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వమే ప్రధాన కారణమని ఆయన అన్నారు. ఆయన రాజకీయ సంకల్పం, ‘ఇండియా ఫస్ట్’ విధానం పట్ల నిబద్ధత వల్లనే అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో భారత సామర్థ్యాలు మరింత బలోపేతమవుతున్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో ఏఐ వినియోగాన్ని ప్రస్తావిస్తూ, డిజిటల్ సంసద్ పోర్టల్ ద్వారా పార్లమెంటరీ చర్చలు, పత్రాలను పలు భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతోందని ఆయన తెలిపారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో ఎనిమిది భాషల్లో ఏకకాలంలో ఏఐ ఆధారిత అనువాద సదుపాయాన్ని ప్రవేశపెట్టామని, త్వరలోనే దీనిని రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషలకు విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
సాంకేతిక స్వావలంబన ఆవశ్యకతను ప్రస్తావిస్తూ, భారత్ కేవలం సాంకేతికతను వినియోగించే దేశంగా మాత్రమే మిగిలిపోకూడదని అన్నారు. “మనం ఎల్లప్పుడూ వినియోగదారులుగా ఉండకూడదు. ఇతరులు వినియోగించేలా వస్తువులను మనమే సృష్టించాలి” అని పేర్కొంటూ, దేశీయ సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన ప్రాధాన్యతను ఆయన వివరించారు.
సాంకేతిక, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేసేందుకు స్వదేశీ ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఎంతో కీలకమని ఉపరాష్ట్రపతి ఉద్ఘాటించారు. సెమీకండక్టర్ తయారీని ప్రస్తావిస్తూ, భారత్ మరింత ముందుగానే చిప్‌ల తయారీని ప్రారంభించి ఉంటే, ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదిగి ఉండేదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సెమీకండక్టర్ రంగం మళ్లీ ఊపందుకుందని ఆయన పేర్కొన్నారు.
వికసిత్ భారత్ - 2047 దిశగా భారత్ సాగించే ప్రస్థానంలో సాంకేతిక సామర్థ్యం ఒక కీలకమైన స్తంభంగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు. సాంకేతిక స్వావలంబన, ఆవిష్కరణలు, ప్రపంచ నాయకత్వం వైపు భారత్ సాగుతున్న విస్తృత జాతీయ ప్రస్థానంలో ‘జ్ఞాని అర్థ’ ఒక ముఖ్యమైన భాగమని ఆయన అభివర్ణించారు.
‘ జ్ఞాని అర్థ’ ఆవిష్కరణ సందర్భంగా జ్ఞాని ఏఐ సీఈఓ శ్రీ గణేశ్ గోపాలన్, సహ వ్యవస్థాపకుడు, సీటీఓ శ్రీ అనంత్ నాగరాజ్‌లకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం మరింత బలమైన, స్వావలంబనతో కూడిన, సాంకేతికంగా సాధికారత కలిగిన భారత్ నిర్మాణానికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2304415)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7