ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాజ్యసభ ఎంపీ ఘనశ్యామ్ తివారీ రచించిన ‘సంకల్ప్ సే సిద్ధి కా మోదీ యుగ్’ పుస్తకం విడుదల చేసిన ఉపరాష్ట్రపతి


కలలకు, వాస్తవానికి మధ్య 'సేతు పురుష్' (వారధి వంటివారు) ప్రధానమంత్రి శ్రీ మోదీ

'సంకల్ప్ సే సిద్ధి కా మోదీ యుగ్' పుస్తకం సంకల్పం నుంచి సాధన దిశగా భారత్ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది: ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 27 AUG 2026 6:22PM by PIB Hyderabad

రాజ్యసభ ఎంపీ శ్రీ ఘనశ్యామ్ తివారీ రచించిన ‘సంకల్ప్ సే సిద్ధి కా మోదీ యుగ్’ పుస్తకాన్ని న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్‌లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు విడుదల చేశారు.

 ‘సంకల్ప్ సే సిద్ధి కా మోదీ యుగ్’ అనే శీర్షిక శక్తిమంతమైన, స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని కలిగి ఉందని శ్రీ సి. పి. రాధాకృష్ణన్ పేర్కొన్నారు. సంకల్పం కేవలం ఒక కోరిక మాత్రమే కాదని... అది అంకితభావం, కఠోర శ్రమ, క్రమశిక్షణతో కూడిన దృఢ నిశ్చయమని ఆయన అన్నారు. ఈ పుస్తకం గత పన్నెండేళ్లుగా భారత్ సాధించిన పరిపాలన విజయాలు, సైద్ధాంతిక పునరుజ్జీవనం వంటి ప్రస్థానాన్ని వివరిస్తూ... ‘వికసిత్ భారత్ @ 2047’ దార్శనికత దిశగా సాగుతున్న దేశ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, వీర్ సావర్కర్, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి గొప్ప జాతీయ చింతనాపరుల భావాలు, ఆదర్శాలను సమకాలీన పాలనతో అనుసంధానించడానికి ఈ పుస్తకంలో జరిగిన కృషిని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఆ చింతనాపరుల సంకల్పానికి, నేటి భారతంలో దాని సాకారానికి మధ్య అనుసంధానాన్ని ప్రతిబింబిస్తూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని 'సేతు పురుష్' (కలలకు, వాస్తవానికి మధ్య వారధి)గా రచయిత సముచితంగా అభివర్ణించారని ఆయన పేర్కొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హయాంలో జరిగిన కీలక పరిణామాలను గుర్తుచేసుకుంటూ... ఈ పుస్తకం 'దేశం ప్రథమం', 'సమగ్ర మానవతావాదం', 'అంత్యోదయ' స్ఫూర్తిని ఏకతాటిపైకి తెస్తుందని శ్రీ సి. పి. రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. జాతీయ సమగ్రత, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, స్వయం సమృద్ధ భారత్, పారదర్శక పాలన వంటి అంశాలను శ్రీ సి. పి. రాధాకృష్ణన్ ప్రముఖంగా ప్రస్తావించారు. శాశ్వత జాతీయ భావనలను ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నంగా ఈ రచన వివిధ పాలనాపరమైన కార్యక్రమాలను ప్రదర్శిస్తోందన్నారు. భారత ప్రస్థానం గురించి ఆలోచించి, ఆత్మవిశ్వాసంతో, ఆశావాదంతో భవిష్యత్తు వైపు చూడమని పాఠకులను ఇది ప్రోత్సహిస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్... రాజ్యసభ ఎంపీ, రచయిత శ్రీ ఘనశ్యామ్ తివారీ... రాజ్యసభ ఎంపీ శ్రీ లహర్ సింగ్ సిరోయా, ప్రభాత్ ప్రకాశన్‌ నుంచి శ్రీ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2303982) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam