వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మొరాకోలో ముగిసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద అధికార పర్యటన
7వ భారత్ - మొరాకో సంయుక్త కమిషన్ సమావేశానికి సహ అధ్యక్షత వహించిన కేంద్రమంత్రి
శ్రీ ప్రసాద పర్యటనతో భారత - మొరాకో ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం; 7వ సంయుక్త కమిషన్‌తో వాణిజ్య, పెట్టుబడుల సహకారానికి ఊతం
భారత్ - మొరాకో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేయాలని నిర్ణయం; ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందంపై అధ్యయనానికి సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటు
2027లో భారత్ - మొరాకో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు; న్యూఢిల్లీలో 8వ సంయుక్త కమిషన్ సమావేశం
కృత్రిమ మేధ, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాల్లో విస్తృత అవకాశాల దృష్ట్యా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని మొరాకో వ్యాపార సంస్థలకు శ్రీ జితిన్ ప్రసాద ఆహ్వానం
నాడు పోస్టు చేయడమైనది:
26 AUG 2026 6:09PM by PIB Hyderabad
వాణిజ్యం, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద 2026 ఆగస్టు 24, 25 తేదీల్లో మొరాకోలో జరిపిన అధికారిక పర్యటన విజయవంతంగా ముగిసింది.. ఈ సందర్భంగా ఆయన మొరాకోకు చెందిన పలువురు సీనియర్ మంత్రులు, ప్రముఖులతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు ఈ పర్యటన సందర్భంగా మొరాకో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి, విదేశీ వాణిజ్య వ్యవహారాల శాఖ ఇన్చార్జి మంత్రి శ్రీ ఒమర్ హెజీరాతో కలిసి భారత్ - మొరాకో సంయుక్త కమిషన్ 7వ సమావేశానికి శ్రీ జితిన్ ప్రసాద సహాధ్యక్షత వహించారు.
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొరాకో రాజు మహారాజు మొహమ్మద్ (6) నాయకత్వంలో భారత్ - మొరాకో దేశాల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యం బలమైన వ్యూహాత్మక పురోగతిని సాధించింది.
పర్యటన సందర్భంగా శ్రీ జితిన్ ప్రసాద మొరాకో - ఇండియా బిజినెస్ ఫోరంలో పాల్గొన్నారు. మొరాకోకు చెందిన సీనియర్ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. భారతీయ వ్యాపార వర్గాలతో సమావేశమై చర్చలు జరిపారు., మొరాకోకు చెందిన ఓసీపీ గ్రూప్ భారతీయ భాగస్వాములతో కలిసి ఏర్పాటు చేసిన ఉమ్మడి భాగస్వామ్య ఇండియా–మారోక్ ఫాస్ఫోర్ (ఐఎంఏసీఐడి) తయారీ కేంద్రాన్ని సందర్శించి, ఫాస్ఫేట్లు, ఎరువుల రంగంలో భారత్ - మొరాకో మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని సమీక్షించారు.
శ్రీ జితిన్ ప్రసాద వెంట భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నేతృత్వంలోని ఉన్నతస్థాయి వ్యాపార ప్రతినిధి బృందం కూడా మొరాకో పర్యటనలో పాల్గొంది. ఈ బృందం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ, రబాత్ - సలే - కెనిత్రా సర్వీసెస్‌తో పాటు మొరాకో ఎంటర్‌ప్రైజెస్ జనరల్ కాన్ఫెడరేషన్ (సీజీఈఎం) ప్రతినిధులతో ఫలప్రదమైన సమావేశాలు నిర్వహించింది.
7వ భారత్ - మొరాకో సంయుక్త కమిషన్ సమావేశం
భారత్- మొరాకో సంయుక్త కమిషన్ ఏడో సమావేశం ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యానికి నూతన ఊపునిచ్చింది. వాణిజ్యాన్ని పెంపొందించడం, మార్కెట్ లభ్యతను బలోపేతం చేయడం, పెట్టుబడులు పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, భారత, మొరాకో వ్యాపార సంస్థలకు కొత్త అవకాశాలను కల్పించడం లక్ష్యంగా సహకారానికి విస్తృతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
ఈ సందర్భంగా ఇరు దేశాలు ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో సాధించిన పురోగతిని సమీక్షించాయి. వాణిజ్యం, పెట్టుబడులు, పరిశ్రమలు, ఎరువులు, వ్యవసాయం, ఔషధాలు, ఇంధనం, ఖనిజాలు, డిజిటల్ మార్పు, రవాణా తదితర పరస్పర ప్రయోజన రంగాల్లో సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించాలని అంగీకరించాయి. 2025లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 4 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. ఇది భారత్, మొరాకో మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాల నిరంతరం బలోపేతం తీరును ప్రతిబింబిస్తోంది. చిరకాల స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి.
వాణిజ్య ఉత్పత్తుల పరిధిని కొత్త రంగాలకు విస్తరించడం, వస్తువులు, సేవల రంగాల్లో ఇరు దేశాల మార్కెట్ లభ్యతను పెంచడం ద్వారా ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల్లో ఇప్పటి వరకు వినియోగించని గణనీయమైన సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఇరు పక్షాలు ఉద్ఘాటించాయి. రానున్న ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసే దిశగా కృషి చేయాలని అంగీకరించాయి.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వ్యాపార ప్రతినిధి బృందాల పరస్పర పర్యటనలు, అవకాశాల అన్వేషణకు సంబంధించిన మిషన్లు, నెట్‌వర్కింగ్ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా కొత్త వ్యాపార అవకాశాలను గుర్తించడం, మార్కెట్ లభ్యతను సులభతరం చేయడం, మొరాకో, భారతీయ కంపెనీల మధ్య సుస్థిర, సంయుక్త భాగస్వామ్య సంస్థలను ప్రోత్సహించడంలో దోహదపడుతుందని ఇరు దేశాలు పేర్కొన్నాయి.
వాణిజ్యాన్ని మరింత విస్తరించేందుకు ఎరువులు, రసాయనాలు, ఖనిజ వనరులు, యంత్రాలు, విద్యుత్ పరికరాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, వాహనాలు, నిర్మాణ సామగ్రి, పాలిమర్లు, వ్యవసాయ–ఆహార ఉత్పత్తులు, టీ, లోహాలు, పర్యాటకం వంటి రంగాలను ఇరు దేశాలు కీలక అవకాశాలుగా గుర్తించాయి. ఔషధ ఉత్పత్తులకు ముందస్తుగా అంచనా వేయగలిగే విధంగా, సకాలంలో మార్కెట్ లభ్యత కల్పించడం కూడా ముఖ్యమని ఇరు దేశాలు అంగీకరించాయి.
ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేందుకు సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగంగా, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని అభివృద్ధి చేసే అవకాశాలను, రెండు దేశాల మధ్య ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందం సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు భారత్ - మొరాకో సంయుక్త కార్యాచరణ బృందం (జేడబ్ల్యూజీ) ఏర్పాటు చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. వస్తువులు, సేవలకు మెరుగైన మార్కెట్ లభ్యత, వాణిజ్య సౌలభ్యం కల్పించే అవకాశాలను అన్వేషించడంతో పాటు సుంకాల, , సుంకేతర అవరోధాలను కూడా జేడబ్ల్యూజీ పరిశీలిస్తుంది.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సులభతరం చేయడం, ఔషధ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా భారతీయ ఔషధ కంపెనీలు ఎదుర్కొంటున్న నియంత్రణపరమైన, మార్కెట్ లభ్యతకు సంబంధించిన సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఇందులో మార్కెట్ అనుమతి విధానాలు, ఆమోదానికి పట్టే సమయం వంటి అంశాలు ఉన్నాయి.భారత పక్షం కీలక ఎగుమతి ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్ లభ్యత సమస్యలతో పాటు, భారత్ నుంచి దిగుమతి చేసుకునే సిరామిక్ టైల్స్‌పై ప్రస్తుతం కొనసాగుతున్న తనిఖీలకు సంబంధించిన సమస్యలను భారత పక్షం మొరాకో దృష్టికి తీసుకువచ్చింది.
వ్యాపార సంస్థల మధ్య పరస్పర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, వాణిజ్య ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, బిజినెస్ ఫోరమ్‌లు, పెట్టుబడులకు సంబంధించిన కార్యక్రమాల్లో పరస్పరం పాల్గొనడం ప్రాధాన్యతను రెండు దేశాలు గుర్తించాయి. ఇరు దేశాల ప్రైవేట్ రంగాల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించడంలో మొరాకో - ఇండియా బిజినెస్ కౌన్సిల్, మొరాకో - ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పాత్రను మరింత బలోపేతం చేయాలని అంగీకరించాయి.
వ్యవసాయ రంగంలో సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రత, ఎస్‌పీఎస్ చర్యలు, ఆహార భద్రతా ప్రమాణాలు, వ్యవసాయ పరిశోధన, డిజిటల్ వ్యవసాయం, బయోటెక్నాలజీ, వ్యవసాయ విలువ శ్రేణులు వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
మొరాకోకు చెందిన నేషనల్ ఆఫీస్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ, భారతదేశంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మధ్య ఆహార భద్రత రంగంలో సహకారానికి సంబంధించి కుదిరిన అవగాహన ఒప్పందంపై సంతకాలను ఇరు పక్షాలు స్వాగతించాయి. ఈ అవగాహన ఒప్పందం ద్వారా సమాచార మార్పిడి, సాంకేతిక నైపుణ్యం, ఉత్తమ విధానాల పరస్పర మార్పిడి, సామర్థ్య నిర్మాణం వంటి అంశాలతో పాటు సురక్షితమైన, సుస్థిరమైన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సులభతరం చేసే కార్యక్రమాలకు ఒక సమగ్ర యంత్రాంగం ఏర్పడుతుంది.
సంయుక్త కమిషన్ సమావేశం సందర్భంగా 2026 - 2030 సంవత్సరాలకు సంబంధించిన సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంపై కూడా ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. కళాకారులు, వృత్తి నిపుణుల పరస్పర మార్పిడి, ఉత్సవాలు, ప్రదర్శనల్లో పాల్గొనడం, వారసత్వ పరిరక్షణలో సహకారం, మ్యూజియంలు, గ్రంథాలయాలు, ఆర్కైవ్ సంస్థల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం ద్వారా సాంస్కృతిక మార్పిడి, సహకారాన్ని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది.
భారత్ - మొరాకో మధ్య దౌత్య సంబంధాలకు 2027లో 70వ వార్షికోత్సవం నేపథ్యంలో, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని ఇరు దేశాలు పేర్కొన్నాయి.
భారత్ - మొరాకో సంయుక్త కమిషన్ ఎనిమిదో సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ సమావేశ తేదీని దౌత్య మార్గాల ద్వారా పరస్పర అంగీకారంతో నిర్ణయించనున్నారు.
మొరాకో -ఇండియా బిజినెస్ ఫోరం: పెట్టుబడులు, భాగస్వామ్యాలకు ప్రాధాన్యత రంగాలు
2026 ఆగస్టు 24న కాసాబ్లాంకాలో మొరాకో ఎంటర్‌ప్రైజెస్ జనరల్ కాన్ఫెడరేషన్ నిర్వహించిన మొరాకో - ఇండియా బిజినెస్ ఫోరంలో శ్రీ జితిన్ ప్రసాద పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపార, పెట్టుబడి సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఆటోమోటివ్, కృత్రిమ మేధ, పునరుత్పాదక ఇంధనం, అంకుర పరిశ్రమలు, ఆర్థిక సేవలు, ఎరువులు, రసాయనాలు, ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాలను కీలక ప్రాధాన్యతా రంగాలుగా ఆయన పేర్కొన్నారు.
ఆటోమోటివ్ విలువ శ్రేణుల్లో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలు, వాటి కూర్పు (ప్రెసిషన్ సబ్ అసెంబ్లీ) రంగాల్లో మరింత సహకారానికి ఉన్న అవకాశాలను శ్రీ జితిన్ ప్రసాద వివరించారు. సౌరశక్తి, ఇంధన నిల్వ, విద్యుత్ గ్రిడ్ నిర్వహణ వంటి పునరుత్పాదక ఇంధన రంగాలు, అంకుర పరిశ్రమలు, ఫిన్‌టెక్, ఆర్థిక సేవలు, కృత్రిమ మేధ, ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్స్, ఔషధాలు, వైద్య పరికరాలు, డిజిటల్ హెల్త్ వంటి ఔషధ, ఆరోగ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ అందిస్తున్న అవకాశాలను శ్రీ జితిన్ ప్రసాద వివరించారు. మొరాకో వ్యాపార సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని, సంయుక్త సంస్థలను ఏర్పాటు చేసి, భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో పాటు వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా, ఆధునిక, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానమైన ఆర్థిక వ్యవస్థను భారత్ నిర్మిస్తోందని శ్రీ జితిన్ ప్రసాద పేర్కొన్నారు. ఇది భారత్ - మొరాకో మధ్య వ్యాపార, పెట్టుబడి భాగస్వామ్యాలను మరింతగా విస్తరించేందుకు గణనీయమైన అవకాశాలను అందిస్తోందని ఆయన తెలిపారు.
ఓసీపీ - భారత్ భాగస్వామ్యం: ఫాస్ఫేట్లు, ఎరువుల రంగాల్లో సహకారం బలోపేతం
మొరాకోకు చెందిన ఓసీపీ గ్రూప్ భారతీయ భాగస్వాములతో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ ఇండియా - మారోక్ ఫాస్ఫోర్ ను శ్రీ జితిన్ ప్రసాద సందర్శించారు. ఈ సందర్భంగా ఫాస్ఫేట్లు, ఎరువుల రంగాల్లో భారత్ - మొరాకో మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని ఆయన సమీక్షించారు.
ఓసీపీ గ్రూప్ భారతీయ భాగస్వాములైన పారాదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్, ఇండో-మొరాక్ ఫాస్ఫోర్ ల సంయుక్త భాగస్వామ్యాలతో సహా రెండు దేశాల మధ్య ఈ వ్యూహాత్మక రంగంలో కొనసాగుతున్న బలమైన, నిరంతర సహకారాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.
భారత వ్యవసాయ రంగ అవసరాలకు అనుగుణంగా ఫాస్ఫేట్లు, ఎరువులను సరఫరా చేసేందుకు తమ నిబద్ధతను ఓసీపీ ప్రతినిధి బృందం మంత్రికి వివరించింది. ఈ పర్యటన ద్వారా భారత ఎరువుల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంలోనూ, ఫాస్ఫేట్లు, ఎరువుల రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడంలోనూ ఈ భాగస్వామ్యానికి ఉన్న ప్రాధాన్యత మరోసారి స్పష్టమైంది.
ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశాలు: వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ సహకారానికి మరింత ఊతం
మొరాకో విదేశీ వాణిజ్య శాఖ సహాయ మంత్రి శ్రీ ఒమర్ హెజిరా, పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ రియాద్ మెజూర్ లతో శ్రీ జితిన్ ప్రసాద ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
పెట్టుబడుల శాఖ ప్రాతినిధ్య మంత్రి శ్రీ కరీమ్ జిదానే, డిజిటల్ మార్పు, పరిపాలనా సంస్కరణల శాఖ ప్రాతినిధ్య మంత్రి డాక్టర్ అమల్ ఎల్ ఫల్లాహ్ సెఘ్రౌచ్నీతో కూడా శ్రీ జితిన్ ప్రసాద సమావేశమయ్యారు.
ఈ సమావేశాల్లో వాణిజ్యం, పెట్టుబడులు, పరిశ్రమలు, డిజిటల్ మార్పు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక భాగస్వామ్యానికి కొత్త రంగాలను గుర్తించడం వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కృత్రిమ మేధ రంగంలో సహకారానికి ఉన్న అవకాశాలపై దృష్టి సారించారు.
భారతీయ వ్యాపార వర్గాలతో సమావేశం - ప్రజల మధ్య సంబంధాల బలోపేతం
శ్రీ జితిన్ ప్రసాద మొరాకోలోని భారతీయ వ్యాపార వర్గాలు, భారతీయ సమాజ సభ్యులతో సమావేశమై వారితో ముఖాముఖి చర్చించారు. భారత్ - మొరాకో సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతీయ సమాజం కీలక పాత్రను ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.
భారతీయ వ్యాపార సంస్థలు మొరాకోలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించి, వివిధ రంగాల్లో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన కోరారు. భారతీయ, మొరాకో వ్యాపార సంస్థల మధ్య మరింత విస్తృత స్థాయిలో సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.


***
(రిలీజ్ ఐడి: 2303627)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7