రక్షణ మంత్రిత్వ శాఖ
చెన్నైలో 7వ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న భారత్, వియత్నాం తీర రక్షక దళాలు
నాడు పోస్టు చేయడమైనది:
26 AUG 2026 11:00AM by PIB Hyderabad
‘తీర రక్షక దళాలకు సంబంధించిన 2015 అవగాహన ఒప్పందం’ ప్రాథమిక ప్రణాళికలో భాగంగా.. 2026 ఆగస్టు 25న చెన్నైలో నిర్వహించిన 7వ ఉన్నత స్థాయి సమావేశం (హెచ్ఎల్ఎమ్)లో భారతీయ తీర రక్షక దళం, వియత్నాం తీర రక్షక దళం పాల్గొన్నాయి.
ఈ సమావేశానికి భారతీయ తీర రక్షక దళం డైరెక్టర్ జనరల్ పరమేశ్ శివమణి, వియత్నాం తీర రక్షక దళం వైస్ కమాండెంట్ మేజర్ జనరల్ లువోంగ్ దిన్హ్ హంగ్ సహాధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో.. మారిటైం సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఏఆర్), నౌకావాణిజ్య నేర నియంత్రణ, నౌకావాణిజ్య కాలుష్య ప్రతిస్పందన, సామర్థ్యాల పెంపుదల సహా కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు.
వృత్తినిపుణుల బృందాల మార్పిడి, నౌకల రాకపోకలు, ప్రస్తుతం అమలవుతున్న ద్వైపాక్షిక ఒప్పందాలను ఇరు పక్షాలూ సమీక్షించాయి. సహకారాన్నీ, ఇతర వ్యవస్థలతో కలిసి పనిచేయగల సామర్థ్యాన్నీ ఇప్పటి కన్న మరింత విస్తరింపచేసుకోవాలన్న ఆసక్తిని పునరుద్ఘాటించాయి.
విశ్వాసాన్నీ, సమన్వయాన్నీ, కార్యకలాపాల సంబంధిత సహకారాన్నీ మరింత పటిష్ఠపరుచుకొనే లక్ష్యంతో క్రమం తప్పక సంస్థాగత సమావేశాలను, శిక్షణ కార్యక్రమాలను, వృత్తినిపుణుల పర్యటనలను నిర్వహించడం, అత్యుత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడంతో పాటు రెండు దేశాలకూ చెందిన నౌకల రాకపోకలకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఉభయ తీరరక్షకదళాలూ పునరుద్ఘాటించాయి.
నౌకావాణిజ్య సంబంధిత సురక్ష, భద్రత, పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించే దిశగా మైత్రి, సహకార స్ఫూర్తితో కలిసి పనిచేసే విషయంలో భారత్, వియత్నాం ఉమ్మడి నిబద్ధతను ఈ 7వ ఉన్నత స్థాయి సమావేశంలో పునరుద్ఘాటించారు.
ప్రస్తుత ద్వైపాక్షిక సహకారంలో భాగంగా భారత్, వియత్నాం తీర రక్షక దళాల సంయుక్త విన్యాసం ‘సహ్‌యోగ్-హెచ్ఓపీటీఏసీ’ని రేపు, అంటే 2026 ఆగస్టు 27న ఏర్పాటు చేయనున్నారు. ఈ విన్యాసం రెండు తీరరక్షక దళాలకూ కార్యకలాపాల సమన్వయాన్నీ, ఇతర వ్యవస్థలతో కలిసి పనిచేయగల సామర్థ్యాన్నీ, అలాగే అత్యుత్తమ పద్ధతుల్నీ పరస్పరం పంచుకొనేందుకు ఒక అవకాశాన్ని అందించనుంది.
***
(రిలీజ్ ఐడి: 2303559)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15