రైల్వే మంత్రిత్వ శాఖ
‘ఐఆర్‌సీటీసీ వార్ రూమ్’పై రైల్వే బోర్డు చైర్మన్ సమీక్ష
కేటరింగ్ సేవల నాణ్యత మెరుగుదలపై ప్రయాణికుల అభిప్రాయ సేకరణ.. వంటశాల పర్యవేక్షణ వ్యవస్థల బలోపేతానికి ఆదేశం
వంటశాలపై ప్రత్యక్ష నిఘా.. సమర్థ తనిఖీ.. లోపాలపై తక్షణ చర్యలు.. ‘రైల్ మదద్’ ద్వారా ఫిర్యాదులపై నిశిత పర్యవేక్షణ అవశ్యమని స్పష్టీకరణ
प्रविष्टि तिथि:
24 AUG 2026 6:46PM by PIB Hyderabad
రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే బోర్డు చైర్మన్(సీఆర్‌బీ)-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) శ్రీ సతీష్ కుమార్ నిన్న ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో వార్ రూమ్ పనితీరును సమీక్షించారు. ప్రయాణిక అభిప్రాయ సేకరణ, కిచెన్ పర్యవేక్షణ, కేటరింగ్ సేవలలో నాణ్యత హామీ సంబంధిత వ్యవస్థల బలోపేతంపై ఈ సందర్భంగా ఆయన దృష్టి సారించారు.
ఇందులో భాగంగా పర్యవేక్షణ, అభిప్రాయ సేకరణ సంబంధిత కార్యకలాపాల కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందంతో ‘సీఆర్‌బీ’ సంభాషించారు. పర్యవేక్షణను మరింత వేగవంతం, సాంకేతికత ఆధారితం, ఫలితాధారితం చేసే దిశగా ప్రస్తుత వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రయాణికులు ఒకే ఒక్క క్లిక్‌తో సులభంగా, సౌకర్యవంతంగా సంబంధిత వ్యవస్థతో సంభాషించేలా ‘రైల్ మదద్’ వినియోగ సదుపాయాన్ని మరింత స్వయంచలితం చేయాలని శ్రీ సతీష్ కుమార్ ఆదేశించారు. ప్రయాణికుల సమస్యలను మరింత సమర్థంగా అర్థం చేసుకుని పరిష్కరించే దిశగా ఫిర్యాదులను నిశితంగా పర్యవేక్షించాలని కూడా చెప్పారు. అంతేకాకుండా అవసరమైన సందర్భాల్లో ప్రయాణికులతో నేరుగా సంభాషించేలా ఏర్పాటు ఉండాలని పేర్కొన్నారు.
తనిఖీ వ్యవస్థల జవాబుదారీతనం బలోపేతం చేయడంతో పాటు ప్రతి తనిఖీ వ్యవస్థ తమ పరిశీలనలో గమనించిన లోపాలను సవివరంగా నమోదు చేయాలన్నారు. అలాగే పనితీరుపైనా విశ్లేషణ కూడా క్రమపద్ధతిలో నమోదు కావాలని సీఆర్‌బీ ఆదేశించారు. తద్వారా వారి పనితీరుపై నిరంతర పర్యవేక్షణ, మూల్యాంకనం సాధ్యం కాగలదని చెప్పారు.
వంటశాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ బలోపేతం
రైల్వే క్యాటరింగ్ వంటశాలకు కెమెరా ఆధారిత పర్యవేక్షణను విస్తరించడంపైనా ఈ సమీక్షలో దృష్టి సారించారు. ప్రస్తుతం, ఈ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం 4 కెమెరా ఫీడ్‌లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని మరింత విస్తృతం చేయడం ద్వారా సమర్థ నిఘా కోసం ముడి పదార్థాల నిల్వ ప్రాంతాలలో పీటీజెడ్ (పాన్-టిల్ట్-జూమ్) కెమెరా సహా అదనపు కెమెరాలను ఏర్పాటు చేయాలని సీఆర్‌బీ ఆదేశించారు.
వంటశాలల పరిస్థితిని, పనితీరును అంచనా వేయడానికి కెమెరా ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను కూడా ఉపయోగిస్తున్నారు. పరిస్థితులు సవ్యంగా లేనట్లు గమనిస్తే తగిన నోటీసు ఇచ్చి, దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. ఈ సమీక్ష సందర్భంగా, తనిఖీ-వీడియో పర్యవేక్షణ ఆధారంగా దక్షిణ మధ్య రైల్వేలోని అనంతపురంలో గల ఒక వంటశాలలో మెరుగుదల అవసరాన్ని గుర్తించారు.
మరోవైపు రోటీ, పరాఠాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనిని ప్రత్యేక సమీక్ష అవసరమైన అంశంగా గుర్తించారు. తదనుగుణంగా లోపాలను గుర్తించి, నాణ్యతలో స్థిరత్వ నిర్ధారణ సహా వాటి తయారీ ప్రక్రియ మొత్తాన్నీ సమగ్రంగా సమీక్షించాలని ఆదేశించారు.
స్వతంత్ర తనిఖీ – హెచ్చరిక చర్యలు
కేటరింగ్ ప్రమాణాలను పాటించడంలో స్వతంత్ర తనిఖీ సంస్థల పాత్రను శ్రీ సతీష్ కుమార్ సమీక్షించారు. అనేక ప్రదేశాలలో ఈ తనిఖీ వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ- తనిఖీ సమర్థంగా, అర్థవంతంగా, ఫలితాధారితంగా ఉండేలా ప్రాధాన్యమిస్తున్నారు. తనిఖీ యంత్రాంగాలు నిర్దిష్ట నాణ్యతకు భరోసా ఇచ్చేలా చూడటం కోసం అసమర్థ సంస్థలపై సమీక్షించి, అవసరమైతే జాబితా నుంచి తొలగించడం సహా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణ-గుర్తింపు వ్యవస్థల వినియోగంపైనా సమావేశంలో చర్చించారు. ఎలుకలు, బొద్దింకల బెడదత, ఇతర లోపాల సంబంధిత ఏఐ ఆధారిత హెచ్చరికలు కేవలం గుర్తింపు వరకే పరిమితం కారాదని సీఆర్‌బీ ఆదేశించారు. ఎప్పటికప్పుడు గుర్తించిన లోపాలపై సకాలంలో దిద్దుబాటు చర్యలకు వీలుగా అలాంటి సంఘటనల తర్వాత తగిన హెచ్చరిక నోటీసులు, నిరోధక చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రైల్వే కేటరింగ్ సేవల నాణ్యత నిరంతర మెరుగుదల, మరింత సమర్థ తనిఖీలు, పటిష్ట సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, సత్వర తదుపరి చర్యల ఆవశ్యకతను కూడా ఈ సమీక్ష స్పష్టం చేసింది. ప్రయాణికుల విశ్వాస బలోపేతం, ఆహార నాణ్యత-పరిశుభ్రత ప్రమాణాల మెరుగుదల సహా భారతీయ రైల్వేల వ్యాప్తంగా మరింత చురుకైన, ప్రయాణిక ప్రాధాన్య కేటరింగ్ వ్యవస్థకు భరోసా ఇవ్వడం ఈ కార్యక్రమాల లక్ష్యం.
***
(रिलीज़ आईडी: 2302948)
आगंतुक पटल : 8