పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

27 రాష్ట్ర జీవవైవిధ్య బోర్డులు, 3 కేంద్రపాలిత ప్రాంత జీవవైవిధ్య మండళ్లకు, కర్ణాటకలోని ఐసీఏఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్‌లకు రూ. 2.82 కోట్ల ఏబీఎస్ నిధులను విడుదల చేసిన ఎన్బీఏ

प्रविष्टि तिथि: 22 AUG 2026 12:49PM by PIB Hyderabad

జీవ వనరుల వినియోగం ద్వారా లభించిన యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ (ఏబీఎస్) యంత్రాంగం కింద జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్బీఏ) రూ. 2.82 కోట్లను విడుదల చేసింది. ఇందులో రూ. 2.80 కోట్లను 27 రాష్ట్ర జీవవైవిధ్య బోర్డులు (ఎస్బీబీ), మూడు కేంద్రపాలిత ప్రాంత జీవవైవిధ్య (యూటీబీసి) మండళ్లకు రూ. 2.80 కోట్లు, కర్ణాటకలోని ఐసిఎఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ కు రూ. 2.01 లక్షలను విడుదల చేస్తున్నారు.

అడ్వాంటా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (గతంలో  యూపీఎల్ లిమిటెడ్) నుంచి ఎనిమిది కాలీఫ్లవర్‌ హైబ్రిడ్లు,  ఐదు మిరప హైబ్రిడ్లు, , ఐదు బెండ హైబ్రిడ్లు, ఆరు టమాటా హైబ్రిడ్లకు సంబంధించిన జన్యు వనరుల వినియోగానికి ప్రతిఫలంగా ఏబీఎస్ కింద రూ. 2.94 కోట్లను ఎన్బీఏ అందుకుంది.

ఈ కేసులో జీవ వనరులను మరో కంపెనీని స్వాధీనం చేసుకోవడం ద్వారా పొందడం వల్ల వాటి ప్రయోజనాలను పొందే నిర్దిష్ట వ్యక్తిగత రైతులు, సముదాయాలు లేదా ఒకే గుర్తించదగిన భౌగోళిక ప్రాంతాన్ని గుర్తించడం సాధ్యం కాలేదు. ఇలాంటి సందర్భాల్లో ప్రయోజన భాగస్వామ్యంగా లభించిన మొత్తాన్ని పంచడం/వినియోగించేందుకు అనుసరించాల్సిన విధానాన్ని సిఫారసు చేయడానికి జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ గతంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం ఆ నిపుణుల కమిటీ చేసిన సిఫారసులకు ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. ఆ మేరకు జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ రూ. 2.80 కోట్లను పంపిణీ చేసింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధిత ఉద్యాన పంటల సాగును పరిగణనలోకి తీసుకుని ఈ నిధులను కేటాయించారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ ప్రధానంగా నిధులు పొందిన రాష్ట్రాల్లో ఉన్నాయి. అత్యధిక వాటాలు పొందిన పది రాష్ట్రాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

వరస నెం.

రాష్ట్రం

విడుదల చేసిన నిధులు (రూ. లక్షలలో )

1

గుజరాత్

44.59

2

వెస్ట్ బెంగాల్

41.24

3

మధ్య ప్రదేశ్

32.73

4

ఒడిశా

32.57

5

బీహార్

30.86

6

ఛత్తీస్ ఘడ్

16.54

7

ఉత్తరప్రదేశ్

12.66

8

ఆంధ్రప్రదేశ్

10.51

9

తమిళనాడు

10.49

10

మహారాష్ట్ర

07.07

11

ఇతరం ( 20 ఎస్బీబీలు/ యూటీబీసీలు)

40.55

రాష్ట్ర జీవవైవిధ్య మండళ్లకు, కేంద్రపాలిత ప్రాంతాల జీవవైవిధ్య మండళ్లకు విడుదల చేసిన నిధులను ప్రజల జీవవైవిధ్య రిజిస్టర్ల (పీబీఆర్) రూపకల్పన, నవీకరణ, జీవావరణాల్లో నూ, జీవావరణాల వెలుపల జీవవైవిధ్య పరిరక్షణ, క్షీణించిన పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ, జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాల బలోపేతం, జీవవైవిధ్య నిర్వహణ కమిటీల సామర్థ్య పెంపు, సమాజాల జీవనోపాధి మెరుగుదల వంటి కార్యక్రమాలకు వినియోగించాలి. నిధులు అందుకున్న ఒక సంవత్సరంలోపు వినియోగ ధ్రువపత్రం, వ్యయ వివరాల నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

ముంబైకి చెందిన  సుమిటోమో కెమికల్ ఇండియా లిమిటెడ్ (గతంలో ఎక్సెల్ క్రాప్ కేర్) నుంచి ఏబిఎస్  కింద ఎన్‌బిఎకు మరో రూ. 7.15 లక్షలు విడిగా అందాయి. కర్ణాటకలోని ఐసిఎఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ నుంచి పొందిన సూడోమోనాస్ ఫ్లోరొసెన్స్ 1% డబ్ల్య్యూపీ (స్ట్రెయిన్ హెచ్హెచ్ఆర్- పీఎఫ్-2), ట్రైకోడెర్మా హార్జియానమ్ 1% డబ్ల్య్యూపీ (స్ట్రెయిన్ ఐఐహెచ్ఆర్ - టీహెచ్ -2) అనే రెండు సూక్ష్మజీవుల రకాలపై పరిశోధన, వాణిజ్యపరమైన వినియోగానికి గాను ఈ మొత్తం సమకూరింది. ఈ కేసులో జీవ వనరులు ప్రభుత్వ పరిశోధనా సంస్థ నుంచి న పొందినవి కావడం వల్ల, నిబంధనల ప్రకారం ఏబిఎస్ మొత్తంలో 30% - రూ. 2.01 లక్షలను సంబంధిత సంస్థ అయిన ఐసీఏ ఆర్ - ఐఐహెచ్ఆర్) కు విడుదల చేస్తున్నారు. మిగిలిన నిధులను జీవవైవిధ్య చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం ఎన్‌బిఎ ఉపయోగించనుంది. 

ఈ నిధులను ఒక సంవత్సరంలోగా డిపాజిటరీలు/రిపాజిటరీల నిర్వహణ, పరిశోధన, జీవవైవిధ్య సర్వే పనులు, వర్గీకరణ,  సంరక్షణలో సామర్థ్య పెంపుదల,  జీవ వనరులు, వాటికి చెందిన అడవి రకాల లోపలి, వెలుపలి సంరక్షణ వంటి కార్యకలాపాలకు సదరు సంస్థ ఉపయోగించాల్సి ఉంటుంది.

జీవవైవిధ్య చట్టం, 2002, దానికి సంబంధించిన నియంత్రణ చట్రం అమలను మరింత బలోపేతం చేసేందుకు ఎన్‌బిఎ  నిరంతరం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ నిధులను విడుదల చేశారు. భారతదేశ జీవ వనరుల వాణిజ్యపరమైన వినియోగం ద్వారా లభించే ప్రయోజనాలను జీవవైవిధ్య సంరక్షణ, దాని సుస్థిర వినియోగం, జీవవైవిధ్య సంరక్షణ, సుస్థిర వినియోగంతో ముడిపడి ఉన్న రైతులు, స్థానిక సమాజాలు, ఇతరుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి మళ్ళించడం దీని ఉద్దేశం. 

ఎన్‌బిఎ  ద్వారా ఇప్పటి వరకు విడుదల చేసిన  ఏబిఎస్  మొత్తం రూ. 185 కోట్లు (19.34 మిలియన్ యుఎస్ డాలర్లు). ఈ చొరవ జీవవైవిధ్య సమ్మేళనం, యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ పై కుదుర్చుకున్న నగోయా ప్రొటోకాల్‌తో పాటు కున్మింగ్-మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్  కింద భారత్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తోడ్పడుతుంది. ముఖ్యంగా టార్గెట్‌-13 ప్రకారం జన్యు వనరులు, వాటికి సంబంధించిన డిజిటల్ సీక్వెన్స్‌ సమాచారాన్ని వినియోగించడం ద్వారా లభించే ప్రయోజనాలను న్యాయబద్ధంగా, సమానంగా పంచుకునేలా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని నిర్దేశిస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2302318) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Gujarati , Urdu , हिन्दी , Tamil