కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ 2026 ఆగస్టు 20, 21 తేదీల్లో మారిషస్ దేశంలో అధికారిక పర్యటన చేపట్టారు.
ఆగస్టు 20న మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీంచంద్ర రామ్‌గూలామ్‌తో కేంద్రమంత్రి భేటీ అయ్యారు. వారి సమక్షంలో చమురు, సహజ వాయువు రంగంలో సహకారానికి భారత్, మారిషస్ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), మారిషస్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్‌టీసీ) మధ్య పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాకు సంబంధించి దీర్ఘకాలిక కొనుగోలు–అమ్మకాల ఒప్పందం కూడా కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం మారిషస్ దిగుమతి చేసుకునే మోటార్ స్పిరిట్ (ఎంఎస్), హై స్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డీ), ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) మొత్తం అవసరాలను ఐఓసీఎల్ సరఫరా చేయనుంది.
చమురు, సహజ వాయువు రంగంలో కుదిరిన ఈ అవగాహన ఒప్పందం ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇంధన భాగస్వామ్యానికి సంస్థాగత రూపాన్ని కల్పిస్తుంది. ఇందులో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, మారిషస్ అధికారులకు శిక్షణ, సామర్థ్య నిర్మాణం, జీవ ఇంధనాల రంగంలో సహకారం వంటి అంశాలు ఉన్నాయి. ఐఓసీఎల్, ఎస్‌టీసీ మధ్య కుదిరిన అయిదేళ్ల ఒప్పందం ద్వారా మారిషస్‌కు దీర్ఘకాలికంగా హామీతో కూడిన ఇంధన సరఫరా లభించడంతో పాటు, సరఫరా భద్రత కల్పిస్తుంది. ధరల్లో హెచ్చుతగ్గుల ప్రభావం నుంచి కూడా ఈ ఒప్పందం మారిషస్‌ను రక్షించనుంది. ఇటీవలి సంవత్సరాల్లో దక్షిణాసియా వెలుపల భారత ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ కుదుర్చుకున్న తొలి దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం ఇదే.
పర్యటనలో భాగంగా ఇంధనం, ప్రజా వినియోగ సేవల శాఖ మంత్రి ప్యాట్రిక్ గెర్వైస్ అసిర్వాడెన్.. వాణిజ్యం, వినియోగదారుల రక్షణ శాఖ మంత్రి జాన్ మైఖేల్ ట్జౌన్ సావో యెంగ్ సిక్ యుయెన్.. విదేశాంగ, ప్రాంతీయ సమైక్యత, అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి ధనంజయ్ రామ్‌ఫుల్‌తో కేంద్రమంత్రి శ్రీ పూరి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అలాగే పోర్ట్ లూయిస్‌లోని మెర్ రూజ్ వద్ద ఇండియా ఆయిల్ (మారిషస్) లిమిటెడ్‌కు చెందిన 27.5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల బంకర్ మెరైన్ ఇంధన నిల్వ సదుపాయానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశ్వసనీయ ఇంధన భాగస్వామిగా భారత్ పాత్ర మరింత విస్తరణ
ప్రపంచంలోనే ప్రధాన చమురు శుద్ధి కేంద్రంగా భారత్ ఎదిగింది. దేశంలోని 23 శుద్ధి కర్మాగారాల ద్వారా ఏటా 267 మిలియన్ మెట్రిక్ టన్నుల శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ, శుద్ధి చేసిన ఉత్పత్తుల విషయంలో నికర ఎగుమతిదారుగా భారత్ నిలిచింది. ఇప్పటికే నేపాల్, భూటాన్‌ల పెట్రోలియం అవసరాలను భారత్ తీరుస్తుండగా, ప్రాంతీయంగా, ఇతర దేశాలకు కూడా గణనీయమైన పరిమాణంలో సరఫరా చేస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం సమయంలోనూ నేపాల్, భూటాన్‌లకు తన సరఫరా హామీలను భారత్ నెరవేర్చింది. తద్వారా ఈ ప్రాంతానికి విశ్వసనీయ ఇంధన భద్రతా భాగస్వామిగా భారత్ నిలిచింది. మారిషస్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా ఆ దేశానికి ప్రధాన ఇంధన సరఫరాదారుగా భారత్ స్థానం బలోపేతం కావడంతో పాటు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక, ఆర్థిక ప్రభావం మరింత విస్తరించనుంది.
జీవ ఇంధన రంగంలోనూ సహకారానికి ఒప్పందం
కుదిరిన అవగాహన ఒప్పందం ద్వారా జీవ ఇంధనాల రంగంలోనూ సహకారం విస్తరించనుంది. ఇందులో జ్ఞాన మార్పిడి, పరిశోధన, శిక్షణ వంటి అంశాలు ఉన్నాయి. భారత్ చొరవతో, జీ20 అధ్యక్షత సమయంలో ప్రారంభించిన గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ (జీబీఏ) వ్యవస్థాపక సభ్య దేశాల్లో మారిషస్ కూడా ఒకటి. దేశాల భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా మారిషస్ కోసం జీవ ఇంధనాల దేశీయ విధాన రూపకల్పనకు సంబంధించిన విధానాలను అభివృద్ధి చేయడంలో జీబీఏ సచివాలయం, మారిషస్ ఇంధనం–ప్రజా వినియోగ సేవల మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తోంది.
ఆగస్టు 21న కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ, మారిషస్ మంత్రి ప్యాట్రిక్ గెర్వైస్ అసిర్వాడెన్ సంయుక్తంగా జీవ ఇంధనాల దేశీయ విధాన వ్యవస్థను ప్రారంభించారు. జీవ ఇంధనాల ద్వారా ఇంధన మార్పిడికి ఉన్న అవకాశాలను అన్వేషించే దిశగా మారిషస్‌కు ఇది తొలి ప్రయత్నంగా నిలిచింది.
***