కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికమ్యూనికేషన్లు, ఐసీటీ రంగాల్లో ద్వైపాక్షిక సహకార బలోపేతం లక్ష్యంగా భారత్-బ్రెజిల్ మధ్య అవగాహన ఒప్పందం
పూణేలో జరిగిన బ్రిక్స్ ఐసీటీ ట్రాక్ సమావేశం సందర్భంగా ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్-బ్రెజిల్ కమ్యూనికేషన్ శాఖల మంత్రులు
प्रविष्टि तिथि:
21 AUG 2026 5:15PM by PIB Hyderabad
పూణేలో జరిగిన బ్రిక్స్ ఐసీటీ ట్రాక్ సమావేశం సందర్భంగా... టెలికమ్యూనికేషన్లు, సమాచార- కమ్యూనికేషన్ సాంకేతికతల (ఐసీటీ) రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడం లక్ష్యంగా భారత్, బ్రెజిల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఆయా రంగాల్లో పరస్పర సహకారం పట్ల తమ నిబద్ధతను ఇరు దేశాలూ పునరుద్ఘాటించాయి.
ఇరు దేశాల కమ్యూనికేషన్ శాఖల మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, శ్రీ ఫ్రెడెరికో డి సిక్వేరా ఫిల్హో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
డిజిటల్ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహించడం... ముఖ్యంగా టెలికమ్యూనికేషన్లు, ఐసీటీ వంటి వ్యూహాత్మక, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో భారత్-బ్రెజిల్ భాగస్వామ్య నిబద్ధతను ఈ ద్వైపాక్షిక సహకారం స్పష్టం చేస్తుంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా మాట్లాడుతూ “ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం భారత్-బ్రెజిల్ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. సార్వత్రిక అనుసంధానం, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, సామర్థ్యాలను పెంపొందించడం, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం వంటి రంగాల్లో గొప్ప సహకారానికి ఇది మార్గం సుగమం చేస్తుందని నేను కచ్చితంగా నమ్ముతున్నా” అని అన్నారు.
సమగ్ర ఐసీటీ సహకారం కోసం విధాన ప్రణాళిక
ఈ అవగాహన ఒప్పందం టెలికమ్యూనికేషన్లు, ఐసీటీ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి విధాన ప్రణాళికను రూపొందిస్తుంది. సమానత్వం, పరస్పర ప్రయోజనం, పరస్పర గౌరవం అనే సూత్రాల ఆధారంగా పరస్పర ప్రయోజనకరమైన అవకాశాలను అన్వేషిస్తూ... సమాచారం, అనుభవాలు, ఉత్తమ పద్ధతులను నిరంతరం పంచుకునేలా ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది.
సహకారం, టెలికమ్యూనికేషన్ల విధానాలు, నిబంధనలు, కృత్రిమ మేధ, 5జీ-6జీ, ఓపెన్ ఆర్ఏఎన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డైరెక్ట్-టు-డివైస్ కనెక్టివిటీ, లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలు, నాన్- టెరిస్ట్రియల్ నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రమ్, ఉపగ్రహ/కక్ష్య నిర్వహణ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆప్టికల్ ఫైబర్, సబ్ మెరైన్ కేబుళ్ల వంటి అనేక రకాల వ్యూహాత్మక, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఈ అవగాహన ఒప్పందం కిందికి వస్తాయి.
సైబర్ సెక్యూరిటీ, సార్వత్రిక-అర్థవంతమైన అనుసంధానం, డిజిటల్ సమ్మిళితం, వినియోగదారుల రక్షణ, ప్రైవేట్ నెట్‌వర్క్‌లు, డిజిటల్ పరివర్తన, ఐసీటీల పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం వంటి కీలక రంగాలను ఈ విధాన ప్రణాళిక కవర్ చేస్తుంది.
టెలి కమ్యూనికేషన్లు, ఐసీటీ రంగాల్లో భారత్- బ్రెజిల్ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందం కీలకమైన ముందడుగు అవుతుంది. ఇది వర్ధమాన సాంకేతికతలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ, కనెక్టివిటీ, సామర్థ్యాలను పెంపొందించడం, అంతర్జాతీయ సహకారం వంటి రంగాల్లో సమన్వయం కోసం ఒక సమగ్రమైన, దూరదృష్టితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2302073)
आगंतुक पटल : 15