ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్‌లో పాన్ మసాలాను, పొగాకును తయారు చేస్తున్న నెట్‌వర్క్ గుట్టు రట్టు చేసిన డీజీజీఐ
లెక్కల్లో చూపని ప్యాకెట్ తయారీ యంత్రాలు 27 జప్తు..
సుమారు రూ. 185 కోట్ల పన్ను ఎగవేత వైనం వెలుగు లోకి...
యజమాని అరెస్టు.. జ్యుడీషియల్ కస్టడీకి రిమాండు;
చిత్రకూట్, బాందాల్లో ఆరు చోట్ల 15.5 లక్షల ప్యాకెట్ల సరుకు స్వాధీనం
పాన్ మసాలాకు వర్తించే ‘2025 హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ యాక్టు’ (హెచ్ఎస్ఎన్ఎస్) కింద
సామర్థ్య ఆధారిత సెస్సు, పన్నుల వసూలు విధానం;
నమిలే రకం పొగాకు, జర్దా, గుట్కాలపై ‘1944 సెంట్రల్ ఎక్సయిజ్ యాక్టు’ కింద
సెంట్రల్ ఎక్సయిజ్ సెస్..
ఈ రెండూ 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి
2026 ఫిబ్రవరి 1 నుంచి 27 కేసులను నమోదు చేసిన డీజీజీఐ బృందాలు..
సరుకు దాచిపెట్టడం, గుట్టుగా తరలించడం, రూ.668 కోట్ల విలువైన పన్ను, సుంకాలు, సెస్సును ఎగవేసిన వ్యవహారం తెర మీదకు..
131 పౌచ్ ప్యాకింగ్ యంత్రాల స్వాధీనం.. 17 మంది అరెస్టు
प्रविष्टि तिथि:
21 AUG 2026 1:48PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్, బాందా జిల్లాల్లో ఆరు చోట్లకు విస్తరించి ఉన్న పాన్ మసాలా, పరిమళ జర్దా, గుట్కాలను తయారు చేస్తున్న కేంద్రాల గుట్టును జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీజీఐ) లఖ్‌నవూ జోనల్ యూనిట్టు రట్టు చేసింది. లక్నో జోనల్ యూనిట్టుకు అందిన నిర్దిష్ట రహస్య సమాచారం ఆధారంగా, అధికారులు ఈ నెల 18 అర్ధరాత్రి ఆయా చోట్ల సమన్వయ పూర్వక సోదాలు నిర్వహించారు. ఈ కేంద్రాలకు రెండు సంస్థలతో అనుబంధం ఉంది. వాటిలో ఒకటి పాన్ మసాలా, తత్సంబంధిత ఉత్పాదనల తయారీలోనూ, మరొకటి వాణిజ్యంలో నిమగ్నమయ్యాయని బయటపడింది.
లెక్కల్లో చూపని 27 పౌచ్ ప్యాకింగ్ యంత్రాల జాడను సోదాల్లో గుర్తించారు. వాటిలో సుగంధ జర్దాకు సంబంధించిన 6 యంత్రాలు, పాన్ మసాలాకు సంబంధించినవి 9 యంత్రాలు, దోహరా, దేశీ గుట్కా కు సంబంధించిన 12 యంత్రాలు ఉన్నాయి. వక్కలను నూరే, కలిపే, ఎండబెట్టే యంత్రాలను కూడా చూశారు. ఈ క్రమంలో పాన్ మసాలా, నమిలే రకం పొగాకు, పరిమళభరిత జర్దా, సుగంధ భరిత వక్క నింపిన 15,50,922 పొట్లాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ముడి పదార్థం, ప్యాకింగ్ సామగ్రిలో.. 32.9 మెట్రిక్ టన్ను (ఎమ్‌టీ)ల వక్క, పోకచెక్కలు, 2.8 ఎమ్‌టీల పొగాకు, 8.4 ఎమ్‌టీ ప్యాకింగ్ సామగ్రి, పౌచ్‌లు, పొరలు, 470 కిలోల కథ్తా పొడి, 850 కిలోల గ్లిసరిన్, 545 కిలోల ఎసెన్సుతో పాటు ప్యాకింగ్ ప్రక్రియ పూర్తి కాని 256 కిలోల పాన్ మసాలా కూడా ఉంది. దాదాపు రూ.185 కోట్ల జీఎస్‌టీ, హెచ్ఎస్ఎన్ఎస్ సెస్సు, కేంద్ర ఎక్సయిజ్ సుంకాల ఎగవేత జరిగినట్లు గుర్తించారు.
దొరికిన సాక్ష్యాలను బట్టి.. నమోదు చేయని స్థలాల్లో ఓ నెట్‌వర్క్ ద్వారా లెక్కల్లో చూపించని యంత్రసామగ్రిని ఉపయోగిస్తున్నారనీ, తయారు చేసిన సరుకులను జీఎస్‌టీ, హెచ్ఎస్ఎన్ఎస్ సెస్సు, కేంద్ర ఎక్సయిజ్ సుంకాలేవీ చెల్లించకుండా గోప్యంగా తరలిస్తున్నారనీ ఈ ఆపరేషన్ ద్వారా తేలింది. తయారీ సంస్థ యజమాని చట్టవిరుద్ధ ఉత్పాదన, క్లియరెన్సులకు పథక రచన చేయడంతో పాటు పథకాన్ని ఆచరణలో పెడుతున్నాడని విచారించక ముందే తెలిసిపోయింది. యజమానిని ఈ నెల 19న ‘2025 హెచ్ఎస్ఎన్ఎస్ చట్టం’లోని 26వ సెక్షన్‌తో పాటు, ‘1944 సెంట్రల్ ఎక్సయిజ్ యాక్టు’లోని 13వ సెక్షన్‌ల కింద అరెస్టు చేసి, లఖ్‌నవూ స్పెషల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (కస్టమ్స్) ఎదుట హాజరు పరిచారు. స్పెషల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అతడిని జ్యుడీషియల్ కస్టడీకి రిమాండు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇక మీదట కూడా మరింత సామగ్రిని జప్తు చేసేందుకు అవకాశం ఉంది.
పాన్ మసాలా, పొగాకు రంగంలో ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి సామర్థ్య ఆధారిత సెస్సుతో పాటు పన్నుల వసూలు విధానాన్ని అమలు చేస్తున్నారు. ‘2025 హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ యాక్ట్’ (హెచ్ఎస్ఎన్ఎస్)లో భాగంగా పాన్ మసాలాపై సామర్థ్య ఆధారిత నెలవారీ సెస్సును విధిస్తున్నారు. స్థాపించిన ప్యాకేజింగ్ యంత్రాల సంఖ్య, రకం, సామర్థ్యం ఆధారంగా ఈ సెస్సును నిర్ధారిస్తున్నారు. ఇదే మాదిరిగా, ‘1944 సెంట్రల్ ఎక్సయిజ్ యాక్టు’లో భాగంగా నమిలే రకం పొగాకు, జర్దా, గుట్కాల పైన కూడా సామర్థ్య ఆధారిత సెంట్రల్ ఎక్సయిజ్ సెస్సును వర్తింప చేస్తున్నారు. నిజాయతీ లోపించిన తయారీదారు సంస్థలు యంత్రాలను లెక్కలలో చూపించకుండా దొంగతనంగా ఉపయోగిస్తూ, ఈ పన్నుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, డీజీజీఐ తన బృందాలతో డేటా విశ్లేషణనూ, క్షేత్ర వారీ సమన్వయ పూర్వక కార్యకలాపాలనూ చేపడుతూ ఈ రంగంలో గోప్య సమాచార ఆధారిత దాడుల్ని తరచుగా చేపడుతోంది.
2026 ఫిబ్రవరి 1 మొదలు డీజీజీఐ బృందాలు.. దేశంలో వివిధ ప్రాంతాల్లో సరుకును దాచి ఉంచిన, దొంగచాటుగా తరలించిన, చెల్లించాల్సిన పన్నులను చెల్లించని కేసులను ఇరవై ఏడింటిని నమోదు చేశాయి. ఈ కేసుల్లో రూ.668 కోట్ల మేరకు పన్నులను ఎగవేశారని తేలింది. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో, రూ.11.7 కోట్ల మేరకు స్వచ్ఛంద చెల్లింపులు నమోదయ్యాయి. 131 పౌచ్ ప్యాకింగ్ యంత్రాలను జప్తు చేసి, 17 మందిని అరెస్టు చేశారు.
***
(रिलीज़ आईडी: 2302069)
आगंतुक पटल : 3