వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉన్నత స్థాయి భేటీలతో భారత్-సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్

సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌‌తో శ్రీ పీయూష్ గోయల్ భేటీ

4వ భారత్-సింగపూర్ మంత్రివర్గ స్థాయి, వాణిజ్యంపై ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొన్న కేంద్రమంత్రి

భారత్-సింగపూర్ వాణిజ్య,పెట్టుబడుల సహకార బలోపేతానికి జీ2బీ సమావేశాలు

నాడు పోస్టు చేయడమైనది: 20 AUG 2026 5:09PM by PIB Hyderabad

2026 ఆగస్టు 20న సింగపూర్‌లో పలు ఉన్నతస్థాయి ద్వైపాక్షిక, వ్యాపార సమావేశాల్లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పాల్గొన్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న భారత్-సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, వ్యాపార రంగాల్లో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ సమావేశాలు జరిగాయి.

పర్యటనలో భాగంగా తొలుత ఇస్తానాలో సింగపూర్ ప్రధానమంత్రి శ్రీ లారెన్స్ వాంగ్‌తో  శ్రీ పీయూష్ గోయల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం షాంగ్రిలా హోటల్‌లో జరిగిన 4వ భారత్-సింగపూర్ మంత్రుల స్థాయి రౌండ్‌టేబుల్ (ఐఎస్ఎంఆర్), 4వ భారత్-సింగపూర్ వాణిజ్య (ఐఎస్‌బీఆర్) సమావేశాల్లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలు, పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి కొత్త అవకాశాలను గుర్తించడం వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు. ఈ సమావేశాల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాల కార్యక్రమం జరిగింది.

ప్రపంచ ఆర్థిక, సాంకేతిక వ్యవస్థ (జీఎఫ్‌టీఎన్), కెపెల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలతో పాటు అంతర్జాతీయ వ్యాపార, సంస్థాగత రంగాలకు చెందిన సీనియర్ ప్రతినిధులతో మధ్యాహ్నం శ్రీ పీయూష్ గోయల్ వరుసగా ప్రభుత్వ-వ్యాపార (జీ2బీ) సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, జీసీసీ ఆధారిత వాణిజ్య పార్కులు, ఫిన్‌టెక్, సుస్థిర మౌలిక వసతులు వంటి రంగాల్లో భారత్, సింగపూర్ సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశాల్లో చర్చించారు.

సింగపూర్ విదేశాంగ, వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయ మంత్రి శ్రీమతి గాన్ సియో హువాంగ్‌తో కలిసి సిటీ స్క్వేర్ మాల్‌లో ఏపీఈడీఏ-ఫెయిర్‌ప్రైస్  కార్యక్రమాన్ని శ్రీ గోయల్ సందర్శించారు. భారత్, సింగపూర్ మధ్య పెరుగుతున్న వ్యవసాయ వాణిజ్యం, విస్తరిస్తున్న మార్కెట్ అనుసంధానాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. 

 

ఫిక్కీ (ఎఫ్‌ఐసీసీఐ) ఆధ్వర్యంలో ఇన్‌సీడ్‌ ఆసియా క్యాంపస్‌లో నిర్వహించిన భారత్, సింగపూర్ వ్యాపార వేదికలో శ్రీ పీయూష్‌ గోయల్ పాల్గొన్నారు. “నూతన ప్రపంచ వృద్ధి సమీకరణంలో భారత్: ఆసియా, ప్రపంచంలోని వ్యాపారాలకు వృద్ధి, అవకాశాలు” అనే అంశంపై జరిగిన ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వ్యాపార వర్గాల ప్రతినిధులతో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొని వారి సందేహాలకు సమాధానమిచ్చారు.

 

ఈ వరుస సమావేశాలు భారత్, సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యంలో కొనసాగుతున్న బలమైన పురోగతిని మరోసారి చాటిచెప్పాయి. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, వ్యాపార సంస్థల మధ్య సంబంధాలను మరింతగా విస్తరించడంతో పాటు పరస్పర ప్రయోజనకరమైన వృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించేందుకు భారత్ కట్టుబడి ఉందని ఈ కార్యక్రమాలు స్పష్టం చేశాయి. 

 

4వ భారత్–సింగపూర్ మంత్రివర్గ స్థాయి సమావేశంలో భారత ప్రతినిధి బృందంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్ జైశంకర్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్, వాణిజ్యశాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద పాల్గొన్నారు. సింగపూర్ బృందంలో ఉప ప్రధాని, వాణిజ్య–పరిశ్రమల మంత్రి శ్రీ గాన్ కిమ్ యోంగ్, సీనియర్ మంత్రి, జాతీయ భద్రత సమన్వయ, హోం వ్యవహారాల మంత్రి శ్రీ కే షణ్ముగం, విదేశాంగ మంత్రి డాక్టర్‌ వివియన్ బాలకృష్ణన్, డిజిటల్ అభివృద్ధి, సమాచార శాఖ మంత్రి శ్రీమతి జోసెఫిన్ టియో, రవాణా, ఆర్థికశాఖ రెండో సహాయ మంత్రి శ్రీ జెఫ్రీ సియో పాల్గొన్నారు.

 

****


(రిలీజ్ ఐడి: 2301770) సందర్శకుల సూచీ సంఖ్య : : 55
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Malayalam