వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంకుర వ్యవస్థను బలోపేతం చేయడానికీ, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికీ ఫోన్‌ పే, షెల్ ఇండియాలతో డీపీఐఐటీ అవగాహనా ఒప్పందాలు

నాడు పోస్టు చేయడమైనది: 20 AUG 2026 5:40PM by PIB Hyderabad

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమల,  అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ)  గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు మరింత మద్దతు అందించడానికి, ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఫోన్‌ పే, షెల్ ఇండియా సంస్థలతో అవగాహన ఒప్పందాలపై డీపీఐఐటీ సంతకం చేసింది.

దేశంలో బలమైన, సమ్మిళిత, స్వావలంబన కలిగిన స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహిస్తూ సాంకేతికత, డిజిటల్ మౌలిక సదుపాయాలు, మార్గదర్శకత్వం, మార్కెట్ అవకాశాలు,  పరిశ్రమల అనుసంధాన లభ్యతను పెంచడం ఈ ఒప్పందాల లక్ష్యం. 

ఫోన్‌ పేతో  భాగస్వామ్యం కింద, డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్‌లకు ఫోన్‌పే వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో పేమెంట్ గేట్‌వే ద్వారా లావాదేవీ క్రెడిట్‌లు, ఇండస్ యాప్‌స్టోర్  లభ్యత, ప్రత్యేక ఆన్‌బోర్డింగ్, సహాయక సేవలతో పాటు బ్రాండ్ గుర్తింపును పెంచుకునే అవకాశాలు లభిస్తాయి. స్టార్టప్‌లు తమ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి, వేగవంతమైన వృద్ధిని సాధించడానికి  ఫిన్‌టెక్, సేల్స్, గో-టు-మార్కెట్ వ్యూహాలు, వ్యాపార విస్తరణ వంటి అంశాలపై క్రమం తప్పకుండా మాస్టర్‌క్లాస్‌లు, వెబ్‌నార్‌లను కూడా ఫోన్ పే నిర్వహిస్తుంది. 

షెల్ ఇండియా తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం  ప్రధానంగా ఇంధన, వాతావరణ - సాంకేతిక  రంగాలలో పనిచేస్తున్న స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా షెల్ ఇండియా మార్గదర్శకత్వం, వ్యూహాత్మక సలహాలు, పెట్టుబడిదారులు, ఇన్‌క్యుబేటర్లతో అనుసంధానం అందించడంతో పాటు షెల్ ఇ4 స్మార్ట్ ఎనర్జీ ట్రాక్ లో పాల్గొనే అవకాశాలను కూడా కల్పిస్తుంది. ఈ కార్యక్రమం స్టార్టప్‌లకు వృద్ధి అవకాశాలను అందుకోవడానికి, వినూత్న పరిష్కారాలను విస్తరించడానికి, భారత స్వచ్ఛ ఇంధన మార్పునకు సహాయపడుతుందని భావిస్తున్నారు.

ఇంధన, వాతావరణ సంబంధ సాంకేతిక స్టార్టప్ వ్యవస్థలోని కొత్త ఆవిష్కరణలు, ఉత్తమ విధానాలను తెలియజెప్పే విభాగాల వారీ విజయగాధలు, శ్వేత పత్రాలు, విధానాల గురించి వివరణలు, పరిశ్రమ సంబంధ నివేదికలు, కేస్ స్టడీల ద్వారా విజ్ఞాన మార్పిడిని, స్టార్టప్ వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించడానికి కూడా షెల్ ఇండియాతో ఒప్పందం దోహదపడుతుంది. 

మొత్తంమీద ఈ భాగస్వామ్యాలు స్టార్టప్‌లకు డిజిటల్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగానికి చెందిన విజ్ఞానం, మార్గదర్శకత్వం మార్కెట్ అనుసంధానాలు, పెట్టుబడి అవకాశాల లభ్యతను బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. తద్వారా స్టార్టప్‌లు స్థిరంగా వృద్ధి చెందడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, భారత ఆర్థిక వృద్ధికి, సాంకేతిక పురోగతికి  ఎంతగానో దోహదపడతాయి. 

 

***


(రిలీజ్ ఐడి: 2301763) సందర్శకుల సూచీ సంఖ్య : : 58
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil