కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భౌతిక మౌలిక వసతుల నుంచి ప్రజా-సాంకేతిక వ్యవస్థల వైపు: ప్రపంచానికి అద్భుతమైన అభివృద్ధి నమూనాను అందిస్తున్న భారత్: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని
గ్లోబల్ సౌత్ దేశాల సుస్థిర అభివృద్ధికి డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు విలాసం కాదు, అత్యంత ఆవశ్యకం: కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని
పుణేలో జరిగిన బ్రిక్స్ ఐసీటీ సదస్సులో డిజిటల్, సమాచార-సాంకేతిక వ్యవస్థలపై కీలక ఉపన్యాసం చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని
प्रविष्टि तिथि:
20 AUG 2026 4:10PM by PIB Vijayawada
పుణే వేదికగా జరిగిన బ్రిక్స్ ఐసీటీ సదస్సులోని "సుస్థిర, స్థితిస్థాపక డిజిటల్, సమాచార-సాంకేతిక వ్యవస్థలు: సమాజంపై ప్రభావం చూపే డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు - ప్రజా సేవలు, ఆర్థిక పురోగతికి ఊతమివ్వడంలో గ్లోబల్ సౌత్ అనుభవాలు" అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక చర్చా వేదికపై కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం కీలక ఉపన్యాసం చేశారు.

ఈ సదస్సులో పాల్గొన్న బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు, విధానకర్తలు, విద్యావేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన అంతర్జాతీయ ప్రతినిధుల బృందాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడారు. పౌరుల సాధికారతకు, దేశ ఆర్థిక పురోగతికి ఊతమిచ్చేలా భారత్ రూపొందించిన బహిరంగ, అందరికీ అందుబాటులో ఉండే సురక్షిత డిజిటల్ నిర్మాణాల పట్ల భారతదేశ వ్యూహాత్మక దృక్పథాన్ని కేంద్ర సహాయ మంత్రి వివరించారు.
భారతదేశ సాంకేతిక ప్రగతిని ప్రస్తావిస్తూ—గతంలో మౌలిక వసతులు అంటే కేవలం రోడ్లు, నౌకాశ్రయాలు, విద్యుత్ గ్రిడ్‌ల వంటి భౌతిక ఆస్తులేననే భావన ఉండేదని; కానీ నేడు భారత్ ఆధార్ గుర్తింపు, బ్యాంకింగ్, చెల్లింపులు, డిజిటల్ పత్రాలు, పౌరుల సమ్మతితో కూడిన డేటా భద్రత ప్రాతిపదికగా విస్తృతస్థాయి డిజిటల్ వ్యవస్థను నిర్మించి ప్రపంచానికి ఒక నూతన నమూనాను చూపిందని ఆయన తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అందుబాటులోకి తెచ్చిన ఈ బహిరంగ పబ్లిక్ డిజిటల్ వేదిక ద్వారానే బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు పౌరులకు వేగవంతమైన సేవలు అందించగలుగుతున్నాయని, ఇదే అసలైన సాంకేతిక విప్లవమని ఆయన పేర్కొన్నారు.
భారత డిజిటల్ ప్రజా మౌలిక వసతుల (DPI) కీలక అంశాలను వివరిస్తూ, ఈ డిజిటల్ గుర్తింపు వ్యవస్థ వల్ల బిలియన్ల కొద్దీ సేవలు, సిమ్ కార్డుల జారీ, బ్యాంకింగ్ అనుసంధానం అత్యంత తక్కువ ఖర్చుతో పారదర్శకంగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. చెల్లింపుల రంగంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ - UPI) విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, 720 బ్యాంకులను అనుసంధానిస్తూ దేశంలోని 85% డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తోందని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్త రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 49% ఒక్క భారత్‌లోనే జరుగుతున్నాయని, ఇప్పటికే దీనిని తొమ్మిది భాగస్వామ్య దేశాలకు విస్తరించామని వివరించారు.

56 కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 318 సంక్షేమ పథకాలను అనుసంధానించి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు నగదు బదిలీ చేసే 'డీబీటీ' (DBT) వ్యవస్థతో పాటు, 70 కోట్లకు పైగా వినియోగదారులు, 900 కోట్ల డిజిటల్ ధ్రువీకరణ పత్రాలను పంచుకునే 'డిజిలాకర్' (DigiLocker) వ్యవస్థ తెచ్చిన మార్పులను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. వీటితో పాటు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC), ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM), అకౌంట్ అగ్రిగేటర్ వంటి నూతన కార్యక్రమాలు చిన్న వ్యాపారులకు మార్కెట్ అవకాశాలను పెంచుతూ పౌరుల డేటా భద్రతను బలోపేతం చేస్తున్నాయన్నారు.
ఈ సాఫ్ట్‌వేర్ వినూత్న విప్లవానికి తోడుగా దేశంలో టెలికాం రంగం వేగంగా విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. 4 బిలియన్ డాలర్ల నిధులతో చేపట్టిన ప్రాజెక్టు ద్వారా దేశంలోని దాదాపు 99% గ్రామాలకు 4G సేవలు విస్తరించాయని, అలాగే 5 లక్షలకు పైగా బేస్ స్టేషన్ల ఏర్పాటుతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5G సేవలను భారత్ అందుబాటులోకి తెచ్చిందని పునరుద్ఘాటించారు. దీనికి తోడు 17 బిలియన్ డాలర్ల 'భారత్‌నెట్' (BharatNet) ప్రాజెక్టు ద్వారా ప్రతి ప్రధాన గ్రామానికి అత్యధిక వేగవంతమైన ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, 2030 నాటికి 30% టెలికాం రంగాన్ని పునరుత్పాదక ఇంధనంతో నడపాలనే లక్ష్యానికి అనుగుణంగా, ఇప్పటికే 12.4% మొబైల్ టవర్లలో హరిత ఇంధనాన్ని వినియోగిస్తున్నామని డాక్టర్ పెమ్మసాని వివరించారు.
తన ప్రసంగాన్ని ముగిస్తూ—డిజిటల్ ప్రజా మౌలిక వసతులు అనేవి కేవలం అభివృద్ధి చెందిన ధనిక దేశాలకు మాత్రమే పరిమితమైన విలాసం కాదని, గ్లోబల్ సౌత్ అభివృద్ధి చెందుతున్న దేశాల సుస్థిర పురోగతికి అవి అత్యంత ఆవశ్యకమని ఉద్ఘాటించారు. భారీ లైసెన్సింగ్ రుసుముల భారం లేకుండా ఉచిత, బహిరంగ మూలాల (ఓపెన్-సోర్స్) సాంకేతిక చట్రాలను బ్రిక్స్ దేశాలు ఒకరికొకరు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సాంకేతిక ప్రామాణిక మండలుల్లో గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం లభించేలా ఉమ్మడి సామర్థ్య పెంపుదల కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.

ఈ ప్యానెల్ చర్చా సదస్సులో బ్రెజిల్ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఫెడెరికో డి సిక్వేరా ఫిల్హో, దక్షిణాఫ్రికా సమాచార, డిజిటల్ సాంకేతికతల శాఖ డిప్యూటీ మంత్రి మోండ్లి గుంగుబేలేతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
*****
(रिलीज़ आईडी: 2301626)
आगंतुक पटल : 16