గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
చెత్త పారబోస్తున్న భూమిలో వనాల పెంపకం: 22 ఎకరాల నేలను మియావాకీ శైలిలో తీర్చిదిద్దిన రాయచూరు
प्रविष्टि तिथि:
18 AUG 2026 2:40PM by PIB Hyderabad
‘స్వచ్ఛ్ భారత్ మిషన్-పట్టణ 2.0’ (ఎస్‌బీఎమ్-యూ 2.0)లో భాగంగా పాత చెత్తను శాస్త్రీయ పద్ధతిలో సంస్కరించి, 35 ఎకరాల్లో విస్తరించిన యాకలాస్‌పురా వ్యర్థాల పారబోత స్థలాన్ని హరిత సంపదగా కర్ణాటకలోని రాయచూరు తీర్చిదిద్దింది. ఇంతవరకు సుమారు 62,252 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేశారు. దాదాపు 22 ఎకరాల అతి విలువైన పట్టణ భూమిని ఉపయోగ యోగ్యం చేశారు. పునరుద్ధరించిన స్థలం ప్రస్తుతం నిరంతర ప్రాతిపదికన భూ ఉపయోగానికి వీలుగా తయారైంది. దీనిలో ఆకట్టుకొనే మియావాకీ వనాన్ని కూడా పెంచుతున్నారు. ఇది చెత్తకుప్పలు నిల్వ చేసే చోటును చక్కనైన పర్యావరణ స్థలాలుగా ఎలా మార్చవచ్చో తెలియజెబుతోంది.

భారత్ నలుమూలలా పట్టణాల్లో చెత్తను పారవేయడానికి వాడుతున్న పాత స్థలాలను ఉత్పాదకమైన, పర్యావరణానికి అనుకూలమైన స్థలాలుగా మార్చే పనులను ఎస్‌బీఎమ్-యూ 2.0లో భాగంగా చేపడుతున్నారు. ఈ దార్శనికతతో కర్ణాటకలోని రాయచూరులో యాకలాస్‌పురా వ్యర్థాల పారబోత ప్రదేశాన్ని విజయవంతంగా పునరుద్ధరించడం సాధ్యపడింది. ఒకప్పుడు ఈ ప్రదేశం పర్యావరణ కాలుష్యానికి ప్రతీకగా ఉండింది. ఇప్పుడు పర్యావరణ పునరుద్ధరణకు, మన్నికైన పట్టణాభివృద్ధికి ఒక నమూనాగా పేరు తెచ్చుకుంటోంది.
ముప్ఫయ్ అయిదు ఎకరాల్లో విస్తరించిన యాకలాస్‌పురా ప్రాంతంలో దశాబ్దాల తరబడి మ్యునిసిపల్ ఘన వ్యర్థాలతో పేరుకుపోయింది. దీంతో చుట్టుపక్కల ప్రజలకు గంభీర పర్యావరణ సంబంధ సమస్యలు, ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తాయి. చెత్త గుట్టలు గుట్టలుగా మారి, అత్యంత ఖరీదైన పట్టణ భూమిని ఆక్రమించేస్తూ పోవడమే కాకుండా కలుసిత జలం, దుర్వాసన, చెత్త వల్ల ఎదురయ్యే పర్యావరణ కాలుష్యం కారణంగా అపాయకర పరిస్థితులు ఏర్పడ్డాయి. తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించిన రాయచూర్ సిటీ కార్పొరేషన్ శాస్త్రీయ పద్ధతిలో చెత్త నిర్మూలన ప్రాజెక్టును చేపట్టింది.
శాస్త్రీయ పద్ధతిలో 62,252 మెట్రిక్ టన్నుల పాత చెత్తను శుద్ధి చేసి, భూమిని పునరుపయోగానికి తగ్గట్లు మార్చారు. ఈ ప్రాజెక్టుతో దాదాపు 22 ఎకరాల విలువైన పట్టణ భూమిని పునరుద్ధరించగలిగారు. అంతేకాక, పర్యావరణ సంబంధిత అపాయాలను చాలావరకూ తగ్గించగలిగారు. పరిసర భూభాగాలు మెరుగుపడటానికి ఇది దోహదం చేసింది. చెత్తకుప్పలను విజయవంతంగా తొలగించడం పారిశుధ్య, పర్యావరణ నిర్వహణలను బలోపేతం చేసే దిశగా రాయచూర్ పట్టణం నడుం కట్టిన ప్రయత్నాల్లో ఓ ముఖ్య ఘట్టానికి ప్రతీకగా నిలిచింది.

బాగు చేసిన భూమిలో సంస్కరణ ప్రధాన పనులను పూర్తిచేశారు. 2026 జూన్ 5 నుంచి మొక్కలను నాటే పనులను మొదలుపెట్టారు. పునరుద్ధరించిన భూమిని ఉపయోగించడానికి రాయచూర్ సిటీ కార్పొరేషన్ సరికొత్త వైఖరిని అవలంబించింది. ‘‘విషపూరిత వ్యర్థాల నుంచి పర్యావరణ సంబంధిత సంపద’’ భావనతో స్పూర్తిని పొందిన ఈ నగరం.. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌పీఎమ్‌సీఐఎల్), న్యూ ఇండియా స్పేస్ ల సహకారంతో పునరుద్ధరించిన భూమి తాలూకు 5-7 ఎకరాల్లో మియావాకీ వనాన్ని అభివృద్ధిచేస్తోంది.
మొత్తం 60,000 మొక్కలు నాటారు. ఒక సంవత్సరం లోపు ఈ ప్రాంతంలో విజయవంతంగా అటీవీకరణం సాధ్యపడుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే పునరుద్ధరించిన భూమిలో హరిత ఆవరణ నెలకొంటుంది. ఇక్కడ వెదురు, ఇతర స్వదేశీ ప్రజాతుల మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలు భూమి పునరుద్ధరణ, వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ తొలగించి దానిని 'పూల్స్' అని పిలిచే వేరే ప్రదేశాల్లో నిల్వ చేయడం (కార్బన్ సీక్వెస్ట్రేషన్), జీవవైవిధ్యాన్ని పెంపొందింప చేయడం, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో తోడ్పడతాయి.
పాత రూపురేఖలను మార్చివేసిన ప్రాంతాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2026 జూన్ 5న కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ ఘట్టం పర్యావరణ స్థిరత్వం దిశగా ముందుకు సాగిపోవడంలో ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోంది.
యాకలాస్‌పురాలో చోటు చేసుకున్న మార్పులు ఒక్క వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు విజయానికే పరిమితం కావు.. ప్రభావవంతమైన పట్టణ పరిపాలన, వ్యూహాత్మక పెట్టుబడులు, స్వచ్ఛత పట్ల నిరంతర నిబద్ధత వల్ల కలిగిన ప్రభావానికి కూడా ఇది నిదర్శనం. దీర్ఘకాలంగా పర్యావరణానికి ఎదురవుతూ వచ్చిన ఒక సవాలును చూడముచ్చటైన పర్యావరణ మిత్రపూర్వక పర్యాటక స్థలంగా రాయచూర్ సిటీ కార్పొరేషన్ మార్చింది. చెత్తాచెదారానికి తావుండని, మన్నిక కలిగిన పట్టణ ప్రాంత భవితను తీర్చిదిద్దే దిశగా ఈ కార్పొరేషన్ ముందుకు వెళ్తూ, దేశవ్యాప్తంగా ఇతర పట్టణాలు తాము కూడా అనుసరించదగిన ఓ నమూనాను ఆవిష్కరించింది.
***
(रिलीज़ आईडी: 2300915)
आगंतुक पटल : 6