కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పూణేలో 2026 ఆగస్టు 17 నుంచి 21 వరకు


‘బ్రిక్స్ ఐసీటీ ట్రాక్‌’ కార్యక్రమాలను నిర్వహించనున్న కేంద్ర టెలీకమ్యూనికేషన్ల విభాగం

‘‘సుదృఢ భవిష్యత్తు కోసం నూతన ఆవిష్కరణలు, సహకారం, పరివర్తన (ఐసీటీ)’’..
ఇది ‘బ్రిక్స్ ఐసీటీ ట్రాక్‌’ ఇతివృత్తం

‘ఐసీటీ ట్రాక్‌’లో భాగంగా 3 కీలక కార్యక్రమాలుంటాయి;
అవి.. ఐసీటీలలో సహకారానికి ఉద్దేశించిన బ్రిక్స్ వర్కింగ్ గ్రూపు 7వ సమావేశం,
డిజిటల్ బ్రిక్స్ ఫోరమ్ అండ్ ఎక్స్‌పో, కమ్యూనికేషన్ల మంత్రుల 12వ సమావేశం

పూణే ‘బ్రిక్స్ ఐసీటీ ట్రాక్’ సందర్భంగా చర్చల్లో పాలుపంచుకోనున్న బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు

ఐసీటీలో అంతర్జాతీయ సహకారాన్ని పటిష్ఠపరచడం, డిజిటల్ నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం,
సాంకేతికత ఆధారిత, దీర్ఘకాలిక, సమ్మిళిత అభివృద్ధిని పెంపొందించడం పట్ల
భారత్ నిబద్ధతను చాటనున్న ‘బ్రిక్స్ ఐసీటీ ట్రాక్’

प्रविष्टि तिथि: 15 AUG 2026 2:58PM by PIB Hyderabad

బ్రిక్స్‌కు ఈ సంవత్సరం (2026) అధ్యక్ష పదవీబాధ్యతలను భారత్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ‘బ్రిక్స్ ఐసీటీ ట్రాక్’ (ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ట్రాక్)ను టెలీకమ్యూనికేషన్ల విభాగం (డీఓటీ) ఈ నెల 17 నుంచి 21 వరకూ పూణేలో ఏర్పాటు చేయనుంది. ‘‘సుదృఢ భవిష్యత్తు కోసం నూతన ఆవిష్కరణలు, సహకారం, పరివర్తన (ఐసీటీ)’’ను ‘ఐసీటీ ట్రాక్‌’కు ఇతివృత్తంగా తీసుకున్నారు. బ్రిక్స్ వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ రంగాలకు సంబంధించి దేశం నలుమూలలా నిర్వహిస్తున్న వరుస సమావేశాల్లో ‘ఐసీటీ ట్రాక్’ ఒకటి. ప్రపంచంలో ఎదుగుతున్న మార్కెట్లు, అభివృద్ది చెందుతున్న దేశాలు మొత్తం పదకొండు ‘బ్రిక్స్’ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. అవి.. బ్రెజిల్, చైనా, ఈజిప్టు, ఇథియోపియా, భారత్, ఇండొనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.

అయిదు రోజుల పాటు కొనసాగే ఐసీటీ ట్రాక్‌లో.. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన కమ్యూనికేషన్స్ శాఖ మంత్రులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఐసీటీ నిపుణులు పాల్గొంటారు. వారు సమాచారం, కమ్యూనికేషన్ సాంకేతికత రంగాల్లో సహకారాన్ని పెంపొందింప చేసుకోవడానికి, డిజిటల్ రంగంలో  సురక్షిత, సమ్మిళిత, దృఢతర భవితను ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఈ అయిదు రోజుల్లోనూ మూడు కీలక కార్యక్రమాలను నిర్వహిస్తారు:
ఐసీటీలలో సహకారానికి ఉద్దేశించిన బ్రిక్స్ వర్కింగ్ గ్రూపు 7వ సమావేశం.. 2026 ఆగస్టు 17 నుంచి 19 వరకూ
2026 ఆగస్టు 17 నుంచి 19 వరకూ నిర్వహించే 7వ బ్రిక్స్ ఐసీటీ వర్కింగ్ గ్రూపు సమావేశంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రతినిధులు సార్వత్రిక, సార్థక, తక్కువ ఖర్చుతో కూడిన, పటిష్ఠమైన కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకొని ఐసీటీ విస్తారిత అనుబంధ వ్యవస్థల (ఇకోసిస్టమ్స్)ను రూపొందించడంపై చర్చిస్తారు. అలాగే విశ్వసనీయమైన, సురక్షితమైన, మానవుల పట్ల మిత్రపూర్వకంగా ఉండే డిజిటల్ వాతావరణాన్ని నెలకొల్పడం, సమ్మిళిత అభివృద్ధికి దోహదం చేసే డిజిటల్ నైపుణ్యాలనూ, సామర్థ్యాలనూ పెంచడం, కృత్రిమ మేధ (ఏఐ), నవతరం కమ్యూనికేషన్లు, డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజలకు వివిధ సేవలను అందించడం, సైబర్ భద్రత కల్పన, ఇంటర్‌నెట్‌ను బాలలు సురక్షిత విధానాల్లో ఉపయోగించుకొనేటట్లు చూడడం, డిజిటల్ ఇకోసిస్టమ్ పరంగా పరస్పరం సహకారాన్ని అందజేసుకోవడంతో పాటు, ఐసీటీలో నూతన ఆవిష్కరణలను, అంకుర సంస్థలను, ఔత్సాహిక పారిశ్రామికత్వాన్ని పటిష్ఠపరచడం వంటి కీలక ప్రాధాన్య రంగాలపై కూడా వారు చర్చించనున్నారు.
2026 ఆగస్టు 20న ‘డిజిటల్ బ్రిక్స్ ఫోరమ్ అండ్ ఎక్స్‌పో’
భారత్ 2026 ఆగస్టు 20న ‘డిజిటల్ బ్రిక్స్ ఫోరమ్ అండ్ ఎక్స్‌పో’ను ఏర్పాటు చేయనుంది.  ఇప్పుడిప్పుడే ఉనికిలోకి వస్తున్న డిజిటల్ సాంకేతికతలతో పాటు సుదృఢ ఐసీటీ ఇకోసిస్టమ్స్‌లో సహకారం గురించి చర్చించడానికీ, ప్రదర్శనలో పాలుపంచుకోవడానికీ ఒక వేదికగా ఇది ఉపయోగపడనుంది.
సైబర్ భద్రత, విశ్వసనీయ ఐసీటీలు అన్న అంశాలపై బృంద చర్చలకు ఈ ఫోరమ్‌లో అవకాశం కల్పిస్తారు. ఆన్‌లైన్ సేవలను బాలలు సురక్షితంగా వినియోగించుకొనే విధానాల్ని రూపొందించడం, మన్నికైన, దృఢతర డిజిటల్, ఐసీటీ ఇకోసిస్టమ్స్ రూపకల్పన వంటి అంశాలు కూడా ఈ చర్చలలో చోటు చేసుకుంటాయి.
బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల 12వ సమావేశం
2026 ఆగస్టు 20న బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల 12వ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో భారత్ పక్షాన కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎమ్. సింధియా పాల్గొంటారు. బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు కూడా ఈ సమావేశంలో  పాల్గొని, బ్రిక్స్ ఐసీటీ ట్రాక్ కు సంబంధించిన ప్రాధాన్యాలపై చర్చిస్తారని భావిస్తున్నారు. వారు మన్నికైన, దృఢతర ఐసీటీ ఇకోసిస్టమ్స్, సైబర్ భద్రత, విశ్వసనీయ ఐసీటీ, డిజిటల్ నైపుణ్య సాధన, సామర్థ్యాల పెంపు, నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికత్వం రంగాల్లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నారు.
బ్రిక్స్‌ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తున్న కాలంలో ఈ మూడు కీలక కార్యక్రమాలనూ నిర్వహించనుండడం.. ఐసీటీ రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడం, డిజిటల్ రంగంలో నూతన ఆవిష్కరణలతో పాటు సాంకేతికత ఆధారిత, దీర్ఘకాలిక, సమ్మిళిత అభివృద్ధిని కూడా ప్రోత్సహించడం పట్ల భారత్ కనబరుస్తున్న నిబద్ధతకు అద్దం పడుతోంది.

మరింత సమాచారం కోసం డీఓటీ హ్యాండిళ్లను చూడగలరు: -

‘ఎక్స్’లో అయితే - https://x.com/DoT_India

‘ఇన్‌స్టా’లో అయితే -  https://www.instagram.com/department_of_telecom?igsh=MXUxbHFjd3llZTU0YQ==

‘ఫేస్‌బుక్‌లో అయితే - https://www.facebook.com/DoTIndia

‘యూట్యూబ్’లో అయితే - https://youtube.com/@departmentoftelecom?si=DALnhYkt89U5jAaa

 

 

***


(रिलीज़ आईडी: 2300025) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Gujarati