సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సూర్యపథ్ తిరంగా గ్లోబల్ రిలే ప్రారంభం - సూర్యుని మార్గంలో యాత్ర.
प्रविष्टि तिथि:
15 AUG 2026 1:59PM by PIB Hyderabad
ఉదయిస్తున్న సూర్యుని గమనాన్ని అనుసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా త్రివర్ణ పతాకం ప్రయాణించే వినూత్న కార్యక్రమం - సూర్యపథ్ తిరంగా గ్లోబల్ రిలే - అధికారికంగా ప్రారంభమైంది. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భారత కాలమానం ప్రకారం నేటి తెల్లవారుజామున 1:30 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు, ఈ గ్లోబల్ రిలేలో భాగంగా తూర్పు నుంచి పడమర వరకు ఉన్న వివిధ దేశాలలోని 21 భారత రాయబార, దౌత్య కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేర్వేరు టైమ్ జోన్ లలో ఉదయిస్తున్న సూర్యుని ప్రయాణాన్ని సూచనాత్మకంగా అనుసరిస్తూ సాగిన ఈ వినూత్న కార్యక్రమం ఖండాంతరాలలో భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని, ఐక్యతను, జాతీయ గర్వాన్ని చాటిచెప్పింది.
సూర్యపథ్ తిరంగా కార్యక్రమంలో భాగంగా, ఎంపిక చేసిన భారత రాయబార, దౌత్య కార్యాలయాల్లో క్రమానుగతంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ త్రివర్ణ పతాకం ప్రపంచమంతటా పయనిస్తుంది. ప్రపంచంలోని ఒక ప్రాంతంలో సూర్యోదయం కాగానే అక్కడ జాతీయ జెండాను ఎగురవేస్తారు, అనంతరం దానికి పశ్చిమంగా ఉన్న తదుపరి రాయబార కార్యాలయం జెండాను ఆవిష్కరిస్తుంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా త్రివర్ణ పతాక నిరంతర యాత్ర కొనసాగుతుంది.
హర్ ఘర్ తిరంగా 2026వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భారత త్రివర్ణ పతాకం భౌగోళిక సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను, భారత అభిమానులను ఒకటిగా అనుసంధానిస్తుందనే సందేశాన్ని ఇది మరింత బలోపేతం చేస్తోంది.
ఈ గ్లోబల్ రిలే భారత ఐక్యతకు, దేశభక్తికి అంతర్జాతీయ వేదికపై దేశ భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయిస్తున్న సూర్యుని మార్గాన్ని అనుసరిస్తూ త్రివర్ణ పతాకం పయనిస్తుండగా, విదేశాల్లోని భారత రాయబార, దౌత్య కార్యాలయాలు దేశ స్ఫూర్తికి దూతలుగా వ్యవహరిస్తున్నాయి.
సూర్యపథ్ తిరంగా తూర్పున ఉదయించే తొలి కిరణాలతో ప్రారంభమై, పశ్చిమం వైపు సాగుతూ వికసిత్ భారత్ స్ఫూర్తి, జాతీయ గర్వం, ఐక్యతను చాటేలా ప్రపంచవ్యాప్తంగా కాలగమనాన్ని జాతీయ పతాకం ప్రతీకాత్మక ప్రయాణంగా ఆవిష్కరిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2299879)
आगंतुक पटल : 10