రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
‘2026-27 శీతాకాల ఇంటర్న్‌షిప్ కార్యక్రమం’, ‘2027 టర్మ్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం’ కోసం అభ్యర్థుల్ని చేర్చుకొనే ప్రక్రియ మొదలుపెట్టిన ఎన్‌హెచ్ఏఐ
పనులు జరుగుతున్న 125 జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో 1,080 కన్నా ఎక్కువ ఇంటర్న్‌షిప్ అవకాశాలు
అర్హత కలిగిన విద్యార్థులు 2026 అక్టోబరు 20 కల్లా ఎన్‌హెచ్ఏఐ వెబ్‌సైట్లో దరఖాస్తు చేయొచ్చు
प्रविष्टि तिथि:
14 AUG 2026 4:11PM by PIB Hyderabad
భావి వృత్తి నిపుణులను తీర్చిదిద్దడానికి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) ‘2026-27 శీతాకాల ఇంటర్న్‌షిప్ కార్యక్రమాని’కీ, ‘2027 టర్మ్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాని’కీ అభ్యర్థులను నమోదు చేసుకోవడం మొదలుపెట్టింది. నిర్దిష్ట రంగానికి సంబంధించిన అనుభవాన్ని పొందడానికి సహాయపడే ఈ కార్యక్రమాల్లో మొదట ప్రస్తావించిన శీతాకాల ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం డిసెంబరు నుంచి వచ్చే ఏడాది జనవరి వరకూ, రెండోదైన టర్మ్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి మొదలు జూన్ వరకూ కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమాలను దేశంలో అతి పెద్దదైన జాతీయ రహదారి అభివృద్ధి సంబంధిత విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)లో ప్రత్యక్ష అనుభవాన్ని సంపాదించుకొనే అవకాశాన్ని విద్యార్థులకు ఇవ్వడానికి రూపొందించారు. వీటిలో పాలుపంచుకొనే విద్యార్థులు.. అనుభవజ్ఞులైన ఎన్‌హెచ్ఏఐ వృత్తినిపుణుల మార్గదర్శకత్వంలో ప్రస్తుత ప్రాజెక్టులు, అప్పగించిన పనులలో ఆచరణాత్మక అనుభవాన్ని పొందనున్నారు.
‘శీతాకాల ఇంటర్న్‌షిప్ కార్యక్రమం’ ఈ ఏడాది డిసెంబరు మొదలు వచ్చే సంవత్సరంలో జనవరి వరకూ ఒక నెల రోజుల పాటు ఉంటుంది. ‘టర్మ్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని’ 2027 జనవరి నుంచి జూన్ వరకూ ఆరు నెలల పాటు నిర్వహిస్తారు. వివిధ విద్యాసంస్థల్లో విద్యాబోధన కాలాల్లో వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని, విద్యార్థులు నిర్దిష్ట ఇంటర్న్‌షిప్ కాలంలో తమకు వీలుగా ఉండే ఇంటర్న్‌షిప్ గడువును తెలియజేయవచ్చు.
‘శీతాకాల ఇంటర్న్‌షిప్ కార్యక్రమం’లో 541 మందికి, ‘టర్మ్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం’లో 542 మందికి ఇంటర్న్‌షిప్ ఇవ్వాలని సంకల్పించారు. శిక్షణను కోరుకున్న విద్యార్థులను జాతీయ రహదారులతో సంబంధం ఉన్న 125 ప్రస్తుత ప్రాజెక్టులతో పాటు ఎన్‌హెచ్ఏఐ, ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఐహెచ్ఎమ్‌సీఎల్)లకు చెందిన వివిధ విభాగాలకు కేటాయిస్తారు. ఎంపికైన శిక్షణార్థులు ఎన్‌హెచ్ఏఐ అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తూ, జాతీయ రహదారులకు సంబంధించిన పథక రచన, నిర్మాణం, కార్యకలాపాల నిర్వహణ, ప్రాజెక్టు నిర్వహణ, రహదారి భద్రత, చట్టపరమైన అంశాలు, ఆర్థిక, ప్రసార మాధ్యమాల సంబంధిత, తదితర కీలక రంగాల్లో ఆచరణాత్మక అనుభవాన్ని సంపాదిస్తారు.
అర్హత ప్రమాణాలు
భారత్‌లో గాని, లేదా విదేశాల్లో గాని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి సివిల్ ఇంజినీరింగ్, సమాచార సాంకేతికత, కంప్యూటర్ సైన్సు, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, కృత్రిమ మేధతో పాటు ఇతర సంబంధిత విభాగాల్లో చివరి సంవత్సరం, ప్రి-ఫైనలియర్ అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఈ కార్యక్రమాలలో చేరడానికి అర్హత ఉంటుంది. అలాగే, బిఎ ఎల్ఎల్‌బీ, న్యాయశాస్త్రం, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, రాజభాష, మానవ వనరులు, పారిశ్రామిక సంబంధాలు, సిబ్బంది నిర్వహణలో ఎం.ఎ., మానవ వనరులు, ఫైనాన్స్, మార్కెటింగ్ లో ఎం.బి.ఎ. లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు కూడా ఈ శిక్షణ కార్యక్రమాల్లో చేరవచ్చు.
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగులు, తదితర గుర్తింపు పొందిన విద్యాసంబంధ ప్రమాణాల ఆధారంగా అర్హత కలిగిన సంస్థలను ఎంపిక చేశారు. ఐఐటీలూ, ఎన్ఐటీల వంటి ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఐఐటీల విద్యార్థులకు 100 సీట్లనూ, ఎన్ఐటీల విద్యార్థులకు 150 సీట్లనూ ప్రత్యేకించారు. ఎంపికైన శిక్షణార్థులు ఎన్‌హెచ్ఏఐ ఇంటర్న్‌షిప్ విధాన నిబంధనావళి ప్రకారం నెలకు రూ.20,000 స్టైపెండ్ పొందుతారు. శిక్షణను ముగించిన తరువాత వారికి సర్టిఫికెట్లను కూడా ఇస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు ప్రక్రియను ఎన్‌హెచ్ఏఐ ఇంటర్న్‌షిప్ వెబ్‌సైట్ https://internshipsatnhai.digitalindiacorporation.in/ ద్వారా పూర్తి చేస్తారు. ఈ వెబ్‌సైట్ దరఖాస్తుల దాఖలుకు, దరఖాస్తులను సంస్థలు సరిచూసే ప్రక్రియకు, ఎన్‌హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఎంపికతో పాటు పూర్తి ఇంటర్న్‌షిప్ ప్రక్రియ నిర్వహణకు కూడా తోడ్పడుతుంది. విద్యార్థులు తమ విద్యార్హత వివరాలతో పాటు శిక్షణకు ఎంచుకున్న అవధి, ఎక్కడ శిక్షణను స్వీకరించడానికి మొగ్గు చూపుతున్నారనే విషయాలను.. అవి వర్తించే సందర్భాల్లో.. ప్రస్తావిస్తూ, దరఖాస్తులను ఆన్‌లైన్లో సమర్పించాలి. వాటిని సంస్థలు వెబ్‌సైట్లో సరిచూసి, అర్హత కలిగిన దరఖాస్తులను సిఫార్సు చేస్తాయి. సంస్థలు ఆమోదం తెలిపిన దరఖాస్తులనే శిక్షణార్థుల ఎంపిక కోసం ఎన్‌హెచ్ఏఐ పరిశీలిస్తుంది. ప్రతిభ, ప్రాధాన్యాలు, లభ్యత.. ఈ అంశాల ప్రాతిపదికన ఆయా ప్రాజెక్టులకు శిక్షణార్థుల తుది కేటాయింపును ఎన్‌హెచ్ఏఐ ఖరారు చేస్తుంది.
దరఖాస్తు చేయడానికి చివరి గడువు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తుల్ని 2026 అక్టోబరు 20 లోపల ఎన్‌హెచ్ఏఐ ఇంటర్న్‌షిప్ వెబ్‌సైట్ ద్వారా దాఖలు చేయవచ్చు. తదనుగుణంగా, సంస్థలు తమ సిఫార్సుల ప్రక్రియను 2026 నవంబరు 10 కల్లా పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్హత ప్రమాణాలు, దరఖాస్తుకు సంబంధించిన మార్గదర్శకాలు, ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని ఎన్‌హెచ్ఏఐ ఇంటర్న్‌షిప్ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు.
పరిశ్రమకు, విద్యాసంస్థలకు మధ్య సహకారం బలోపేతం
ఇంతవరకు నిర్వహించిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలకు విద్యార్థులే కాకుండా విద్యాసంస్థలు కూడా చాలా చక్కగా స్పందించాయి. పరిశ్రమకు, విద్యాసంస్థలకు మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని అర్హులైన విద్యార్థులకు తెలియజేస్తూ, వారు సకాలంలో దరఖాస్తులను దాఖలు చేయడానికి తోడ్పడాలనీ, ఇంటర్న్‌షిప్ ప్రక్రియలో సహకరించడానికి ఫేకల్టీ సమన్వయకర్తలను నామినేట్ చేయాలనీ విద్యాసంస్థలనూ, విశ్వవిద్యాలయాలనూ ఎన్‌హెచ్ఏఐ కోరింది.
ఎన్‌హెచ్ఏఐ అందిస్తున్న ‘2026-27 శీతాకాల ఇంటర్న్‌షిప్’, ‘2027 టర్మ్ ఇంటర్న్‌షిప్’ కార్యక్రమాలు విద్యార్థుల నైపుణ్యానికి మెరుగులు దిద్దడమే కాక వారి సామర్థ్యాలను పెంచడానికి కూడా దోహదం చేసి, భారత్‌లో శరవేగంగా దూసుకుపోతున్న జాతీయ రహదారి రంగానికి ఎంతో విలువైన తోడ్పాటును అందించనున్నాయి.
***
(रिलीज़ आईडी: 2299637)
आगंतुक पटल : 5